ఆ గ్యాంగ్‌స్టర్‌ని మళ్లీ జైలుకు పంపండి!
ఒకప్పటి గ్యాంగ్‌స్టర్, వివాదాస్పద ఆర్జేడీ నేత షాహబుద్దీన్‌ను మళ్లీ జైలుకు పంపడమే మంచిదని సివాన్ జిల్లా అధికార యంత్రాంగం నితీశ్‌కుమార్ ప్రభుత్వానికి నివేదించింది. మాజీ ఎంపీ అయిన షాహబుద్దీన్ ఇటీవల జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది.
గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన షాహబుద్దీన్‌ను విడుదల చేయడంతో అతని స్వస్థలం సివాన్‌లో భయాందోళన నెలకొందని, స్థానిక ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని, ముఖ్యంగా వ్యాపారులు మళ్లీ బెదిరింపులు ఉంటాయని భయపడుతున్నారని అధికార యంత్రాంగ తమ నివేదికలో తెలిపింది. షాహబుద్దీన్ భయంతో చాలామంది వ్యాపారులు తమ దుఖాణాలు తెరువడం లేదని వెల్లడించింది.
షాహబుద్దీన్ బెయిల్‌పై విడుదల కావడంతో నితీశ్ సర్కారుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. బిహార్‌లో 'సుపరిపాలన' పోయి మళ్లీ ఆటవిక రాజ్యం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, నేరచరితుడైన షాహబుద్దీన్‌ను మళ్లీ జైలుకు పంపాల్సిందేనని బీజేపీ నితీశ్ సర్కారుపై ఒత్తిడి తెస్తోంది.