Sirnapalli
-
సిర్నాపల్లి సంస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపిన రాణి కథ తెలుసా? 1905లోనే..
రాజులైనా, సంస్థానాధిపతులైనా, ప్రజాస్వామ్యంలోనైనా పాలకులు చేసిన మంచిని ప్రజలు ఎంత కాలమైనా మరిచిపోరనడానికి నిజామాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. చుట్టుముట్టు దట్టమైన అడవి వున్నా ఒకప్పుడు దాదాపు వంద గ్రామాల సంస్థానంగా వెలుగు వెలిగిన గ్రామం సిర్నాపల్లి. దాన్ని బహుకాలం(1859-1920) ఏలిన రాణి శీలం జానకీ బాయి. రాణిగారు తవ్వించిన చెరువులు, కుంటలు, కాలువల వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని, ఆమె పట్టుదల వల్లనే ఆనాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1899 లో తలపెట్టిన హైదరాబాద్-బోధన్ -మన్మాడ్ రైల్వే లైన్‌ను సిర్నాపల్లి, ఇందూర్(నేటి నిజామాబాద్ )ల వైపు తిప్పారని, ఫలితంగా తమకు 1905లోనే రైలు సౌకర్య భాగ్యం కలిగిందని, ఇందల్వాయి రామాలయాన్ని ఆమెనే నిర్మించిందని గ్రామస్తులు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంటారు. పోలీస్ చర్య తర్వాత భారత్‌లో విలీనమైపోయిన హైదరాబాద్ రాజ్యంతో పాటు నాటి సంస్థానాలు 14 కూడా తమ అధికారాన్ని వదులుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట తాకిడితో సిర్నాపల్లి రాణిగారి వారసులు గ్రామాన్ని విడిచిపెట్టక తప్పలేదు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన నక్సలైట్ ఉద్యమంతో దాదాపు 5 ఎకరాల్లో విస్తరించివున్న సిర్నాపల్లి కోటగడి ప్రభుత్వ బడిగా మారిపోయింది. రాణి జానకీబాయి (1859-1920) వేల్పూర్ రేకులపల్లిలోని ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిందంటారు. వేటకు వచ్చి అడవిలో తప్పిపోయి, ప్రమాదకర పరిస్థితుల్లోనున్న ఒక నవాబుకు, అడవిలోకి వంటచెరుకు కోసం వచ్చిన ఒక 12 సంవత్సరాల బాలిక దారి చూయించి ఆదుకున్నదని, అతను ఆమె ధైర్య సాహసాలను నిజాం దృష్టికి తీసుకుపోవడంతో రాజు జానకీ బాయి అనే ఆ బాలికను సంస్థాన పాలకరాలుగా నియమించాడన్నది ప్రచారంలో నున్న ఒక కథ. అయితే భర్త అకాల మరణంతో అధికారాన్ని చేపట్టిన జానకీ బాయి సంస్థానాన్ని పాపన్నపేట రాణి శంకర్మమ్మలా సమర్థవంతంగా నడిపి 'మషాల్ దొరసాని'గా (పగలే దివిటీలు వెలగడం ) పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని చరిత్ర. రాణిగారికి సంస్థాన పాలనలో లింగన్న అనే పట్వారి కీలక పాత్ర పోషించాడని చెప్పుకుంటారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి శీలం రాంభూపాల్ రెడ్డి గారు, INTACH అనబడే సాంస్కృతిక వారసత్వ సంస్థ కన్వీనర్ అనురాధా రెడ్డి గారు రాణి జానకీ బాయి వారసులేనట. తెలంగాణ నయాగరాగా పేరొందిన సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ రాణి జానకీ బాయి పేరుతో పిలువబడడం ఆమెకున్న ప్రజాదరణను తెలుపుతుంది. -వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి చదవండి: వేదామృతం.. గీతామృతం.. ఏదైనా నీరా ప్రియం! -
మట్టి కొట్టుకుపోతున్న రాజమహళ్లు, గడీలు
