Singitam Srinivasa Rao
-
ఐకమత్యమే జాతికి శ్రీరామరక్ష...
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమెరికా అబ్బాయి’ చిత్రంలో సి. నారాయణరెడ్డి రచించిన ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా/పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము/రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడూ’’ అని ప్రారంభమయ్యే పల్లవిని అభేరి రాగంలో స్వరపరచారు. ఈ చిత్రానికి నేను నాన్నగారికి సహాయకుడిగా పనిచేశాను. ఈ పాటను 1986లో కంపోజ్ చేశారు, 1987లో విడుదలైంది. అప్పటికే సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిపోయింది. ఈ చిత్ర నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుగారికి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చెన్నైలో అన్నపూర్ణ ఆఫీసు ఉండేది. హైదరాబాద్‌కి వెళ్లిపోయాక ఆ స్టూడియో లేదు. నాన్నగారితో పాట ట్యూన్ చేయించుకోవాలనుకుంటే, తప్పనిసరిగా చెన్నై రావలసిందే. ఆ రోజుల్లో పాట కంపోజింగ్ పద్ధతి వేరేగా ఉండేది. పాటను కవి రాసి ఇచ్చేస్తే, సంగీత దర్శకుడు స్వరపరచడం అనే విధానం ఉండేది కాదు. మధుసూదనరావుగారు ఈ సినిమా పాటల కోసం చెన్నై వచ్చారు. ఆయన సుశీల గారి ఇంట్లో దిగేవారు. ఆవిడ ఇంట్లో మేడ మీద ఒక హాలు, గది ఉండేవి. అక్కడే పాట కంపోజింగ్ జరిగేది. పాట కోసం సినారె, డి. మధుసూదనరావు, నాన్నగారు, సుశీలగారు అందరూ ఒక చోట కూర్చున్నారు. అప్పుడు మధుసూదనరావుగారు నాన్నగారితో, ‘‘మీ మూడో అబ్బాయి వాసూరావు చాలా హుషారుగా ఉంటున్నాడు. ఈ సినిమాకి మీ అసిస్టెంట్‌గా ఈ అబ్బాయిని పెట్టుకోండి’ అని సూచించారు. మా పెద్ద అన్నయ్య రామలింగేశ్వరరావు కూడా నన్ను తీసుకోమని చెప్పడంతో నాన్నగారు అంగీకరించారు. మొదటి చరణంలో ‘‘పుట్టింది ఈ మట్టిలో సీత/ రూపు కట్టింది దివ్య భగవద్గీత/వేదాలు వెలసిన ధరణిరా/ ఓంకార నాదాలు పలికిన అవనిరా/ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు/ వికసించె మన‡నేల విజ్ఞాన కిరణాలు’’ అనే చరణంలో ‘వేదాలు వెలసిన ధరణిరా’ అనే వాక్యాన్ని రేవతి రాగంలో స్వరపరచారు. అక్కడ నుంచి వెంటనే అభేరి రాగానికి వెళ్లడంలో నాన్నగారి గొప్పదనం కనిపిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోగాలు చేయడం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సాధారణంగా ఒక సినిమాకు పాట చేసేటప్పుడు, రచయిత పాట రాసి ఇచ్చేస్తే సంగీత దర్శకుడు సంగీతం చేసేసి, ఆ పాటను రికార్డు చేసి, గాయకులకు టేప్ ఇచ్చేస్తే, వారు ఎక్కడో ఒక చోట కూర్చుని సాధన చేసి పాడేస్తుంటారు. కాని మధుసూదనరావుగారి విధానం చూస్తే ఆశ్చర్యం వేసింది. అన్నపూర్ణ సంస్థలో అందరూ కలిసి ఒకచోట కూర్చుని పనిచేస్తారు. ఈ పాట పల్లవిలో ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా’’ అని రాయప్రోలు వారి రచనతో ప్రారంభమైనప్పుడు, అక్కడ ఉన్నవారిలో ఒకరు ‘ఎవ్వరెదురైనా’ పదం ఎందుకు ఉపయోగించారు? అని ప్రశ్నిస్తే, మధుసూదనరావుగారు, ‘‘ఏ భాషకు చెందినవారు ఎదురైనా, తొణకకుండా ‘పొగడరా నీ తల్లిని’ అని చెప్పడం కోసం ఉపయోగించారు అని చెప్పారు. ఆయన కేవలం డబ్బులు పెట్టే నిర్మాత మాత్రమే కాదు, అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉన్న నిర్మాత. ‘‘వెన్నెలది ఏ మతమురా కోకిలది ఏ కులమురా/గాలికి ఏ భాష ఉందిరా నీటికి ఏ ప్రాంతముందిరా/గాలికీ నీటికీ లేవు భేదాలు/ మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు’’ అని సమానత్వం గురించి ఎంతో అందంగా వివరించారు సినారె ఈ చరణంలో. ఆఖరి చరణం ‘‘గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు/ గాంధీ చూపిన మార్గం విడవద్దు/ద్వేషాల చీకట్లు తొలగించు/ స్నేహదీపాల ఇంటింటాæ వెలిగించు/ఐకమత్యమే జాతికి శ్రీరామరక్ష/ అందుకే నిరంతరం సాగాలి దీక్ష’’అంటూ పాట ముగుస్తుంది. ఈ పాటను ఖండగతిలో, చతురస్ర మిశ్రమ తాళాలలో రాగమాలికలో స్వరపరచారు. ఆ పాటకు పనిచేయడం నాకు మంచి అనుభవం. ఈ పాట కోసం సి. నారాయణరెడ్డిగారిని హైదరాబాద్ నుంచి చెన్నై రప్పించారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ చిత్రం: అమెరికా అబ్బాయి సంగీతం: ఎస్. రాజేశ్వరరావు రచన: సినారె గానం: సుశీల సంగీత సహకారం: సాలూరి వాసూరావు సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకులు వాసూరావు సంగీత దర్శకులు -
21న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: కరీనా కపూర్ (నటి), సింగీతం శ్రీనివాసరావు (దర్శకుడు, నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరం సృజనాత్మకత, ఊహాకల్పన, సౌందర్య పోషణ అలవడతాయి. సంఘంలో మంచి పలుకుబడి సంపాదిస్తారు. అయితే ఆలోచనలలో నిలకడ ఉండని కారణంగా ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి, తగిన జాగ్రత్తలు అవసరం. వీరు పుట్టినతేదీ 12. ఇది బృహస్పతికి చెందిన సంఖ్య కావడం వల్ల ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. విజయాలు వరిస్తాయి. కొత్తస్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడి, వాటివల్ల లబ్ధి పొందుతారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. లక్కీ నంబర్స్: 1,2,3,5; లక్కీ కలర్స్: తెలుపు, క్రీమ్, శాండల్, గోల్డెన్, ఎల్లో; లక్కీ డేస్: సోమ, బుధ, గురు; శుక్రవారాలు. సూచనలు: చంద్రకాంతమణిని ధరించడం, దక్షిణామూర్తి ఆరాధన, శివుడికి అభిషేకం, గురువులను, పండితులను గౌరవించడం, ఆలయాలు, ప్రార్థనామందిరాలు, మదరసాలలో భోజన సదుపాయాలు కల్పించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్