శివరాత్రి సమయంలో ఉగ్రదాడులకు కుట్ర?
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో.. శివరాత్రి పుణ్యదినం సందర్భంలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ విషయం తమకు అత్యంత విశ్వసనీయంగా తెలిసిందని, అయితే ఆ దాడిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని భారత ఆర్మీకి చెందిన ఓ టాప్ కమాండర్ చెప్పారు. భద్రతకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, శివరాత్రి సందర్భంగా తమకు కొన్ని ఎలర్టులు వచ్చాయని, దాంతో అదనపు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజే సింగ్ తెలిపారు.
దాని గురించిన వివరాలు తెలియజేయాలని కోరగా, చెప్పేందుకు నిరాకరించారు గానీ.. ఆ దాడులతో విస్తృత ప్రచారం పొందాలన్నది వాళ్ల ప్లాన్ అని మాత్రం అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయం కాబట్టి మరింత ప్రచారం వస్తుందని అలా చేయాలనుకుంటున్నారన్నారు. పండుగ సమయంలోను, పార్లమెంటు జరుగుతున్నప్పుడు అంటే డబుల్ ప్రభావం ఉంటుందని కుట్ర పన్నినట్లు వివరించారు. అందుకే పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు సింగ్ తెలిపారు.