రెండేళ్లుగా ఒంటరి జీవితమే
తాను రెండేళ్లుగా ఒంటరి జీవితమే గడుపుతున్నానని, ఎవరితోనూ సహ జీవనం చేయడంలేదని ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ దర్శకుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఈయనకు భార్య రమాలత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నటి నయనతారతో పరిచయం ప్రేమగా మారింది. వీరి ఘాటు ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. ప్రభుదేవాతో ఏడడుగులు వేయడానికి క్రిష్టియన్ అయిన నయనతార హిందూ మతం తీసుకున్నారు. వీరి పెళ్లి మాత్రం జరగలేదు. చిన్న మనస్పర్థల కారణంగా వీరి ప్రేమ బ్రేక్ అప్ అయ్యింది. నయనతారతో ప్రభుదేవా అనుబంధం కారణంగా ఆయన భార్య రమాలత్ దూరమయ్యారు.
విడాకులు కూడా తీసుకున్నారు. నయనతారతో కూడా సంబంధాలు తెగిపోవడంతో ప్రభుదేవా ముంబయిలో సెటిల్ అయిపోయారు. భార్య రమాలత్‌తో అనుబంధం లేకపోయినా పిల్లలతో మాత్రం ప్రభుదేవా ప్రేమగా మసలుకునే వారు. దర్శకుడిగా బిజీగా ఉన్నా ఖాళీ దొరికినప్పుడల్లా చెన్నైకి వచ్చి పిల్లలతో గడుపుతుంటారు. వారిని వేసవి సెలవుల్లో విదేశాలకు తీసుకెళ్లి సంతోష పరుస్తుంటారు. ఈ ఏడాది కూడా పిల్లల్ని సిడ్నీ తీసుకెళ్లాలని భావించారు. అందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. అలాంటి పరిస్థితిలో పిల్లలతో సహా ఆయన పాస్‌పోర్టు మిస్ అవ్వడం ప్రభుదేవాను నిరాశ పరిచింది.
స్నేహితులకిచ్చిన పాస్ పోర్టు మిస్ అయ్యిందని, మళ్లీ కొత్తగా పాస్‌పోర్టులకు అప్లై చేసినట్టు ఇటీవల చెన్నై వచ్చిన ఆయన తెలిపారు. మరో పది రోజుల్లో తనకు, పిల్లలకు పాస్ పోర్టులు వస్తాయని అధికారులు తెలిపారని, ఆ తర్వాత సిడ్నీ బయలుదేరనున్నట్లు ప్రభుదేవా తెలిపారు. ఈ క్రమంలో మీ పిల్లలతో పాటు భార్య రమాలత్‌ను కూడా సిడ్నీకి తీసుకువెళతారా? అన్న ప్రశ్నకు ప్రభుదేవా బదులిస్తూ, తనకు ఏ అమ్మాయితోను అనుబంధం లేదన్నారు.
రెండేళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్నట్లు వెల్లడించారు. దర్శకుడిగా తాను బిజీగా ఉన్నానని, ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడానికి సమయంలేదన్నారు. ఇకపై ఎవరితోనైనా అనుబంధం పెంచుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు తనకు వయసు పెరుగుతోందన్నారు. నా పిల్లలు పెద్దవారవుతున్నారని, వారు స్నేహితులతో తిరిగే సమయమని అన్నారు. మీ పిల్లల్ని నృత్య దర్శకులుగా తయారు చేస్తారా? అనే ప్రశ్నకు తాను తన తండ్రి బాటలో పయనించానని, అలాగని తన పిల్లలు తన వృత్తిని చేపట్టాలని ఏమీ లేదన్నారు. ఈ విషయంలో నిర్ణయం వారికే వదిలేస్తున్నట్లు ప్రభుదేవా పేర్కొన్నారు.