‘గన్’ గర్జన
షూటింగ్‌లో భారత్‌కు మరో ఐదు పతకాలు
రెండు రజతాలు, మూడు కాంస్యాలు
స్థాయికి తగ్గ ప్రదర్శనతో భారత షూటర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో తమ వేటను పతకంతో మొదలుపెట్టి పతకంతోనే ముగించారు. షూటింగ్ పోటీల చివరిరోజు మంగళవారం మనోళ్లు మరో ఐదు పతకాలు గెల్చుకున్నారు. ఈ ఒక్క క్రీడాంశంలోనే భారత్ 17 పతకాలు సాధించడం విశేషం.
గ్లాస్గో: అభిమానుల ఆశలను వమ్ము చేయకుండా రాణించిన భారత షూటర్లు కామన్వెల్త్ గేమ్స్‌ను ఘనంగా ముగించారు. షూటింగ్ ఈవెంట్ చివరిరోజు మంగళవారం భారత క్రీడాకారులు తమ ఖాతాలో మరో ఐదు పతకాలను జోడించారు. అయితే ఇందులో స్వర్ణం లేకపోయినా... రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి.
పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో హర్‌ప్రీత్ సింగ్... 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాలు నెగ్గారు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లోనే హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్... మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో లజ్జా గోస్వామి.... ట్రాప్ ఈవెంట్‌లో మానవ్‌జిత్ సింగ్ సంధూ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా షూటింగ్‌లో భారత్‌కు 17 పతకాలు వచ్చాయి. ఇందులో 4 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.
పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో హర్‌ప్రీత్ సింగ్ 21 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్ చాప్‌మన్ (ఆస్ట్రేలియా-23 పాయింట్లు) స్వర్ణం... క్రిస్టియన్ కాలఘన్ (ఇంగ్లండ్-17 పాయింట్లు) కాంస్యం నెగ్గారు. అయితే లండన్ ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్‌లో రజతం నెగ్గిన హిమాచల్‌ప్రదేశ్ షూటర్ విజయ్ కుమార్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యాడు.
అందివచ్చిన అవకాశంతో...
పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూకు అదృష్టం కూడా కలిసివచ్చింది. ‘డబుల్ ఒలింపిక్ మాజీ చాంపియన్’ మైకేల్ డైమండ్ (ఆస్ట్రేలియా)తో జరిగిన కాంస్య పతక పోరులో మానవ్‌జిత్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. నిర్ణీత 15వ షాట్ తర్వాత మానవ్‌జిత్ 11 పాయింట్ల వద్ద ఉండగా... డైమండ్‌కు మరో షాట్ మిగిలి ఉంది.
అయితే చివరి షాట్‌లో డైమండ్ విఫలమవ్వడంతో ఇద్దరూ 11 పాయింట్లతో సమమయ్యారు. దాంతో విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్ ఇచ్చారు. డైమండ్ గురి తప్పగా... మానవ్‌జిత్ లక్ష్యాన్ని ఛేదించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో మానవ్‌జిత్‌కిది మూడో పతకం.
గగన్ ‘10’
గ్లాస్గో గేమ్స్‌లో బరిలోకి దిగిన రెండు ఈవెంట్స్‌లోనూ గగన్ నారంగ్ పతకాలు గెలుపొందడం విశేషం. సోమవారం 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో రజతం నెగ్గిన గగన్... మంగళవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించాడు. ఫైనల్లో ఈ హైదరాబాదీ షూటర్ 436.8 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తానికి కామన్వెల్త్ క్రీడల చరిత్రలో గగన్‌కిది 10వ పతకం కావడం విశేషం.
ఇదే విభాగంలో భారత్‌కే చెందిన సంజీవ్ రాజ్‌పుత్ 446.9 పాయింట్ల స్కోరుతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ షూటర్ డానియల్ రివర్స్‌కు (452.9 పాయింట్లు) స్వర్ణం దక్కింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో లజ్జా గోస్వామి 436.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. జాస్మిన్ సెర్ (సింగపూర్-449.1) స్వర్ణం, జెన్ మెకిన్‌టోష్ (స్కాట్లాండ్-446.6) రజతం సాధించారు.