కాంస్యంతో అల్‌రషీదీ
2016 రియో ఒలింపిక్స్... షూటింగ్ స్కీట్ ఈవెంట్‌లో 53 ఏళ్ల అబ్దుల్లా అల్ రషీదీ కాంస్య పతకం సాధించాడు. అయితే అతనిలో ఏమాత్రం ఆనందం లేదు. తన సొంత దేశం కువైట్‌పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించి ఉండటంతో అతను ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్‌గా బరిలోకి దిగాడు. ఫుట్‌బాల్ క్లబ్ ‘అర్సెనల్’ జెర్సీ వేసుకొని పతకం అందుకోగా... వేడుక సమయంలో ఒలింపిక్ పతాకం మాత్రమే ఎగిరింది. ఇది అతడిని చాలా బాధించింది. అంతే... తాను మళ్లీ ఒలింపిక్స్ ఆడాలని, దేశం తరఫున పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా అనుకోవడమే కాదు... ఐదు సంవత్సరాల తర్వాత దానిని సాధించి చూపించాడు. 58 ఏళ్ల వయసులో అదే స్కీట్ ఈవెంట్‌లో మళ్లీ కాంస్యం గెలిచి కువైట్ జాతీయ పతాకం ఎగురుతుండగా సగర్వంగా నిలబడ్డాడు.
టోక్యో క్రీడల్లో పతకం సాధించిన అతి పెద్ద వయస్కుడి గా రషీదీ నిలవడం విశేషం. 1996 నుంచి వరుసగా విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న రషీదీకి ఇవి ఏడో ఒలింపిక్స్ కావడం విశేషం. తొలి ఐదు సందర్భాల్లో 42, 14, 9, 9, 21 స్థానాల్లో నిలిచినా, అతను వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే వచ్చాడు. సోమవారం ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి పతకం కోసం రషీదీతో చివరి వరకు పోటీ పడిన ఈటూ కలినన్ (ఫిన్లాండ్)... రషీదీ తొలి ఒలింపిక్స్ ఆడే సమయానికి పుట్టనే లేదు! అన్నట్లు అతని కుమారుడు తలాల్ అలా రషీదీ కూడా షూటరే. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తండ్రితో కలిసి బరిలోకి దిగిన తలాల్, ఈసారి కూడా ‘ట్రాప్’ ఈవెంట్‌లో మళ్లీ ఆడుతున్నాడు. చివరగా... ఇంతటితో ఆగిపోనని చెబుతున్న రషీదీ, రిటైర్మెంట్ వయసు (61) వచ్చినా సరే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా పోటీ పడతానని ప్రకటించడం విశేషం!
అదో అంకె మాత్రమే...
టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన పెద్ద వయస్కురాలిగా మేరీ హనా (ఆస్ట్రేలియా) నిలిచింది. 66 ఏళ్ల హనా ఈక్వెస్ట్రియన్‌లో ఏడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. అమెరికా ఈక్వెస్ట్రియన్ జట్టు సభ్యుడైన ఫిలిప్ డాటన్ వయసు 57 ఏళ్లు కాగా, ఉజ్బెకిస్తాన్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవితినా వయసు 46 సంవత్సరాలు. ఎనిమిదో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న చుసోవితినాకు 21 ఏళ్ల కొడుకు ఉండగా... ఈ పోటీల్లో అతనికంటే చిన్న వయసువారు ఎంతో మందితో ఆమె పోటీ పడుతోంది. 45 ఏళ్ల అమెరికా బీచ్ వాలీబాల్ ప్లేయర్ జేక్ జిబ్‌ను చూసినా సరే... వీరంతా కాలాన్ని వెనక్కి తిప్పి యవ్వనంతో పోటీ పడుతున్నారా అనిపిస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment