శివయ్యా.. ఎంత ఘోరం జరిగిందయ్యా!
దేవనకొండ: శ్రీశైల మల్లన్నంటే వారికి ఎనలేని భక్తి. ఏటా ఉగాది సమయంలో వందల కిలోమీటర్లు నడిచి శ్రీశైలానికి వెళ్తుంటారు. మల్లికార్జునస్వామిని దర్శించుకుని వస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాదీ కాలినడకన శ్రీశైలం బయలుదేరారు. అయితే..మార్గమధ్యంలో వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన బుధవారం కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని ఈదులదేవరబండ–కప్పట్రాళ్ల మధ్య చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా మోకా మండలంలోని ఎర్రగుడి ప్రాంతానికి చెందిన గడ్డం ఉలిగయ్య, గడ్డం పోతప్ప, గడ్డం శేఖతో పాటు మరి కొంతమంది రెండు రోజుల క్రితం పాదయాత్రగా శ్రీశైలానికి బయలుదేరారు. మంగళవారం రాత్రి ఆస్పరి మండలం పుటకలమర్రి మోడల్ స్కూల్ వద్ద సేద తీరారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి నడక ప్రారంభించారు. దేవనకొండ దాటి ఈదులదేవరబండ –కప్పట్రాళ్ల మధ్య వెళ్తుండగా బళ్లారి నుంచి నంద్యాల వెళ్తున్న లారీ (ఏపీ21టీఈ0099) వెనుక వైపు నుంచి భక్తుల మీదుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎర్రగుడి గ్రామానికి చెందిన గడ్డం ఉలిగయ్య(28), గడ్డం శేఖ(15), గడ్డం పోతప్ప(23) అక్కడికక్కడే మృతిచెందారు.
గడ్డం గాదిలింగ, గడ్డం పోతులింగ, హాలహర్వి నాగరాజు, దేవేందర్‌రెడ్డి, గడ్డం బాలరాజు, గడ్డం పరశురాముడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజనాసుపత్రికి తరలించారు. పోతులింగ, నాగరాజు, దేవేందర్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ చిన్నపీరయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలుకు తరలించారు. మృతులు గడ్డం ఉలిగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, గడ్డం పోతప్పకు ఒక కుమారుడు ఉన్నారు. కాగా.. లారీలకు ఎక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అతివేగంగా రావడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.