ఈ స్పూన్ సెల్ఫీలు తీస్తుంది గురూ..!
ఇది.. సెల్ఫీల యుగం.. ప్రతి సన్నివేశాన్ని, స్టైల్ ను, సీన్ ను, ఒక్కటేమిటి.. ఏ కొత్తదనం కనిపించినా సెల్ఫీగా మలచడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది.. అయితే ఈ సెల్ఫీ.. ఇప్పుడు స్టిక్ నుంచి స్పూన్ కు చేరింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలనుకున్న వారికి ఇప్పుడు అందుబాటులో సెల్ఫీ స్పూన్లు కూడ మార్కెట్లోకి వచ్చేశాయ్..
స్టిక్ కు స్పూన్ అమర్చిన కొత్త పరికరం (సెల్ఫీ స్పూన్) ఇప్పుడు మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. స్పూనుకు 30 అంగుళాల స్టిక్‌ను కలిపి తయారు చేసిన ఈ స్పూన్.. సెల్ఫీ ప్రియులను ఆకట్టుకుంటోంది. టిఫిన్ తింటూ ఎవరికి వారు అందంగా ఫొటోలను తీసుకునేందుకు వీలుగా న్యూయార్క్‌కు చెందిన సినామన్ టోస్ట్ క్రంచ్ ఈ పరికరాన్ని పరిచయం చేసింది. జనరల్ మిల్స్ బ్రాండ్ రూపొందించిన ఈ కొత్త సెల్ఫీ స్టిక్‌లో ఎప్పటికప్పుడు తీసిన ఫొటోలను పోస్ట్ చేసే అవకాశం ఉంది.
సెల్ఫీ స్పూన్ ను వాడాలనుకునేవారు ముందుగా తమ స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయాలి. అందులోని వైట్ రిమోట్లో కనిపించే గ్రే బటన్ ను నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్లోనే కాక ఐవోఎస్ డివైజ్‌లో కూడా ఫొటోలు సేవ్ అవుతాయి. దీంతో ఎప్పటికప్పుడు తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేయడం కూడా సులభం అవుతుందట.