సాక్షి నెట్వర్క్: దర్పానికి, రాజసానికి దర్పణంగా నిలిచిన చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యంతో శిథిలమై నిశీథిలోకి జారుకుంటున్నాయి. అబ్బుర పర్చే నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఇప్పుడు నిర్వహణాలోపానికి తలవంచి మట్టికొట్టుకుపోతున్నాయి. రెండొందల ఏళ్ల సంస్థానాధీశుల పాలనలో అనేక ప్రత్యేకతలతో నిర్మాణమైన రాజమహళ్లు, గడీలుశిథిల వైభవానికి చిరునామాలవుతున్నాయి. 1948లో సంస్థానాల పాలన అంతమైన అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల సంస్థానాధీశులు ఆ భవనాలను ప్రజోపయోగ పనుల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. వీటిల్లో గత యాభై ఏళ్లు సజావుగా కార్యకలాపాలు నిర్వహించారు. కానీ, కొంతకాలంగా వీటిలో కనీస నిర్వహణ కరువైంది. ఈ భవనాలు శిథిలమవుతున్న తీరుపై సంస్థానాధీశుల వారసు లతోపాటు చరిత్రకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాల పరిరక్షణతో పర్యాటకం పెరగటమేకాక ఈ తరానికి ఆర్కిటెక్చర్‌కు సంబంధించి కొత్తపాఠాలు చెప్పినట్లు అవుతుందని వారు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఈ భవనాల వైభవాన్ని ముందు తరాలకు అందించేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కళ చెదిరిన.. రంగ్ మహల్ వనపర్తిలో నూటాఏభై ఎనిమిది ఏళ్ల క్రితం సరికొత్త నిర్మాణశైలితో సంస్థానాధీశుని కోసం నిర్మితమైన ‘రంగుమహల్’ ఇప్పుడు కళ తప్పింది. హైదరాబాద్ స్టేట్‌లో సొంత కరెన్సీ– అరబ్బులుసహా భారీ సైనిక బల గాలతో 152 గ్రామాల్లో 605 చద రపు మైళ్లు కలిగిన అతిపెద్ద సంస్థానం వన పర్తి. ఎత్తైన గోపురాలతో విదేశీ శిల్పుల ఆధ్వర్యంలో 1849లో ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1864లో పూర్తయింది. ఇండియాలో విలీనమైన అనంతరం చివరి సంస్థానాధీశుడు రాజారామేశ్వర రావు దీన్ని ప్రభుత్వానికి అప్పగించారు. దీనిలో 1958లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ చేతుల మీదుగా రాష్ట్రంలోనే తొలి పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అయితే భవనం నిర్వహణ లోపాలతో ఈ మధ్య పెచ్చులూడిపోతుండటంతో క్లాసులను వేరే చోటికి తరలించి ప్రస్తుతం పరిపాలన, గ్రంథాలయం కోసం వినియో గిస్తున్నారు. కళాత్మకమైన ఆర్చీలు ఇప్పటికీ చెదరలేదు. అయితే నిర్వహణ లోపాలతో గడీ మొదటి అంతస్తు మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. తక్షణ మరమ్మతుల కోసం రూ.4.20 కోట్ల అంచనా వ్యయంతో ఫైలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. వనపర్తి సంస్థాన వారసురాలు నందినీరావు హైదరాబాద్‌లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు నిలబెట్టుకున్న సిర్నాపల్లి 1910–13లలో నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లిలో ఇండో– యూరోపియన్ నిర్మాణశైలితో గడీ నిర్మితమైంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్ వాడకుండా ఈ గడీని నిర్మించడం విశేషం. గడీకి ముందు భాగంలో ఇరువైపులా ఎత్తైన గోపురాలు, మధ్యలో రాజసం ఉట్టిపడేలా గంభీరంగా చూస్తూ నిలుచున్న రెండు సింహాలు ఉంటాయి. ఈ గడీ నిర్మాణంలో పూర్తిగా మట్టి, ఇటుకలు, రాళ్లు, డంగుసున్నం, పొడవాటి ఇనుప స్తంభాలు ఉపయోగించారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేందుకు వీలుగా ముఖద్వారం ఉత్తరం వైపు ఉండేలా నిర్మాణం చేపట్టారు. నిర్మాణ శైలి, వాడిన పదార్థాల మూలంగా ఈ గడిలో ఉష్ణోగ్రతలు సమతూకంగా ఉంటాయి. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటుంది. 