shooting Event
-
వైజాగ్ లో పుష్ప-2 షూటింగ్లో బిజీగా అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
-
వయసు 58... ఉత్సాహం 18: కాంస్యం సాధించిన షూటర్
2016 రియో ఒలింపిక్స్... షూటింగ్ స్కీట్ ఈవెంట్లో 53 ఏళ్ల అబ్దుల్లా అల్ రషీదీ కాంస్య పతకం సాధించాడు. అయితే అతనిలో ఏమాత్రం ఆనందం లేదు. తన సొంత దేశం కువైట్‌పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించి ఉండటంతో అతను ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్‌గా బరిలోకి దిగాడు. ఫుట్‌బాల్ క్లబ్ ‘అర్సెనల్’ జెర్సీ వేసుకొని పతకం అందుకోగా... వేడుక సమయంలో ఒలింపిక్ పతాకం మాత్రమే ఎగిరింది. ఇది అతడిని చాలా బాధించింది. అంతే... తాను మళ్లీ ఒలింపిక్స్ ఆడాలని, దేశం తరఫున పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా అనుకోవడమే కాదు... ఐదు సంవత్సరాల తర్వాత దానిని సాధించి చూపించాడు. 58 ఏళ్ల వయసులో అదే స్కీట్ ఈవెంట్లో మళ్లీ కాంస్యం గెలిచి కువైట్ జాతీయ పతాకం ఎగురుతుండగా సగర్వంగా నిలబడ్డాడు. టోక్యో క్రీడల్లో పతకం సాధించిన అతి పెద్ద వయస్కుడి గా రషీదీ నిలవడం విశేషం. 1996 నుంచి వరుసగా విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న రషీదీకి ఇవి ఏడో ఒలింపిక్స్ కావడం విశేషం. తొలి ఐదు సందర్భాల్లో 42, 14, 9, 9, 21 స్థానాల్లో నిలిచినా, అతను వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే వచ్చాడు. సోమవారం ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి పతకం కోసం రషీదీతో చివరి వరకు పోటీ పడిన ఈటూ కలినన్ (ఫిన్లాండ్)... రషీదీ తొలి ఒలింపిక్స్ ఆడే సమయానికి పుట్టనే లేదు! అన్నట్లు అతని కుమారుడు తలాల్ అలా రషీదీ కూడా షూటరే. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తండ్రితో కలిసి బరిలోకి దిగిన తలాల్, ఈసారి కూడా ‘ట్రాప్’ ఈవెంట్లో మళ్లీ ఆడుతున్నాడు. చివరగా... ఇంతటితో ఆగిపోనని చెబుతున్న రషీదీ, రిటైర్మెంట్ వయసు (61) వచ్చినా సరే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా పోటీ పడతానని ప్రకటించడం విశేషం! అదో అంకె మాత్రమే... టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన పెద్ద వయస్కురాలిగా మేరీ హనా (ఆస్ట్రేలియా) నిలిచింది. 66 ఏళ్ల హనా ఈక్వెస్ట్రియన్‌లో ఏడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. అమెరికా ఈక్వెస్ట్రియన్ జట్టు సభ్యుడైన ఫిలిప్ డాటన్ వయసు 57 ఏళ్లు కాగా, ఉజ్బెకిస్తాన్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవితినా వయసు 46 సంవత్సరాలు. ఎనిమిదో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న చుసోవితినాకు 21 ఏళ్ల కొడుకు ఉండగా... ఈ పోటీల్లో అతనికంటే చిన్న వయసువారు ఎంతో మందితో ఆమె పోటీ పడుతోంది. 45 ఏళ్ల అమెరికా బీచ్ వాలీబాల్ ప్లేయర్ జేక్ జిబ్ను చూసినా సరే... వీరంతా కాలాన్ని వెనక్కి తిప్పి యవ్వనంతో పోటీ పడుతున్నారా అనిపిస్తుంది! -
బుల్లెట్ దిగింది!
