4 ఎంపీ, 9 ఎమ్మెల్యే స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన
పట్టుబట్టి భీమిలి సీటు సాధించుకున్న గంటా
ఇష్టం లేకపోయినా చీపురుపల్లికి కళా వెంకట్రావు
ఆలూరులో కోట్ల సుజాతకు షాక్.. వీరభద్రగౌడ్‌కు టికెట్
ఫిరాయింపు నేత గుమ్మనూరుకు గుంతకల్లు ఖరారు
కదిరిలో యశోద స్థానంలో ఆమె భర్త కందికుంట ప్రసాద్
రెబల్ భయంతో భూపేష్‌రెడ్డికి కడప ఎంపీ సీటు
ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసరెడ్డికి..
సాక్షి, అమరావతి: టీడీపీ అభ్యర్థుల తుది జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎట్టకేలకు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 9 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేశారు. దీంతో 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో 94 సీట్లు ప్రకటించినా పి.గన్నవరం అభ్యర్థి రాజేష్ని అన్ని వర్గాలు వ్యతిరేకించడంతో ఆయనకు సీటు ఉపసంహరించారు.
ఈ జాబితాలోనే అనపర్తి, అరకు సీట్లు ఖరారు చేసినా అవి రెండు బీజేపీకి వెళ్లడంతో వాటిని వదులుకున్నారు. రెండో జాబితాలో ఖరారు చేసిన కదిరి స్థానంలో తాజాగా మార్పులు చేశారు. మొదటి జాబితాలో 13 ఎంపీ స్థానాలకు ప్రకటించగా పొత్తులో మిగిలిన నాలుగు సీట్లకు ఇప్పుడు అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో టీడీపీ పోటీ చేసే చోట్ల మొత్తం అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది.
చీపురుపల్లికి కళా వెంకట్రావు
చీపురుపల్లి సీటును చివరికి రాష్ట్ర టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అంటగట్టారు. ఓడిపోయే ఆ స్థానంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోటీ చేయించడానికి ఎంత ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. దీంతో కళా వెంకట్రావును అక్కడ పోటీ చేయించాలని నిర్ణయించారు. ఆయన ఇన్‌ఛార్జిగా ఉన్న ఎచ్చెర్ల సీటు పొత్తులో బీజేపీకి కేటాయించడంతో కళాకు చీపురుపల్లి సీటు ఇచ్చారు. దీనికి ఆయన చాలారోజులు ఒప్పుకోకపోయినా బుజ్జగించి ఖరారు చేశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు కోసం మొదటి నుంచి గట్టిగా పట్టుబడిన గంటా చివరికి దాన్ని దక్కించుకున్నారు.
ఒక దశలో ఆ సీటు జనసేనకు వెళ్లే పరిస్థితి ఏర్పడగా గంటా పెద్దఎత్తున లాబీయింగ్ చేయడంతోపాటు భారీగా డబ్బులిచ్చి విశాఖ జిల్లాలో నాలుగు స్థానాల ఆర్థిక బాధ్యతలు కూడా చూసుకునేందుకు ముందుకు రావడంతో ఆయనకే సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. అరకు జిల్లా పాడేరు (ఎస్టీ) స్థానాన్ని కిల్లు వెంకట రమేష్‌నాయుడుకి ఇచ్చారు.
మొదట ఈ సీటును బీజేపీకి కేటాయించే ఉద్దేశంతో అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీజేపీ అరకు సీటును తీసుకోవడంతో ఆ స్థానంలో ఖరారు చేసిన దొన్నుదొర అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఉపసంహరించుకుంది. దాని బదులు ఇప్పుడు పాడేరు స్థానంలో అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థి దొరకని దర్శి స్థానానికి బయట ప్రాంతం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దిగుమతి చేసుకుని సీటు కేటాయించారు.
అసంతృప్త నేత సుబ్రహ్మణ్యంకు రాజంపేట
రాయచోటి ఎమ్మెల్యే, రాజంపేట ఎంపీ సీట్లలో ఏదీ దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న సుగవాసి సుబ్రహ్మణ్యంకు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న భత్యాల చెంగల్రా యుడు, జగన్మోహనరావుకు షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆలూరు స్థానాన్ని వీరభద్రగౌడ్‌కి కేటాయించి కోట్ల సుజాతమ్మకు షాక్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ఆ లూరు సీటు ఇవ్వకపోవడంతో టీడీపీలోకి ఫిరాయించిన గుమ్మనూరు జయరామ్‌కి గుంతకల్లు టికెట్ ఇ చ్చారు.
అనంతపురం అర్బన్ సీటును దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి కేటాయించి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి ఝలక్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కదిరి స్థానంలోనూ మార్పు చేశారు. ఈ స్థానాన్ని ఆశించిన కందికుంట ప్రసాద్‌పై నకిలీ డీడీల కేసు ఉండడంతో రెండో జాబితాలో ఆయన భార్య యశోదా దేవికి సీటు ఇచ్చారు. అయితే ప్రసాద్‌పై కేసును కోర్టు కొట్టివేయడంతో యశోదాదేవి బదులు ఇప్పుడు ప్రసాద్‌కి సీటు ఖరారు చేశారు.
కడపలో ఫలించని బాబు తంత్రం
పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎచ్చెర్ల సీటు దక్కక అసంతృప్తితో ఉన్న కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ సీటును కేటాయించారు. ఒంగోలు సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఖరారు చేశారు. అనంతపురం ఎంపీ స్థానాన్ని అంబికా లక్ష్మీ నారాయణకు ఇచ్చి జేసీ కుటుంబానికి షాక్ ఇచ్చారు. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి ఈ సీటు కోసం లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. కడప ఎంపీ సీటును జమ్మలమడుగు ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్రెడ్డికి కేటాయించారు.
జమ్మలమడుగు సీటు బీజేపీకి వెళ్లడంతో భూపేష్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ నేత, తన బాబాయి ఆదినారాయణరెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉండడంతో తప్పని పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు ఇచ్చారు. వైఎస్ వివేకా హత్యోదంతాన్ని అడ్డు పెట్టుకుని కడప ఎంపీ సీటుపై రాజకీయం చేయాలని ప్రయత్నించిన చంద్రబాబు చివరికి అభాసుపాలై అసంతృప్త నేతకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment