ఆరు లోక్‌సభ.. 10 అసెంబ్లీ స్థానాలు కొలిక్కి
కేంద్ర ఎన్నికల కమిటీలో జాబితాపై నిర్ణయం
హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా
ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధంచేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో గత కొన్నిరోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధంచేసిన అభ్యర్థుల జాబితాపై కూలంకషంగా చర్చించారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ డా. కె.లక్ష్మణ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ..
సీఈసీ భేటీలో ఏపీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ సహా మొత్తం 11 రాష్ట్రాల నాయకత్వాలు సిద్ధంచేసిన లోక్‌సభ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలపై వారితో విడివిడిగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజులు ఈ భేటీలో పాల్గొన్నారు.
పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించిన ఆరు స్థానాల విషయంలో రాష్ట్ర సీనియర్ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో ఎవరి అభ్యర్థిత్వానికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే అంశంపై ఆసక్తి నెలకొంది. పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. రాజమండ్రి, రాజంపేట, అమలాపురం, తిరుపతి, అరకు, నరసాపురం, విజయనగరం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారన్న ఊహాగానాల నేపథ్యంలో ఏ ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇక టీడీపీ గెలిచే స్థానాలను తమ వద్ద ఉంచుకుని మిగిలిన స్థానాలను తమకు కేటాయించిందని అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాష్ట్ర సీనియర్ నాయకులు ఇటీవల రాసిన లేఖను అధిష్టానం ఏ మేరకు సీరియస్‌గా తీసుకుందనేది ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా విడుదలయ్యే జాబితాతో వెల్లడవుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment