ఉగ్ర కన్ను !
గుల్బర్గాలో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితులకు ‘సిమి’తో సంబంధం!
ధార్వాడలో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం
{Mిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో విధ్వంసానికి కుట్ర!
బెంగళూరు : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడనున్నారనే సమాచారం నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఉగ్రవాదులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను గుల్బర్గాలో పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకోవడంతో కర్ణాటకపై కూడా ‘ఉగ్ర’ కన్ను పడినట్లు రాష్ట్ర హోం శాఖ భావిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిమి’తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన సందర్భంలో వీరు ముగ్గురు అరవింద్, ఆనంద్, కిషన్ అనే పేర్లతో ధార్వాడ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు ఆరు నెలల పాటు ఈ ముగ్గురు అనుమానితులు నివాసమున్నట్లు తెలిసింది. తాము వస్త్రాల వ్యాపారులమని చెప్పుకొని ధార్వాడ నగరంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వీరు రెక్కీ నిర్వహించారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు సైతం వీరు ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించారని సమాచారం. ధార్వాడ ప్రాంతం లో ఆరు నెలలు గడిపిన అనంతరం వ్యాపారాన్ని మరో చోటికి మారుస్తున్నామని చెప్పుకొని ఈ ముగ్గురు అనుమానితులు గుల్బర్గాకు తమ నివాసాన్ని మార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ధార్వాడ పట్టణంలో అనుమానిత ఉగ్రవాదులు నివసించిన ప్రాంతాన్ని సైతం పోలీసులు తనిఖీ చేసి అక్కడి వారి నుంచి మరికొంత సమాచారాన్ని రాబట్టారు.
రాష్ట్రంలో హై అలర్ట్...
ఇక రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం రాష్ట్ర హోం శాఖకు సమాచారం అందజేయడంతో రాష్ట్ర హోం శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇక గుల్బర్గాలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసు లు వారిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారి స్తున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొంత మంది రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఉన్నారని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సందర్భంలో రాష్ట్రం లో విధ్వంసాన్ని సృష్టించేందుకు వీరు వ్యూహరచన చేస్తున్నట్లు తెలియడంతో రాష్ట్ర హోం శాఖ ఉలిక్కిపడింది. దీంతో తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్‌తో పాటు డీజీపీ లాల్‌రుఖుమ్ పచావో ఇతర సీనియర్ పోలీసు అధికారులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొం దించనున్నట్లు సమాచారం.