రాజులైనా, సంస్థానాధిపతులైనా, ప్రజాస్వామ్యంలోనైనా పాలకులు చేసిన మంచిని ప్రజలు ఎంత కాలమైనా మరిచిపోరనడానికి నిజామాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. చుట్టుముట్టు దట్టమైన అడవి వున్నా ఒకప్పుడు దాదాపు వంద గ్రామాల సంస్థానంగా వెలుగు వెలిగిన గ్రామం సిర్నాపల్లి. దాన్ని బహుకాలం(1859-1920) ఏలిన రాణి శీలం జానకీ బాయి.
రాణిగారు తవ్వించిన చెరువులు, కుంటలు, కాలువల వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని, ఆమె పట్టుదల వల్లనే ఆనాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1899 లో తలపెట్టిన హైదరాబాద్-బోధన్ -మన్మాడ్ రైల్వే లైన్‌ను సిర్నాపల్లి, ఇందూర్(నేటి నిజామాబాద్ )ల వైపు తిప్పారని, ఫలితంగా తమకు 1905లోనే రైలు సౌకర్య భాగ్యం కలిగిందని, ఇందల్వాయి రామాలయాన్ని ఆమెనే నిర్మించిందని గ్రామస్తులు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంటారు.
పోలీస్ చర్య తర్వాత భారత్‌లో విలీనమైపోయిన హైదరాబాద్ రాజ్యంతో పాటు నాటి సంస్థానాలు 14 కూడా తమ అధికారాన్ని వదులుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట తాకిడితో సిర్నాపల్లి రాణిగారి వారసులు గ్రామాన్ని విడిచిపెట్టక తప్పలేదు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన నక్సలైట్ ఉద్యమంతో దాదాపు 5 ఎకరాల్లో విస్తరించివున్న సిర్నాపల్లి కోటగడి ప్రభుత్వ బడిగా మారిపోయింది.
రాణి జానకీబాయి (1859-1920) వేల్పూర్ రేకులపల్లిలోని ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిందంటారు. వేటకు వచ్చి అడవిలో తప్పిపోయి, ప్రమాదకర పరిస్థితుల్లోనున్న ఒక నవాబుకు, అడవిలోకి వంటచెరుకు కోసం వచ్చిన ఒక 12 సంవత్సరాల బాలిక దారి చూయించి ఆదుకున్నదని, అతను ఆమె ధైర్య సాహసాలను నిజాం దృష్టికి తీసుకుపోవడంతో రాజు జానకీ బాయి అనే ఆ బాలికను సంస్థాన పాలకరాలుగా నియమించాడన్నది ప్రచారంలో నున్న ఒక కథ.
అయితే భర్త అకాల మరణంతో అధికారాన్ని చేపట్టిన జానకీ బాయి సంస్థానాన్ని పాపన్నపేట రాణి శంకర్మమ్మలా సమర్థవంతంగా నడిపి 'మషాల్ దొరసాని'గా (పగలే దివిటీలు వెలగడం ) పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని చరిత్ర. రాణిగారికి సంస్థాన పాలనలో లింగన్న అనే పట్వారి కీలక పాత్ర పోషించాడని చెప్పుకుంటారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి శీలం రాంభూపాల్ రెడ్డి గారు, INTACH అనబడే సాంస్కృతిక వారసత్వ సంస్థ కన్వీనర్ అనురాధా రెడ్డి గారు రాణి జానకీ బాయి వారసులేనట. తెలంగాణ నయాగరాగా పేరొందిన సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ రాణి జానకీ బాయి పేరుతో పిలువబడడం ఆమెకున్న ప్రజాదరణను తెలుపుతుంది.
-వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి
Comments
Please login to add a commentAdd a comment