జనబలమే గీటురాయిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపిక
సామాజిక న్యాయమే లక్ష్యంగా సమతూకం
మెరుగైన ఫలితాల సాధన దిశగా ముందడుగు
ఒకేసారి 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి బీసీల కోసం నిలబడిన నేత సీఎం జగన్
పెట్టుబడి పార్టీలకు ముఖ్యమంత్రి నిర్ణయం గొడ్డలిపెట్టు
చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణపైనా పోటీ చేసేది బీసీలే
సాక్షి,అమరావతి: సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ చేసి చూపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే స్పష్టం చేసిన ఆయన అదే నినాదాన్ని అక్షరసత్యం చేశారు. 50 శాతం సీట్లు బడుగు బలహీనవర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. ఈ నిర్ణయం అనన్యసామాన్యం.. అనితర సాధ్యం. ఇది ఇప్పటివరకు ఎవరూ సాహసించని అరుదైన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతోంది.
ఒక్క అనకాపల్లి పార్లమెంట్ స్థానం మినహా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు శనివారం ఇడుపులపాయ వేదికగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పవిత్ర సమాధి సాక్షిగా వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు.
టీడీపీ అగ్రజులపై బీసీల పోటీ
కుప్పంలో చంద్రబాబుపై వన్నికుల క్షత్రియకు చెందిన కేఆర్‌జే భరత్, మంగళగిరిలో నారా లోకేశ్‌పై పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణపై కురుబ సామాజిక వర్గానికి చెందిన టీజీఎన్ దీపిక పోటీకి దిగుతున్నారు. వీరు ముగ్గురూ బీసీలే కావటం విశేషం.
గత ఎన్నికల్లోనూ బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం
గత ఎన్నికల్లోనూ ప్రాధాన్యం వైఎస్సార్ సీపీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 41 శాసనసభ స్థానాల్లో అవకాశం కల్పించింది. ఇందులో మహిళలకు 15, మైనార్టీలకు 5 స్థానాల్లో అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల కంటే ఇప్పుడు శాసనసభ స్థానాల్లో మహిళలకు నాలుగు, మైనార్టీలకు రెండు స్థానాలు అదనంగా కేటాయించింది. పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 7 లోక్‌సభ స్థానాల్లో సీఎం జగన్ అవకాశం ఇచ్చారు.
గత ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల్లో మహిళలకు నాలుగు చోట్ల అవకాశం కల్పిస్తే ఇప్పుడు ఐదు నియోజకవర్గాలు కేటాయించారు. సామాజిక న్యాయం, జనులకు సుపరిపాలనే లక్ష్యంగా సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తునూ పణంగా పెట్టి ఇంతలా బీసీల కోసం నిలబడిన నేత మరొకరు లేరని శ్లాఘిసు్తన్నారు. డబ్బు, పొత్తులు, ఎత్తులను నమ్ముకొని ఎన్నికల క్షేత్రానికి వచ్చే టీడీపీ, బీజేపీ, జనసేన లాంటి పెట్టిబడి పార్టీలకు సీఎం జగన్ నిర్ణయం గొడ్డలిపెట్టు అని మేధావులు అభివర్ణిస్తున్నారు.
ప్రతిపక్ష కూటమి బీసీలకు ఇచ్చింది 25 సీట్లే
వైఎస్సార్ సీపీ బీసీలకు 48 సీట్లు కేటాయిస్తే ఇప్పటివరకు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, అందులో బీసీలకు కేవలం 25 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
సీఎం చెప్పారంటే.. చేస్తారంతే..
సీఎం జగన్ చెప్పారంటే ... చెస్తారంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఓ సభలో మాట్లాడుతూ ‘‘సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమస్యలు ఏవైనా ఉంటే తక్షణం పరిష్కారానికి పూనుకునే వారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా బీసీలు, మహిళలు, పేదల ఉజ్వల భవిత కోసం పరితపిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాల సాధికారత దిశగా కృషి చేస్తున్నారు. ఆయన చెప్పిందే చేస్తున్నారు.
ఆయన వెంట నడవాల్సిన బాధ్యత మన బీసీలతోపాటు అన్ని కులాలు, అన్నివర్గాలపైనా ఉంది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, బీజేపీ ప్రలోభాలకు లొంగవద్దు’’ అన్నారు. ఇప్పుడు కృష్ణయ్య మాటలను నిజం చేస్తూ సీఎం జగన్ అభ్యర్థుల ప్రకటనల్లో బీసీలకు, మహిళలకు పూర్తి న్యాయం చేశారు. కనుక ఇక వైఎస్సార్‌సీపీకి మద్దతునిచ్చే బాధ్యత బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపైనే ఉందనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment