single life
-
సోలో లైఫే సో బెటరు
నేటి రోజుల్లో చదువులు, వృత్తి ఉద్యోగాల్లో ప్రగతి కోసం శ్రమిస్తున్న మహిళలు ముప్ఫై ఏళ్లు దగ్గరవుతున్నా పెళ్లి మాటెత్తడం లేదని తల్లిదండ్రులు వాపోతుంటారు. కొందరు వనితామణులు ఒకడుగు ముందుకేసి అసలు మాకు పెళ్లే వద్దు, ఈ జీవితమే సంతోషంగా ఉండగా, కొత్తగా సమస్యలు తెచ్చుకోవడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక, బొమ్మనహళ్లి: బ్రహ్మచర్యం అనేది ఒకప్పుడు ప్రధానంగా పురుషులకే పరిమితమై ఉండేది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు, ఇప్పుడు యువతుల్లో, మహిళల్లోనూ ఆ ధోరణులు కనిపిస్తున్నాయి. కళ్లెదుటే స్నేహితులు, బంధువుల వివాహాలు విచ్ఛిన్నం కావడం, ఇష్టపడి కట్టుకున్న పెనిమిటి వికృత చేష్టలు, వంటి చేదు పరిణామాలు యువతులను బ్రహ్మచర్యం వైపు మళ్లిస్తున్నాయి. ఐటీ సిటీలో ఇప్పుడు అనేక మంది యువతులు ఒంటరి జీవనం వైపే మొగ్గు చూపిస్తున్నారు. అదే తమకు సంతోషాన్నిస్తోందని వారు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నా, వారి స్వతంత్ర ఆలోచనలను కాదనే హక్కు ఎవరికీ ఉండదు. సమావేశాలు, చర్చాగోష్టులు మరో పక్క నగరంలో కొందరు ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న యువతులు అసంఘటితంగా అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు అప్పుడప్పుడూ సమావేశమవడానికి వీలుగా మీటప్డాట్కామ్ అనే సైట్లో ప్రకటనలు కూడా ఇస్తుంటారు. అయితే మరి కొన్ని గ్రూపులు ఎవరితోనూ సంబంధం లేకుండా తమంత తాముగా కలుస్తూ ఉంటాయి. మజ్లిస్ లీగల్ సెంటర్ అనే ఫెమినిస్టు గ్రూపు, హ్యాపీలీ అన్‌మారీడ్ అనే ఆన్లైన్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆరు గురు మహిళల కథనాలతో ఈ ఏడాది ఆరంభంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ గ్రూపు కోసం పని చేస్తున్న మహిళా న్యాయవాదులు, నగరంలో అనేక మంది మహిళలు అయిష్టంగానే వైవాహిక జీవితాన్ని గడుపుతున్నట్లు గుర్తించారు. పెళ్లి ఎందుకని చెబుతుంటాం తొలుత ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు స్పందన మందకొడిగానే ఉండేదని, క్రమంగా అనేక మంది మహిళలు తమను సంప్రదించడం ప్రారంభించారని హ్యాపీలీ అన్‌మ్యారీడ్ ప్రాజెక్టు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆడ్రీ డెల్లో తెలిపారు. పెళ్లికి ప్రతికూలంగా యువతులను ప్రోత్సహించడమే తమ ప్రచార ప్రధానోద్దేశమని చెప్పారు. ఈ ప్రచారాన్ని ఒక్క బెంగళూరుకే పరిమితం చేయకుండా దేశమంతా విస్తతం చేయదలిచామని తెలిపారు. అవివాహితగా ఉంటే సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాన్ని పోగొట్టడమే తమ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. అవివాహితగా ఉంటూ కూడా సంతోషకరమైన జీవనాన్ని గడపవచ్చని తాము చెప్పదలు చుకున్నామని, దీనికి ఆలంబనగా దేశంలోని నలుమూలల్లో ఉంటున్న అవివాహితుల కథనాలను వారికి వినిపిస్తున్నామని వివరించారు. వారంతా జీవితంలో బాగా స్థిరపడిపోయారు, వారికెప్పుడూ బోర్ కొట్టలేదు, వారు ఒక్కరుగానే ఉండవచ్చు, కానీ ఒంటరివారు కారు అని ఆమె ముక్తాయింపు నిచ్చారు. – ఆడ్రీ డెల్లో, ప్రాజెక్టు డైరెక్టర్ ఓ రెండు ఉదాహరణలు చూస్తే.. ♦ 30 ఏళ్ల అలేఖ్య (మారుపేరు) మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. పెళ్లి చేసుకోవాలనే సామాజిక ఒత్తిడులను పక్కన పెట్టి, ఒంటరిగానే ఉండిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. ♦ నగరంలో ఓ ప్రముఖ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న 30 ఏళ్ల రాగిణిది (మారుపేరు) మరో అనుభవం. 22 ఏళ్లకే ఆమెకు పెళ్లయింది. ఇష్టం లేకున్నా పెద్దల ఒత్తిడి మేరకు పెళ్లికి సరేనంది. రెండు నెలలకే ఆ వివాహం విచ్ఛిన్నమైంది. ఇద్దరు దత్తత సంతతితో ఇప్పుడు సంతోష జీవనాన్ని గడుపుతున్నానని ఆమె తెలిపింది. బ్రహ్మచారిణిలకూ క్లబ్బులు బెంగళూరులో 2016లో హ్యాపీ క్లబ్ పేరిట ఓ గ్రూపు ఏర్పడింది. ఇందులో 50 మంది దాకా సభ్యులున్నారు. అందరూ అవివాహితులే. 30 ఏళ్లు పైబడిన వారే. అయితే వారంతా తమ క్లబ్ ఉనికిని బహిర్గతం చేయడానికి ఇష్టపడడం లేదు. ఎవరైనా తెలసుకుని సభ్యత్వం కోసం ప్రయత్నిస్తే, సభ్యత్వ గడువు ముగిసి పోయిందని సమాధానమిస్తారు. వీరంతా వీలు చిక్కినప్పుడల్లా సినిమాలు చూస్తూ, ఒంటరి మహిళగా ఉంటే కలిగే సంతోషం, ఎదురయ్యే ఇబ్బందుల గురించి చర్చాగోష్టులు నిర్వహిస్తూ ఉంటారు. తామంతా అవివాహితులుగానే ఉండి పోతామని వారంతా ప్రతిజ్ఞ చేయడం మరో విశేషం. దీనిని ఉల్లంఘించిన వారు సభ్యత్వం కోల్పోతారని ఆ క్లబ్బు వ్యవస్థాపకురాలు తెలిపారు. ఈ క్లబ్ సభ్యులు... ఇతరులను ప్రోత్సహించడానికా అన్నట్లు తమ సంతోష ఘడియలు, క్షణాల స్క్రీన్‌షాట్స్‌ను తరచూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. -
నేనే కాదు.. రాందేవ్, మోదీ కూడా బ్రహ్మచారులే
ఇప్పటివరకు ఒంటరిగా జీవించడమే ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి రాఖీసావంత్ తెలిపింది. బాబా రామ్ దేవ్, ప్రధాని మోదీ, సల్మాన్ ఖాన్... వీళ్లంతా బ్రహ్మచారులేనని, వాళ్లను చూసి తాను కూడా ప్రస్తుతానికి అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. అయితే తన సహచర భాగస్వామిని ఎంచుకునేందుకు మరోమారు 'రాఖీ కా స్వయంవర్' రియాలిటీ షోను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాఖీసావంత్ ఇంతకుముందు క్రేజీ 4,1920 వంటి సినిమాల్లో నటించారు. 2009లో నిర్వహించిన ఇదే రియాలిటీ షో మొదటి సీజన్లో కెనడియన్ వ్యాపారవేత్త ఈలేష్ పరుజన్‌వాలాను తన భర్తగా ఎంచుకుంది. అయితే తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలతో ఇద్దరూ విడిపోయారు. డబ్బు కోసమే తాను ఈలేష్ను ఇష్టపడ్డానని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో రాఖీ చెప్పింది. ధనవంతుడు, కష్టపడేవాడు, నలుగురిలో తిరిగేవాడు, శక్తిమంతుడైన వ్యక్తి దొరికేవరకు తాను పెళ్లి గురించి ఆలోచించేది లేదని ఇప్పుడు తాజాగా స్పష్టం చేసింది. అలాంటివాడిని వెతికి పట్టుకోవాలనే తన స్వయంవరాన్ని మరోసారి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా, రాఖీ ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకుంటే మంచిదని ఆమె స్నేహితురాలు, హాలీవుడ్ నటి సోఫియా హయత్ అన్నారు. ఆ మాటలను మాత్రం రాఖీ పట్టించుకున్నట్లు లేదు. -
జ్ఞానంపై ఒంటరితనం ప్రభావం
టొరంటో: పరిస్థితులనుబట్టి మనలోని జ్ఞానపుస్థాయి మారుతూ ఉంటుంది. అయితే దీనిపై ఒంటరితనం ప్రభావం పడుతుందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. దైనందిన జీవితంలోని పరిస్థితులనేవి వ్యక్తిత్వంపైనా, తెలివిగా ఆలోచించడంపైనా ప్రభావం చూపుతాయని కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇగోర్ గ్రాస్మేన్ చెప్పారు. ఇక కొంతమంది వ్యక్తుల విషయంలో కొన్ని కొన్ని పరిస్థితులు వారికి అత్యంత అనుకూలంగా మారతాయని, తెలివితేటలు పెరిగేందుకు దోహదపడతాయని చెప్పారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని, కొంతమంది అద్భుతమైన చతురతను కలిగిఉంటారని తెలిపారు. ఈ ఉదాహరణలు అసాధారణమైనవేమీ కావని తాజా అధ్యయనంలో తేలిందన్నారు. ఆటలో ప్రతిసారి ఏ ఒక్కరిదీ పైచేయిగా ఉండదని తెలిపారు. కాగా సోషల్ సైకలాజికల్ పర్సనాలిటీ సైన్స్ అనే జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. -
అంతా అంతర్ముఖులే...
