మరింత వేగంగా..
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ తుది అనుమతులు రావడంతో మరింత ముందడుగు పడినట్టయింది. నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సీఎం కేసీఆరే దీనిపై స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం తర్వాత ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది సీతారామకే.
ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల రైతులకు మేలు కలుగనుంది. సీఎం మొదటి సమీక్ష ప్రాజెక్టులపై చేయడంతో పాటు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. దీంతో వెంటనే తుది పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ.11 వేల కోట్ల నిధుల సేకరణ సైతం పూర్తయిందని సీఎం ప్రకటించారు. ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఇటీవల రిటైర్డ్ ఇంజినీర్ల బృందాన్ని పంపించిన కేసీఆర్, వారి ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. ఇక తాజాగా తుది పర్యావరణ అనుమతులు సైతం రావడంతో మరింత నజర్ పెట్టనున్నారు.
అంచనా వ్యయం రూ.13,884 కోట్లు..
జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్‌గా నామకరణం చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం, భదాద్రి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో ఆయకట్టును 9.36 లక్షల ఎకరాలకు పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొదట 5 లక్షల ఎకరాలకు నీరందించాలని అనుకున్నప్పటికీ, ఆ తర్వాత 6.75 లక్షల ఎకరాలకు పెరగడంతో అంచనా వ్యయాన్ని రూ.7,926 కోట్ల నుంచి రూ.13,884 కోట్లకు ప్రభుత్వం పెంచింది.
అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం గ్రామంలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. కుమ్మరిగూడెం నుంచి పాల్వంచ మండలం కోయగుట్ట, ములకపల్లి మండలం కమలాపురం, ఇల్లెందు మండలం చీమలపాడు, రోళ్లపాడు చెరువు, బయ్యారం పెద్ద చెరువు ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు నీరు తరలించేందుకు సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మిస్తున్నారు. మొత్తం 372 కిలోమీటర్ల కాలువ నిర్మించనున్నారు. అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద మొదటి దశ పంప్‌హౌస్, పాల్వంచ మండలం నాగారం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్, ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద రెండోదశ పంప్‌హౌస్, కమలాపురం వద్ద మూడోదశ పంప్‌హౌస్ పనులు జరుగుతున్నాయి. వీటిల్లో మొదటి, రెండో దశ పంప్‌హౌస్‌లతో పాటు కిన్నెరసానిపై అక్విడెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వచ్చే జూన్ నెలాఖరు కల్లా భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న మొదటి దశ పంప్‌హౌస్ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ములకలపల్లి మండలంలోని కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్‌హౌస్ పనులు మాత్రం ఆలస్యం అవుతున్నాయి. ఫేజ్–1లో 110 కిలోమీటర్ల కెనాల్‌కు గాను 40 కిలోమీటర్ల వరకు కెనాల్ పనులు వేగంగా నడుస్తున్నాయి. సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, 2వ దశ ద్వారా 3.25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు.
ఫిబ్రవరిలో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కెనాల్ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏన్కూర్ వద్ద ఒక లింక్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ ద్వారా సాగునీటి సరఫరాలో ఇబ్బందులు వచ్చినప్పటికీ.. ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీతారామతో అనుసంధానం చేయాలని, సాగర్ చివరి ఆయకట్టుకు సీతారామ ద్వారా నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నుంచి మొత్తం 372 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించనున్నారు. ఆ దారిపొడవునా అనేక చోట్ల చెరువులు నింపేలా డిజైన్ రూపొందించారు.