Siddapuram Village
-
ఇదేం సినిమా కథ కాదు...
సినిమాల ప్రభావంతో యువత పడుతున్న దారుల గురించి విరివిరిగా చర్చలు జరుగుతున్న సమయంలో.. ఓ ఎన్నారై యువకుడి ప్రయత్నం తెరపైకి వచ్చింది. విద్యాదానానికి మించింది లేదని బలంగా నమ్మిన ఆ 20 ఏళ్ల యువకుడు ఓ సినిమా ప్రేరణతో చేసిన ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నమే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సృజన్ నేపథ్యం.. అమెరికాలోని మేరీల్యాండ్, జర్మన్‌టౌన్‌లో తెలుగు దంపతులకు సృజన్ కోనేరు జన్మించాడు. ప్రస్తుతం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఐఎస్(మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) కోర్సు అభ్యసిస్తున్నాడు. తల్లి ఏడాదిన్నర క్రితం పాంక్రియాటిక్ కేన్సర్‌తో కన్నుమూశారు. మాతృదేశంలోని విద్యా వ్యవస్థలో మార్పులు రావాలన్నది ఆమె కోరిక. దానిని నెరవేర్చేందుకు ఈ ఎన్నారై యువకుడు కదిలాడు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ సాయం తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషికి తన ఆలోచనను వివరించాడు. ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించటం, సోషల్ రెస్పాన్స్‌బిలిటీస్(సామాజికి బాధ్యత)పై అవగాహన కల్పిస్తానని, అందుకు అనుమతించాలని కోరాడు. అతని ఆలోచన నచ్చిన సీఎస్ జోషి కూడా అందుకు అనుమతిచ్చారు. తన ప్రయత్నానికి వేదికగా శంషాబాద్ దగ్గర్లోని సిద్ధాపురం గ్రామం.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సృజన్ ఎంచుకున్నాడు. ‘రెగ్యులర్ తరగతులకు ఏ మాత్రం భంగం కలగకుండా నా ప్రయత్నాన్ని మొదలుపెట్టా. మొదట్లో నేను ఆంగ్లం మాట్లాడుతుంటే విద్యార్థులు సిగ్గుపడేవారు. వాళ్ల నేపథ్యం.. పరిస్థితులు నాకు అర్థమయ్యాయి. అప్పటి నుంచి వారిలో తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాక.. క్రమంగా నాకు దగ్గర అవ్వటం ప్రారంభించారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపటమే ముఖ్యమని భావించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టా. క్రమక్రమంగా వాళ్లు ఆంగ్లంలో మాట్లాడటం మొదలుపెట్టారు. చాలా సంతోషంగా ఉంది’ అని సృజన్ చెబుతున్నాడు. ఈ ఎన్నారై అందరిలా కాదు... ‘20 ఏళ్ల యువకుడు. టీచింగ్‌లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తి. పైగా ఎన్నారై. అయినా సొంత గడ్డపై మమకారంతో చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందించదగ్గ విషయం. విద్యార్థులు అతని పాఠాల కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మణివర్థన్ రెడ్డి సృజన్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వారాంతం నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తున్న సృజన్.. ఈ నెలాఖరులో ఈ ‘ఎంపవర్మెంట్ బియాండ్ ఎడ్యుకేషన్’ ప్రాజెక్టు పూర్తి రిపోర్టును అందించేందుకు సిద్ధమవుతున్నాడు. తన ఈ ప్రయత్నం ద్వారా మరికొందరు ఎన్నారైల్లో కదలిక తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని, తద్వారా మాతృభూమికి ఎంతో కొంత మేలు జరగుతుందని సృజన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మహేష్ అభిమాని... అన్నట్లు సృజన్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు అభిమాని అంట. అంతేకాదు భరత్ అనే నేను చిత్రంలోని కాన్సెప్ట్(ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం)తోనే ప్రేరణ పొంది తాను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టానని సృజన్ చెబుతున్నాడు కూడా. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇదే సిద్దాపురం గ్రామాన్ని గతంలో మహేష్ దత్తత తీసుకున్నారు కూడా. -
సిద్దాపురంపై ఎక్సైజ్ పోలీసుల దాడి
ఆత్మకూరు రూరల్ (కర్నూలు) : సమస్యాత్మక గ్రామమైన ఆత్మకూరు మండలం సిద్దాపురంపై ఎక్సైజ్ పోలీసులు గురువారం దాడులు చేశారు. కర్నూలు జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ నాగమణి ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని ఇళ్లనూ సోదా చేశారు. అనంతరం సమీపంలోని నల్లమల అడవుల్లో ఉన్న నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. మొత్తం 11, 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం కాగా 120 లీటర్ల నాటుసారా లభ్యమయింది. మొత్తం 56 ఇనుప డ్రమ్ములను, 40 కేజీల బెల్లాన్ని స్వాధీన పరుచుకున్నారు. ఈ దాడుల్లో ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల ఎక్సైజ్ సీఐలు యాభైమంది సిబ్బంది పాల్గొన్నారు.