ఒంటరి జీవనమే వారి నైజం ఇరుగు పొరుగుకు దూరం తల్లీకుమారుల ఆత్మహత్య ఉదంతంలో అంతుపట్టని కారణాలు అక్కయ్యపాలెం : విపరీత మానసిక ధోరణే రామచంద్రానగర్‌లో నివసిస్తున్న కమల, రవికుమార్‌ల ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరి మృతికి గల కారణాలు పోలీసులకు సైతం అంతుచిక్కడం లేదు. చనిపోయిన మాచర్ల కమల మానసిక పరిస్థితి సరిగా లేదని చుట్టుప్రక్కల వారు చెప్పినట్టు తెలిసింది. కుటుంబంలోని వారంతా నిత్యం ఇంటిలోనే ఉండేవారని, కిటికీలకు కర్టెన్లు వేసుకొని ఎవరికీ కనిపించే వారు కాదని తెలిసింది. అలాగే ఉదయం ఒక టిఫిన్ ప్యాకెట్ , మరల రాత్రి 10 గంటల సమయంలో మరో టిఫిన్ ప్యాక్ తీసుకువెళ్లేవారని, వాటితోనే సరిపెట్టుకునే వారని తెలిసింది. రామచంద్రానగర్‌లో 20 ఏళ్ళుగా నివసిస్తున్నా కనీసం ప్రక్క ఇంటివారితో కూడా మాట్లాడేవారు కాదని, ఒంటరి జీవనం సాగించేవారని చెబుతున్నారు. మృతురాలు కమల అన్నయ్య కోటిన హరిప్రసాద్ నక్కవానిపాలెంలో ఉంటున్నారు. అతనితో కూడా సంబంధాలు లేవని, ఎస్ఐ ఫోన్ చేయగా చనిపోయారని తెలిసిందని హరిప్రసాద్ చెప్పడం విశేషం. గతంలో పెద్ద కొడుకు చనిపోయినప్పుడు కూడా పోలీసులే సమాచారం ఇచ్చారన్నారు. వడ్డీయే ఆధారం... మృతుల కుటుంబంలో ఎవరూ ఎటువంటి పని చేయడం లేదు. అంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గొడౌన్ కూడా కొంత కాలంగా అద్దెకు ఇవ్వడం మానేశారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.10 లక్షలకు నెల నెలా వచ్చే వడ్డీతోనే కాలం వెల్లబుచ్చుతున్నట్టు తెలిసింది. రక్త సంబంధీకులు లేరు... మృతుల పోస్టుమార్టం కోసం ఐదుగురు పెద్దమనుషులు, ఇద్దరు రక్త సంబంధీకులు అవసరం. అయితే మృతుల తరపున బంధువులుగాని, చుట్టుప్రక్కలవారు గానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించడం పోలీసులకు సమస్యగా మారింది. భార్య, కొడుకు చనిపోవడంతో ఒంటరి అయిన ఇంటి పెద్ద మహేశ్వరరావును పోలీసులు కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. ఇంటి లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు కదా మరి ఎక్కడ ఉంటావని అడిగితే ఫర్లేదు ఎవరు మిగిలిపోతాం...ఉన్నన్నాళ్ళు ఆ ఇంటిలోనే ఉంటానని మహేశ్వరరావు ధీమాగా చెబుతున్నాడు. అయితే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడన్న అనుమానంతో మహేశ్వరరావును ఒక హోటల్లో ఉంచి పోలీసు కాపలా ఉంచారు. టీసీఎస్‌లో పనిచేసి మానేసిన చిన్నకొడుకు రవికుమార్ కూడా ఆత్మహత్యకు పాల్పడడానికి సరైన కారణాలు పోలీసులకు అంతు చిక్కడం లేదు. పోస్టుమార్టం పూర్తి కాగా మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మహేశ్వరరావుకు అప్పగించారు. -
రెండేళ్లుగా ఒంటరి జీవితమే
తాను రెండేళ్లుగా ఒంటరి జీవితమే గడుపుతున్నానని, ఎవరితోనూ సహ జీవనం చేయడంలేదని ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ దర్శకుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఈయనకు భార్య రమాలత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నటి నయనతారతో పరిచయం ప్రేమగా మారింది. వీరి ఘాటు ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. ప్రభుదేవాతో ఏడడుగులు వేయడానికి క్రిష్టియన్ అయిన నయనతార హిందూ మతం తీసుకున్నారు. వీరి పెళ్లి మాత్రం జరగలేదు. చిన్న మనస్పర్థల కారణంగా వీరి ప్రేమ బ్రేక్ అప్ అయ్యింది. నయనతారతో ప్రభుదేవా అనుబంధం కారణంగా ఆయన భార్య రమాలత్ దూరమయ్యారు. విడాకులు కూడా తీసుకున్నారు. నయనతారతో కూడా సంబంధాలు తెగిపోవడంతో ప్రభుదేవా ముంబయిలో సెటిల్ అయిపోయారు. భార్య రమాలత్‌తో అనుబంధం లేకపోయినా పిల్లలతో మాత్రం ప్రభుదేవా ప్రేమగా మసలుకునే వారు. దర్శకుడిగా బిజీగా ఉన్నా ఖాళీ దొరికినప్పుడల్లా చెన్నైకి వచ్చి పిల్లలతో గడుపుతుంటారు. వారిని వేసవి సెలవుల్లో విదేశాలకు తీసుకెళ్లి సంతోష పరుస్తుంటారు. ఈ ఏడాది కూడా పిల్లల్ని సిడ్నీ తీసుకెళ్లాలని భావించారు. అందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. అలాంటి పరిస్థితిలో పిల్లలతో సహా ఆయన పాస్‌పోర్టు మిస్ అవ్వడం ప్రభుదేవాను నిరాశ పరిచింది. స్నేహితులకిచ్చిన పాస్ పోర్టు మిస్ అయ్యిందని, మళ్లీ కొత్తగా పాస్‌పోర్టులకు అప్లై చేసినట్టు ఇటీవల చెన్నై వచ్చిన ఆయన తెలిపారు. మరో పది రోజుల్లో తనకు, పిల్లలకు పాస్ పోర్టులు వస్తాయని అధికారులు తెలిపారని, ఆ తర్వాత సిడ్నీ బయలుదేరనున్నట్లు ప్రభుదేవా తెలిపారు. ఈ క్రమంలో మీ పిల్లలతో పాటు భార్య రమాలత్‌ను కూడా సిడ్నీకి తీసుకువెళతారా? అన్న ప్రశ్నకు ప్రభుదేవా బదులిస్తూ, తనకు ఏ అమ్మాయితోను అనుబంధం లేదన్నారు. రెండేళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్నట్లు వెల్లడించారు. దర్శకుడిగా తాను బిజీగా ఉన్నానని, ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడానికి సమయంలేదన్నారు. ఇకపై ఎవరితోనైనా అనుబంధం పెంచుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు తనకు వయసు పెరుగుతోందన్నారు. నా పిల్లలు పెద్దవారవుతున్నారని, వారు స్నేహితులతో తిరిగే సమయమని అన్నారు. మీ పిల్లల్ని నృత్య దర్శకులుగా తయారు చేస్తారా? అనే ప్రశ్నకు తాను తన తండ్రి బాటలో పయనించానని, అలాగని తన పిల్లలు తన వృత్తిని చేపట్టాలని ఏమీ లేదన్నారు. ఈ విషయంలో నిర్ణయం వారికే వదిలేస్తున్నట్లు ప్రభుదేవా పేర్కొన్నారు.