'ఎప్పుడొచ్చామన్నది కాదనయ్యా బుల్లెట్ దిగిందా, లేదా...' పోకిరి సినిమాలో హీరో మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఇది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత షూటర్లకు ఈ డైలాగ్ అతికినట్టు సరిపోతుంది. బరిలోకి దిగింది మొదలు అదరగొడుతున్నారు. 'షూటింగ్'లో సత్తా చాటి పతకాల పంట పండించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ షూటర్లు దుమ్ము రేపారు. ఒక్క షూటింగ్ ఈవెంట్ లోనే అత్యధికంగా 17 పతకాలు సాధించిపెట్టారు. ఇందులో 4 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. మంగళవారం నాటికి భారత్ ఖాతాలో మొత్తం 35 పతకాలు చేరాయి. ఒకరిద్దరు మినహా షూటర్లు అందరూ సమిష్టిగా రాణించి అభిమానుల అంచనాలను నిలబెట్టారు. లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన హిమాచల్‌ప్రదేశ్ షూటర్ విజయ్ కుమార్ మాత్రం నిరాశపరిచాడు. ఫైనల్‌కు చేరుకోవడంలో ఫలమయ్యాడు. మనో షూటర్ రవి కుమార్ ఫైనల్లో తడబడ్డాడు. సీనియర్ షూటర్లుతో ఔత్సాహిక షూటర్లు పతకాలు సాధించడం ఈసారి విశేషం. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ అంచనాలకు తగినట్టు రాణించారు. నారంగ్(రజతం, కాంస్యం) రెండు పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళా షూటర్లు శ్రేయాసి సింగ్, అపూర్వి చండేలా, అయోనికా పాల్, మలైకా గోయల్ పతకాల పంట పండించారు. జీతూ రాయ్, గుర్పాల్ సింగ్, మహమ్మద్ అసబ్, ప్రకాశ్ నంజప్ప, లజ్జా గోస్వామి, మానవ్‌జిత్ సింగ్ సంధూ, సంజీవ్ రాజ్‌పుత్, హర్‌ప్రీత్ సింగ్ 'గురి' తప్పకుండా పతకాలు సాధించారు. భారత పతాకాన్ని అంతర్జాతీయ క్రీడా యవనికపై రెపరెపలాడించిన మన షూటర్లకు అభినందలు తెలుపుతూ.. మన్ముందు మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. -
‘గన్’ గర్జన
షూటింగ్లో భారత్‌కు మరో ఐదు పతకాలు రెండు రజతాలు, మూడు కాంస్యాలు స్థాయికి తగ్గ ప్రదర్శనతో భారత షూటర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో తమ వేటను పతకంతో మొదలుపెట్టి పతకంతోనే ముగించారు. షూటింగ్ పోటీల చివరిరోజు మంగళవారం మనోళ్లు మరో ఐదు పతకాలు గెల్చుకున్నారు. ఈ ఒక్క క్రీడాంశంలోనే భారత్ 17 పతకాలు సాధించడం విశేషం. గ్లాస్గో: అభిమానుల ఆశలను వమ్ము చేయకుండా రాణించిన భారత షూటర్లు కామన్వెల్త్ గేమ్స్‌ను ఘనంగా ముగించారు. షూటింగ్ ఈవెంట్ చివరిరోజు మంగళవారం భారత క్రీడాకారులు తమ ఖాతాలో మరో ఐదు పతకాలను జోడించారు. అయితే ఇందులో స్వర్ణం లేకపోయినా... రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో హర్‌ప్రీత్ సింగ్... 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాలు నెగ్గారు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లోనే హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్... మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో లజ్జా గోస్వామి.... ట్రాప్ ఈవెంట్లో మానవ్‌జిత్ సింగ్ సంధూ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా షూటింగ్లో భారత్‌కు 17 పతకాలు వచ్చాయి. ఇందులో 4 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో హర్‌ప్రీత్ సింగ్ 21 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్ చాప్మన్ (ఆస్ట్రేలియా-23 పాయింట్లు) స్వర్ణం... క్రిస్టియన్ కాలఘన్ (ఇంగ్లండ్-17 పాయింట్లు) కాంస్యం నెగ్గారు. అయితే లండన్ ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్లో రజతం నెగ్గిన హిమాచల్‌ప్రదేశ్ షూటర్ విజయ్ కుమార్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. అందివచ్చిన అవకాశంతో... పురుషుల ట్రాప్ ఈవెంట్లో ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూకు అదృష్టం కూడా కలిసివచ్చింది. ‘డబుల్ ఒలింపిక్ మాజీ చాంపియన్’ మైకేల్ డైమండ్ (ఆస్ట్రేలియా)తో జరిగిన కాంస్య పతక పోరులో మానవ్‌జిత్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. నిర్ణీత 15వ షాట్ తర్వాత మానవ్‌జిత్ 11 పాయింట్ల వద్ద ఉండగా... డైమండ్‌కు మరో షాట్ మిగిలి ఉంది. అయితే చివరి షాట్లో డైమండ్ విఫలమవ్వడంతో ఇద్దరూ 11 పాయింట్లతో సమమయ్యారు. దాంతో విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్ ఇచ్చారు. డైమండ్ గురి తప్పగా... మానవ్‌జిత్ లక్ష్యాన్ని ఛేదించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో మానవ్జిత్కిది మూడో పతకం. గగన్ ‘10’ గ్లాస్గో గేమ్స్‌లో బరిలోకి దిగిన రెండు ఈవెంట్స్‌లోనూ గగన్ నారంగ్ పతకాలు గెలుపొందడం విశేషం. సోమవారం 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో రజతం నెగ్గిన గగన్... మంగళవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించాడు. ఫైనల్లో ఈ హైదరాబాదీ షూటర్ 436.8 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తానికి కామన్వెల్త్ క్రీడల చరిత్రలో గగన్‌కిది 10వ పతకం కావడం విశేషం. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన సంజీవ్ రాజ్‌పుత్ 446.9 పాయింట్ల స్కోరుతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ షూటర్ డానియల్ రివర్స్‌కు (452.9 పాయింట్లు) స్వర్ణం దక్కింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో లజ్జా గోస్వామి 436.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. జాస్మిన్ సెర్ (సింగపూర్-449.1) స్వర్ణం, జెన్ మెకిన్‌టోష్ (స్కాట్లాండ్-446.6) రజతం సాధించారు.