1921లో జానకీబాయి మరణానంతరం బందిపోట్లు, రజాకార్ల దాడుల్లో ఇతర బంగ్లాలు ధ్వంసమైనప్పటికీ గడీ మాత్రం పటిష్టంగానే ఉంది. తదనంతర కాలంలో ఇది దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ పాఠశాలగా సేవలు అందించింది. దీనిని శీలం జానకీబాయి వారసులు గ్రామస్తుల విరాళాలతో కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామస్తులు రూ.20 వేల విరాళాలు, జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి రూ.60 వేలు అందించారు. గ్రామ పంచాయతీ నుంచి మరో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయించారు. ఉపాధిహామీ కింద దీనికి ఒక వాచ్‌మన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ గడీని పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థుల కోసం గ్రంథాలయంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. దొంగల పాలైన.. ఇందారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గడీ దొంగల పాలైంది. దేశ, విదేశాల నుంచి తెచ్చిన విలువైన సామగ్రి, కలపను ఎత్తుకుపోయారు. నిజాంరాజుకు నమ్మినబంటు అయినా గోనె వెంకట ముత్యంరావు ఆధ్వర్యంలో ఈ గడీని 1927లో హైదరాబాద్ స్టేట్‌లోనే ఓ ప్రత్యేకత శైలితో నిర్మించారు. ఈ గడీ కేంద్రంగా సిరోంచ, గడ్చిరోలి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 300 గ్రామాల పాలన సాగేది. 1948లో నిజాం లొంగుబాటు తర్వాత గోనె వెంకట ముత్యంరావు కుటుంబం హైదరాబాద్‌కు తరలివెళ్లింది. (క్లిక్: తెలంగాణకే తలమానికం! ట్విన్ టవర్స్) టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేయాలి ‘200 ఏళ్ల క్రితమే హైదరాబాద్ స్టేట్‌లో అత్యున్నత శైలిలో భవనాలు నిర్మించారు. అన్ని ప్రాంతాల్లోని సంస్థాన భవనాలపై ప్రభుత్వం తక్షణ శ్రద్ధ చూపి టూరిజం సర్క్యూట్‌గా ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రాచుర్యంతోపాటు అనేకమందికి ఉపాధి కేంద్రాలుగా మారుతాయి’ –అనురాధారెడ్డి, కన్వీనర్, ఇంటాక్ -
ఆ ఊరి పేరు వింటే మన నోరూరుతుంది..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆ ఊరి పేరు వింటే కోవా గుర్తుకు వస్తుంది.. కోవా అనగానే మన నోరూరుతుంది. నిజాంకాలం నుంచి ఆ ఊరే ఓ పాలకోవా... ఇంటింటా పాలవెల్లి.. ఏ ఇంటి ముందు చూసినా పాడిగేదెలే.. ఏ ఇంట చూసినా వంట చెరుకే.. పాలకోవా తయారీ ఆ గ్రామస్తుల వృత్తి. ఇది ఆ ఊరి ఒకప్పటి వైభవం.. ఆ ఊరి రైతు ప్రాభవం.. మరిప్పుడో! పాలవెల్లి పోయింది. కోవా.. వృత్తిని వదులు‘కోవా’అంటోంది. పాడి ఉత్పత్తి పడిపోయింది. వంట చెరుకు కోసం తంటాలు పడాల్సివస్తోంది. ఫలితంగా ఇప్పుడు పాలను మరిగించే రైతుల సంఖ్య కరిగిపోయింది. వారి సంఖ్య 200 నుంచి 20కి తగ్గింది. కోవా తయారీ మూడు క్వింటాళ్ల నుంచి అరక్వింటాకు పడిపోయింది. అంటే.. కోవా తయారీదారులు ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. ఇదీ నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి పాలకోవా కథ. తయారీదారుల వ్యథలు, కష్టాలపై ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.. సిర్నాపల్లి కోవా రుచే వేరు.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామం కోవా తయారీకి ప్రసిద్ధి. నిజాంకాలంలో ఈ ఊరు శీలం జానకీబాయి సంస్థానం. దీని చుట్టూ అటవీప్రాంతమే. పాడిగేదెల పెంపకం ఆ ఊరి రైతుల జీవనాధారం. ఒక్కో కుటుంబం కనీసం పది లీటర్ల నుంచి 50 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి చేసేది. పాలను కేంద్రంలో విక్రయిస్తే నామమాత్రంగా డబ్బులు వస్తున్నాయని క్రమంగా పాల ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించారు. పాలను కాచి కోవా తయారు చేసి విక్రయిస్తున్నారు. కోవా చేసి అమ్మితే రెట్టింపు డబ్బులు గిట్టుబాటు కావడంతో రైతులు ఈ వృత్తిని ఎంచుకున్నారు. కట్టెల కొరత.. కోవా చేయాలంటే పాలను గంటల తరబడి మరిగించాల్సి ఉంటుంది. గతంలో సమీప అటవీ ప్రాంతం నుంచి కట్టెలు తెచ్చుకుని పాలను మరిగించేవారు. ఇప్పుడు కట్టెలు తెచ్చుకోవడంపై అటవీ అధికారులు ఆంక్షలు విధించారు. గ్యాస్ సిలిండర్‌పై పాలు కాద్దామంటే పెరిగిన గ్యాస్ ధరల దడదడ. ఇలా చేస్తే ఏమాత్రం గిట్టుబాటు కాదు. దీంతో కోవా తయారీపై రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. పాడి గేదెల గడ్డికి గడ్డు పరిస్థితి. గతంలో ఒక్కో రైతు కుటుంబంలో పది వరకు గేదెలుంటే ఇప్పుడు రెండు, మూడుకు మించి ఉండటంలేదు. 3.5 లీటర్ల పాలకు కిలో కోవ.. కిలో కోవా తయారు చేయాలంటే కనీసం 3.5 లీటర్ల చిక్కటి పాలు అవసరం. నిత్యం పది లీటర్ల పాలు మరిగిస్తే 3.5 కిలోల వరకు కోవా ఉత్పత్తి అవుతుంది. కిలోకు రూ.300 చొప్పున ఊరిలోనే దళారులకు విక్రయిస్తున్నారు. కోవాను దళారులు నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ వంటి నగరాలకు తరలించి కిలోకు రూ.500 నుంచి రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. పది లీటర్ల పాలను పాలకేంద్రంలో విక్రయిస్తే రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు మాత్రమే వస్తుంది. కానీ కోవా తయారు చేసి విక్రయిస్తే రోజుకు రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతుంది. గ్రామంలో గతంలో రోజుకు సుమారు మూడు క్వింటాళ్ల వరకు కోవా ఉత్పత్తయ్యేది. ప్రస్తుతం అర క్వింటాలుకు పడిపోయింది. కోవా తయారు చేసే కుటుంబాలు సిర్నాపల్లిలో ఒకప్పుడు సుమారు 200 వరకు ఉండేవి. ఇప్పుడా సంఖ్య 20కి పడిపోయింది. పాలను కలుపుతూ కోవా తయారు చేస్తున్న ఈ రైతు పేరు శీలమంతుల నర్సయ్య. గతంలో రోజుకు కనీసం 40 లీటర్ల పాలతో 15 కిలోల కోవాను తయారు చేసి విక్రయించేవారు. దీంట్లో తన ఇద్దరు కుమారులు కూడా పాలుపంచుకునేవారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో రోజుకు రెండు, మూడు కిలోలకు తగ్గించారు. ఇద్దరు కొడుకులు కోవా తయారీ పనిని వదిలేసి ట్రాక్టర్ మెకానిక్‌గా, ఇతర వృత్తుల్లో నిమగ్నమయ్యారు. విద్యుత్ ఆధారిత పాలు కాచే యంత్రాలు ఇవ్వాలి ఇరవై ఏళ్లుగా కోవా తయారీనే మా వృత్తి. మాకున్న రెండు గేదెలు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తాయి. రోజుకు రెండు కిలోల వరకు కోవా తయారు చేస్తున్నాం. ఎండాకాలంలో గడ్డి దొరక్క పాలు ఉత్పత్తి తగ్గుతోంది. ప్రభుత్వం గేదెలతోపాటు విద్యుత్ ఆధారిత పాలు కాచే యంత్రాలు, కోవా నిల్వచేసే యంత్రాల కోసం రుణం ఇస్తే బాగుంటుంది. మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించాలి. – ఉప్పు వసంత, సిర్నాపల్లి పెళ్లిళ్ల సీజన్లో ఎక్కువ గిరాకీ రైతుల వద్ద కొనుగోలు చేసిన కోవాను నిజామాబాద్, కామారెడ్డిలకు తీసుకెళ్లి అమ్ముతుంటా. ఒక్కో కిలోకు రూ.వంద నుంచి రూ.రెండు వందల వరకు గిట్టుబాటు అవుతుంది. ఒక్కోసారి ఎవరూ కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి వస్తుంది. పెళ్లిళ్ల సీజన్లోనే గిరాకీ ఎక్కువ. కోవాను నిల్వ చేస్తే రుచిపోతుంది. ఏ రోజుకు ఆ రోజు వినియోగిస్తేనే బాగుంటుంది. – ఎం.డి జావెద్, కోవా వ్యాపారి