డల్లాస్లో ఘనంగా 'శివతత్వం' ఈవెంట్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా), సనాతన ధర్మ ఫౌండేషన్(ఎస్డీఎఫ్), కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్(కేఎస్టీహెచ్) సంయుక్తంగా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాయి. 'శివతత్వం' అనే అంశంపై డల్లాస్ కేఎస్టీహెచ్ లో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రముఖ నటుడు, రచయిత తనికేళ్ల భరణి పాల్గొన్నారు. శివతత్వంపై అక్కడికి వచ్చిన వారికి అర్థమయ్యేలా వివరించారు. ఆయన ఇష్టదైవం పరమశివుడిపై తాను రాసిన పాటలను భక్తిగా పాడి వినిపించారు. శివతత్వాన్ని తనవంతుగా ప్రచారం చేస్తున్న భరణికి 'శివతత్వ విశారద' అనే బిరుదునిచ్చారు.
కేఎస్టీహెచ్ చైర్మన్ డాక్టర్ ప్రకాశ్ రావ్ వెలగపుడి మాట్లాడుతూ.. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్(జీహెచ్హెచ్ఎఫ్) చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. హిందూమతం విశిష్టతను, వారసత్వాన్ని హిందూ దేవాలయాలను, పుణ్య పీఠాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కేఎస్టీహెచ్ గొప్పతనాన్ని, విశిష్టతలను ఆలయ అధ్యక్షుడు ఆర్కే వెల్లంకీ తెలిపారు. సనాతన ధర్మ ఫౌండేషన్ కీలక సభ్యుడు గోపాల్ పొనాంగి నటుడు, దర్శకుడు అయిన తనికేళ్ల భరణిని సభకు పరిచయం చేశారు. 650కి పైగా మూవీలలో విభిన్న పాత్రలను పోషించారని కొనియాడారు. ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డును మూడు పర్యాయాలు అందుకున్నారని చెప్పారు. శ్రీకాళహస్తిశ్వర శతకం రాసిన ధూర్జటి కవి గురించి తనికేళ్ల భరణి ప్రస్తావించారు. తాను రాసిన పాటల్లో ఆయనకు ఎంతో పేరు తెచ్చిన 'ఆటగదర శివ' పాట పాడి వినిపించారు.
తనికేళ్ల భరణిని ఈవెంట్కు ఆహ్వానించిన వ్యక్తి తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తనికేళ్ల భరణి గారి లాంటి ప్రముఖులను కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి కృషిచేశారు. తానా ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో భాగస్వాములయిన ఎస్డీహెచ్, కేఎస్టీహెచ్, మ్యుజిషియన్స్ ప్రభాళ, రాజు, వాలంటీర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు తనికేళ్ల భరణి, తానా కోషాధికారి మురళి వెన్నమ్, రీజనల్ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు, డైరెక్టర్ చలపతి కె, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, సనాతన ధర్మ ఫౌండేషన్ కీలక సభ్యుడు గోపాల్ పొనాంగి, , మధుమతి వ్యాసరాజు, ఐవీ రావు, మహేశ్ చొప్పా, విజయ్ తొదుపునూరి, లక్ష్మి తుమ్మల, శ్రీరామ్ చెరువు, జయేశ్ టి, ఇతర ముఖ్యలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.