14 లోక్‌సభ స్థానాల పరిధిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి
ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పునప్రతిపాదిత అభ్యర్థుల జాబితా సిద్ధం
మిగిలిన 11 లోక్‌సభ స్థానాల పరిధిలోని అభ్యర్థుల ఎంపికపై నేడు కొనసాగనున్న ఎంపిక ప్రక్రియ
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసంజాతీయ నాయకత్వం సూచనల మేరకు కేంద్ర పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చారు. ఆయన శనివారం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశమై, ఆ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానం కోసం ముగ్గురు చొప్పున ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను తీసుకున్నారు.
ఆ జాబితాలోనూ మొదటి, రెండు, మూడవ ప్రాధాన్యతగా ఏ నేతల పేర్లను ఆయా జిల్లా కమిటీలు సూచిస్తున్నాయో అడిగి తెలుసుకుని మరీ జాబితాను సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా శివప్రకాష్‌తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌లతో కూడిన కమిటీ విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా పార్టీ నేతలతో ఈ సమావేశాలు నిర్వహించింది.
తొలి రోజు రాయలసీమ నాలుగు జిల్లాల పరిధిలోని 8 లోక్‌సభ స్థానాలు, ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని 5 లోక్‌సభ స్థానాలతో పాటు నరసరావుపేటతో కలిపి మొత్తం 14 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 98 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సంబంధించి ముగ్గురు చొప్పున∙ప్రతిపాదిత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిసింది. మిగిలిన 11 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఈ తరహాలోనే ముగ్గురు చొప్పున ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసేందుకు ఆదివారం ఆయా జిల్లాల నాయకులతో సమావేశాలు కొనసాగనున్నాయి.
కాగా, ఈ సమావేశాల్లో పొత్తులకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ చెప్పారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల వ్యవహారం ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment