ప్రభువెక్కిన పల్లకి కాదోయి అది మోసిన బోయీలెవ్వరు అన్నాడు శ్రీ శ్రీ. రాజులూ రాణుల పల్లకిలే కాదు యుద్దాలు జరిగినప్పుడు గాయపడ్డ సైనికులను చికిత్స కోసం శిబిరాలకు చేర్చడానికి కూడా రాజులు బోయీల సేవలను వాడుకున్నారు. అలా అంగ్లేయుల పాలనా కాలంలో సికింద్రాబాద్ మిలిటరీ బటాలియన్లో ఒక 'బోయీ'గా పని చేసినవాడు సూరిటి అప్పయ్య.
1813 వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాదులలో ప్లేగు మహమ్మారి విజ్రుoభించి వేలాది మంది జనం కుప్ప తెప్పలుగా చనిపోతున్న కాలంలో బెటాలియాన్‌తో పాటు మధ్య భారత్ లోని ఉజ్జయినికి బదిలీ పై వెళ్లిపోయాడు అప్పయ్య. అంతేకాదు అక్కడున్న మహంకాళి ఆలయానికి వెళ్లి తనకోసమో తన కుటుంబం కోసమో కాదు అందరికోసం తల్లీ! ఈ మహా విపత్తు నుండి మానవాళిని కాపాడుమని, అదే జరిగితే సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారి విగ్రహం పెడతానని, గుడి కడతానని మొక్కుకున్నాడు.
'ఈ సామాన్య బోయీతో అది అయ్యే పనేనా, అయినా సరే భక్తుడిని పరీక్షిద్దా' మనుకుందో ఏమో అన్నట్లుగా ఆ వ్యాధి తగ్గుముఖం పట్టడం, అప్పయ్య సికింద్రాబాద్కు బదిలీ అయి రావడం జరిగిపోయింది. సూరిటి అప్పయ్య తన మాట తప్పకుండా సహచరుల సహాయం కూడా తీసుకొని కర్రతో చేసిన ఉజ్జయిని అమ్మవారి విగ్రహాన్ని నాటి లష్కర్ లోని ఓ ఖాళీ ప్రదేశంలో (1815 జులైలో) ప్రతిష్టించి, చిన్న గుడి కూడా కట్టించాడట.
ఆ నిర్మాణ సమయంలో అక్కడున్న ఒక పాత బావిని బాగు చేస్తున్నప్పుడు దొరికిన మాణిక్యాలమ్మ విగ్రహాన్ని కూడా ఆ గుడిలోనే ప్రతిష్టించాడని చెబుతారు. అప్పయ్యనే భక్తుల సహకారంతో (1864 లో )కర్ర విగ్రహం స్థానంలో రాతి విగ్రహం పెట్టించాడంటారు. ఆ తర్వాతి కాలంలో అప్పయ్య కుమారుడు సంజీవయ్య (1900) ఆయన కుమారుడు మేస్త్రి లక్ష్మయ్య ( 1914), అతని వారసుడు కిష్టయ్య వరసగా ఉజ్జయిని మహంకాళి ఆలయ అభివృద్ధికి కృషి చేశారట.
ఇంతా జరిగాక 'చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు' అన్నట్లుగా పలుకుబడి గల పెద్దల కమిటీలు రంగ ప్రవేశం చేసి, పూజారి వర్గాన్ని తెచ్చి, చివరికి దేవాదాయ శాఖవారికి ఈ ఆలయాన్ని( 1947 లో ) అప్పగించారట. ఎట్లయితేనేమి,తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల సందర్బంగా లక్షలాది మంది భక్తులు వచ్చే ఒక ఆలయానికి ప్రభుత్వ అజమాయిషీ అవసరమే కాదనడం లేదు, కానీ అసలు సిసలు ధర్మకర్తలను, ఈ ఆలయాన్ని స్థాపించిన సామాన్యులను ఎవరూ లెక్క చేయక పోవడమే విచారకరం.
శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ వారి అధికారిక వెబ్ సైట్ లో , తెలంగాణ ప్రభుత్వ టూరిజం వారి సమాచారంలో 'సూరిటి అప్పయ్య డోలి బేరర్'అని ఒక్క మాట అనేసారే గాని ఈ ఆలయ ఏర్పాటు కోసం అయన పడ్డ పాట్లను చెప్పలేదు, ఈ గుడి కోసం చెమటోడ్చిన అప్పయ్య మూడు తరాల మేస్త్రి వారసుల ప్రస్తావన అసలే తేలేదు.
అంతా పల్లకి నెక్కిన ప్రభువులను కొనియాడే వారే, అది మోసిన బోయీల సేవలను గుర్తించే దెవరు? బోనాల పండగ మరుసటి రోజు 'భవిష్య వాణి' కోసం మాతంగి స్వర్ణలత చుట్టూ మూగేవారే అందరూ కానీ తరతరాలుగా ఆ భాగమ్మలు జోగమ్మలు పడుతున్న బాధలు పట్టించుకునేదెవరు?
-వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి
చదవండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment