sivaiah
-
ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
మార్కాపురం: రహదారిపై గేదెలు అడ్డురావడంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట్ల, తిప్పాయపాలెం గ్రామాల మధ్య అమరావతి–అనంతపురం హైవేపై శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు చింతగుంట్ల–తిప్పాయపాలెం గ్రామాల మధ్యకు రాగానే ఆకస్మికంగా గేదెలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించే క్రమంలో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గజ్జల శివయ్య(45)కు తీవ్ర గాయాలుకావడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందారు. విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన కె.విజయలక్ష్మీబాయి(40)కి తీవ్రగాయాలయ్యాయి. ఆమెకు మార్కాపురం జీజీహెచ్‌లో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో నరసరావుపేట వద్ద మృతిచెందారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో హరినాథ్, రాజీబీ, నాగమయ్య నాయక్, ఢమరుకానందరెడ్డి, మునీందర్‌రెడ్డి, అప్సన్, మోహిత్, దస్తగిరి అనే ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరికి మార్కాపురం జీజీహెచ్‌లో చికిత్స అందించారు. గజ్జల శివయ్యకు భార్య సువర్ణ, ఒక కుమారుడు, కుమార్తె, విజయలక్ష్మీబాయికి భర్త కాశీనాయక్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఆ తెలుగు డైరెక్టర్ ప్రేమలో సంఘవి.. దీంతో కెరియరే నాశనమైందా..?
అందాలతో కనువిందు చేస్తూ, అభినయంతోనూ అలరించిన నటి సంఘవి. కావ్య రమేష్‌గా కర్ణాటకలోని మైసూరులో 1977 అక్టోబర్ 4న పుట్టింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. తర్వాత ఆయన మరణించడంతో ఆమె కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఆమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో 8వ తరగతి వరకే ఆగిపోయింది. కన్నడ నటి ఆరతి సంఘవి కుటుంబానికి దగ్గరి బంధువు కావడంతో ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల బాల్యంలోనే చదవు ఆపేసి బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా 1993లో ఆమెకు తమిళ హీరో అజిత్ సరసన అమరావతి సినిమాలో హీరోయిన్గా తొలిసారి అవకాశం దక్కింది. అలా ఆమె 90వ దశకంలోని టాప్ హీరోల అందరితోనూ సినిమాలు చేసింది. చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేశ్,జూ. ఎన్టీఆర్, రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో నటించింది సంఘవి. ఆ హీరోతో ప్రేమ వల్ల అవకాశాలు పోగొట్టుకున్న సంఘవి అజిత్ సినిమా తర్వాత తమిళ్ స్టార్ దళపతి విజయ్‌తో ఆమె జోడిగా సినిమా ఛాన్స్ దక్కింది. ఆ సినిమాకు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అయినా కూడా సంఘవి- విజయ్ జోడిగా మూడు సినిమాలను ఆయన డైరెక్ట్ చేశాడు. నాలుగో సినిమా కూడా వారిద్దరితో ప్లాన్ చేసిన చంద్రశేఖర్ షూటింగ్ మధ్యలోనే ఆర్థాంతరంగా ఆపేశాడు. దీనికి ప్రధాన కారణం విజయ్- సంఘవి ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారం రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు కోలీవుడ్‌లో సినిమా అవకాశాలు రాకుండా పోయాయి. తెలుగులో లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఆ డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి శ్రీకాంత్‌తో తాజ్‌మహల్ సినిమా నిర్మిస్తున్న డి రామానాయుడు సెకండ్ హీరోయిన్ కోసం సర్చ్ చేస్తున్న సమయంలో సంఘవి వచ్చి ఆయన్ను కలవడంతో ఆడిషన్స్ చేసి అలా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సురేష్ ప్రొడక్షన్స్‌లో సుమారు అరడజనుకు పైగా సినిమాలు చేసింది. ఇదే క్రమంలో చిరంజీవి,వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. అలా ఆమె కెరియర్ టాప్ రేంజ్లో దూసుకుపోతుండగా రాజశేఖర్‌తో 'శివయ్య' సినిమాలో నటించింది. ఆ సినిమాకు తెలుగు డైరెక్టర్ అయిన సురేష్ వర్మ తెరకెక్కించాడు. సినిమా సమయంలో అతనితో ప్రమలో పడిన సంఘవి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్.. ఎవరా మిస్టరీ మ్యాన్?) ఈ పెళ్లి ఆమె తల్లికి ఇష్టం లేదు అయినా ప్రేమ కోసం ఇంట్లో నుంచి వచ్చేసింది సంఘవి. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత సపోర్టింగ్ యాక్టర్, ఐటెం సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయింది. ఇలాంటి సమయంలోనే పెళ్లైన ఏడాదికి భార్యభర్తల మధ్య విబేదాలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం సురేష్ వర్మ ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉండటం. అంతేకాకుండా షూటింగ్‌కు వెళ్లి వస్తున్న సంఘవి పట్ల అతనికి అనుమానం రావడం వంటి కారణాలు అప్పట్లో వచ్చాయి. దీన్ని తట్టుకోలేని సంఘవి అతనికి విడాకులు ఇచ్చేసి తల్లి వద్దకు వెళ్లిపోయింది. అలా టాప్ రేంజ్లో ఉండాల్సిన సంఘవి ప్రేమ పెళ్లితో ఆ అవకాశం చేజార్చుకుంది. పెళ్లి విషయంలో ఎన్నో కష్టాలు విడాకుల తర్వాత సంఘవికి సినిమా అవకాశం వచ్చింది. జూ.ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలో ఆమె కనిపించింది. తర్వాత పలు సినిమాలు చేసినా అవి అంతగా మెప్పించకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తల్లి సూచన మేరకు సీరియల్స్లలో నటించింది. అక్కడా ఆమె ఫేట్ మారలేదు. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని ఒక ఎన్ఆర్ఐ సంబంధాన్ని ఆమె తల్లి తెచ్చింది. కొన్ని కారణాల వల్ల అదీ ఆగిపోయింది. అప్పటికే సంఘవికి 39 ఏళ్లు దీంతో ఆమె పెళ్లిపై తల్లికి ఆందోళన పెరగడం. ఎలాగైనా తనకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం ప్రారంభించింది. అలా కర్ణాటకకు చెందిన ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్‌ను 2016లో ఆమె పెళ్లి చేసుకుంది. సంఘవి కన్నడ అమ్మాయి కాగా, వెంకటేశ్ మలయాళీ. 42 సంవత్సరాల వయస్సులో ఆమెకు మొదటి సంతానంగా పాప జన్మించింది. సంఘవి ఆస్తుల విలువ వెంకేశన్తో పెళ్లి తర్వాత ఆమె టీవి సీరియళ్లతో పాటు పలు డ్యాన్స్ షోలకు జడ్జ్‌గా వ్యవహరించింది. కానీ 2019 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నటి సంఘవి ఈరోజు తన 46వ పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకుంటుంది. కర్ణాటకలోని మైసూరులో భర్తతో ఉంటున్న నటి సంఘవి ఆస్తి సుమారు రూ. 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. -
కళ్లల్లో కారంకొట్టి... దొంగను పట్టుకున్న మహిళలు
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని బుడేసాయిబ్ వీధిలో పట్టపగలే చోరీకి యత్నించిన ఓ దొంగను మహిళలు ధైర్యం చేసి కళ్లల్లో కారం కొట్టి పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బుడేసాయిబ్వీధిలోని బడుగు శివయ్య ఇంటికి తాళం వేసి ఉండగా... ఓ దొంగ దాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అది చూసిన మహిళలు ఇంటి బయట గడియపెట్టారు. దీంతో తాను ఎక్కడ దొరికిపోతానోనన్న భయంతో అతడు కత్తి తీసుకుని తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు. అక్కడున్న వారిపై కత్తితో దాడికి దిగాడు. ఓ ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. ఇక లాభం లేదనుకున్న మహిళలు అతడి కళ్లల్లో కారం చల్లి వెంటనే కాళ్లు పట్టుకుని కిందకు నెట్టేశారు. చివరికి అతడ్ని పోలీసులకు అప్పగించారు. -
వైద్యం వికటించి గర్భిణి మృతి
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని ఆశ్రమం ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. లింగపాలెం మండలం మేడిచర్లకు చెందిన సాలూరి భార్గవి (26)కి నొప్పులు అధికం కావడంతో శనివారం తెల్లవారుజామున ఆశ్రమం ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యం ప్రారంభించిన తర్వాత బిడ్డను కనకముందే భార్గవి మృతి చెందింది. శస్త్రచికిత్స చేసేందుకు మత్తుమందు ఇవ్వగా, ఊపిరితిత్తులు పట్టేసి గుండెకు స్ట్రోక్ రావడంతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. భార్గవి, శివయ్య దంపతులకు రెండు సంవత్సరాల కుమార్తె ఉంది. -
కన్నబిడ్డలు కాలదన్నారు
పోరుమామిళ్ల : ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుని పేరు బడిగించల సుబ్బన్న. ఊరు ప్రొద్దుటూరు. ఇతను గతంలో మగ్గం నేసేవాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. అందరికీ వివాహాలు చేశాడు. వయసు మీద పడటంతో ఏపనీ చేయలేక ఇంటి వద్దే ఓ బంకు పెట్టుకుని జీవిస్తుండగా దాన్ని రెండో కుమారు డు వెంకటసుబ్బయ్య స్వాధీనం చేసుకున్నాడు. కొడుకు, కోడలు కలిసి సుబ్బన్నను గెంటేశారు. పెద్ద కొడుకు శివయ్య మైలవరం మండలం వేపరాలలో మగ్గం నేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు. ఇక మూడో కుమారుడు మణికంఠ కూడా కడపలో ఉంటున్నాడు. అతను కూడా తండ్రి బాగోగులు పట్టించుకోలే దు. తన కంటే ఇద్దరు పెద్దవాళ్లు ఉండగా వారికి పట్టం ది తనకెందుకు అని కరాఖండిగా చెప్పేశాడు. అంతటితో ఆగకుండా తండ్రిని తీసుకెళ్లి నాలుగు రోజుల క్రి తం కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో వది లేసి వెళ్లాడు. అతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొందరి సాయంతో సోమవారం రాత్రి పోరుమామిళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. తనకు ముగ్గురు కొడుకులున్నా ఎవరూ తనకు అన్నం పెట్టడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్య మాత్రం నెల్లూరులో చిరువ్యాపారం చేసుకుంటున్న తన కూతురు లక్ష్మిదేవి వద్ద ఉంటోందని చెప్పాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆసుపత్రి నుంచి డిస్చార్జి అయిన సుబ్బన్నకు ఎటు వె ళ్లాలో దిక్కుతోచలేదు. తనను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి అని అక్కడున్న వారిని ప్రాధేయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జ్ఞాన సరస్వతి దేవి ట్రస్టు ప్రతినిధి శ్రీనివాసులు తమ సంస్థ సభ్యులతో కలిసి వృద్ధుడిని తీసుకెళ్లి కడపలోని గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌లో చేర్చాడు. కన్నబిడ్డలు కాలదన్నినా తన స్థితిని చూసి స్పందించి వృద్ధాశ్రమంలో చేర్పించిన యువకులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు. -
కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి
వైఎస్సార్ జిల్లా: కరెంటు షాక్‌తో బొమ్మి శివయ్య(30) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలం కమ్మతల్లి హరిజనవాడలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామంలో శివయ్య అనే వ్యక్తి తాగునీటి మోటారు రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలింది. దీంతో శివయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. శివయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. (ఓబులవారిపల్లి) -
శ్రీశైలంలో దంపతుల ఆత్మహత్య
శ్రీశైలం, న్యూస్‌లైన్ : మొదటి భార్యకు సంతానం కల్గలేదంటూ రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి చివరకు ఆమెకు జన్మించిన కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఒంటరిగా మిగిలిని మొదటి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీశైల క్షేత్రం పాతాళగంగ రోడ్డు మార్గంలో ఉన్న సర్వతోభద్ర వనంలో గురువారం చోటు చేసుకుంది. మృతులను మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల మండలం మరికల్ గ్రామానికి చెందిన శివ య్య (50)శాంతమ్మ (45)గా పోలీసులు గుర్తించారు. సీఐ నాగేశ్వరరావు వివరాల మేరకు శివయ్య తన మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకోగా ఇద్దరు కొడుకులు, కూతురు కలిగారు. కూతురుకు పెళ్లీడు రావడంతో రెండేళ్ల క్రితం ఘనంగా పెళ్లి జరిపించాడు. అయితే ఇందుకోసం చేసిన అప్పులు వడ్డీలు పెరిగిపోవడం, ఇచ్చిన వాళ్లు ఒత్తిడి తెస్తుండడంతో భరించలేక చనిపోవాలనుకున్నాడు. అయితే తాను పోతే కొడుకులున్నారు కాబట్టి రెండో భార్యకు ఇబ్బంది లేకున్నా మొదటి భార్య మాత్రం ఒంటరిదవుతుందని భావించి ఆమెను కూడా వెంట తీసుకెళ్లాడు. ఏదో ఊరికి ఇద్దరం కలిసి వెళ్తున్నామని అందరికీ చెప్పిన శివయ్య పత్తి పంటకు పిచికారి చేసేందుకు తెచ్చిన పురుగు మందు తీసుకుని బుధవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. గురువారం ఉదయం స్ప్రైట్ కూల్‌డ్రింక్ బాటిల్లో మందు కలిపి ఇద్దరూ తాగారు. అక్కడున్న తోటమాలి గమనించి సమాచారం ఇవ్వగా 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చారు. అప్పటికే శాంతమ్మ మరణించగా శివయ్యను ప్రాజెక్టు వైద్యశాలకు తరలించారు. అతడు చికిత్స పొందుదూ మృతి చెందాడు. వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. వారి వద్ద ఉన్న ఫోన్‌బుక్ ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.