ప్రేమ సంగీతం
హాలీవుడ్ సినిమా / స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్
ప్రేమలో ఎన్నిసార్లు ఓడిపోయినా, గెలవడానికి ప్రయత్నిస్తూ, తమ మనసులను పట్టి ఉంచే మ్యాజిక్ కోసం అన్వేషించి, ఆ ప్రేమలోనే మునిగిపోయిన రెండు హృదయాల ప్రేమకథ - హాలీవుడ్ చిత్రం ‘స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్’ (1993). 1957లో వచ్చిన హాలీవుడ్ లవ్ క్లాసిక్ ‘యాన్ ఎఫైర్ టు రిమెంబర్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకురాలు నోరా ఎఫ్రాన్ ఈ చిత్రాన్ని ఓ మోడ్రన్ లవ్ క్లాసిక్‌గా మలిచారు.
కథలోకి వెళితే...
భార్యకు దూరమైన దుఃఖంలో శామ్ బాల్డ్విన్ (టామ్ హ్యాంక్స్) కొడుకు జోనా (రోస్ మాలింజర్)తో కలిసి తన సొంత ఊరైన చికాగో నుంచి సియాటిల్ నగరంలో సెటిల్ అవుతాడు. మరోవైపు బాల్టిమోర్‌లో యానీ రీడ్ (మెగ్ రియాన్) రిపోర్టర్ తనను ఎంతగానో ప్రేమించిన వాల్టర్ (బిల్ పుల్‌మ్యాన్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. అయితే అనూహ్యంగా సియాటిల్, బాల్టిమోర్.. నగరాల మధ్య నాలుగు వేల కి.మీ. దూరం శామ్‌ను, యానీ రీడ్‌ను కలుపుతుంది.
అవి క్రిస్మస్ రోజులు. శామ్ తన భార్య చనిపోయిన దుఃఖంలో కుంగిపోతూ ఉంటాడు. కొడుకు ఎనిమిదే ళ్ల జోనా తన తండ్రి బాధ చూడలేక ఓ రోజు రేడియో షోకు ఫోన్ చేస్తాడు. తన తండ్రి బాధలో ఉన్నాడని, ఇప్పుడు ఆయన జీవితానికి కొత్త తోడు కావాలని రేడియోలో మాట్లాడుతున్న డాక్టర్‌కు చెబుతాడు. ఫోన్ ‘మీ డాడీకి ఇవ్వమన’గానే శామ్‌ను పిలిచి ఇచ్చేస్తాడు. శామ్ మొదట్లో కాస్త కోప్పడినా భార్యను కలిసిన క్షణాలను గుర్తుచేసుకుని, అందరితో పంచుకుంటాడు. కొన్ని వేల మంది అతని మాటలు విని బాధపడతారు. అందులో యానీ కూడా ఉంటుంది. ఎందుకో భార్య మీద అతనికున్న ప్రేమ యానీ మనసును తాకుతుంది. వాల్టర్‌తో తాను గడుపుతున్న క్షణాల్లో లేని మ్యాజిక్ అతని గొంతులో ధ్వనించింది. మెల్లగా శామ్ ఆలోచనలు ఆమె మనసును ఆక్రమించుకుంటాయి. శామ్కు తోడవుతామంటూ, అతని అడ్రస్‌కు బోలెడన్ని ఉత్తరాలు పోస్ట్‌లో వస్తాయి. శామ్ వాటిని చూసి కూడా పట్టించుకోకుండా వదిలేస్తాడు. కొడుకు జోనా మాత్రం తన తండ్రికి తగ్గ అమ్మాయి కోసం ఆ ఉత్తరాలు చదువుతూనే ఉంటాడు.
ఆ క్రమంలో యానీ ‘వేలెంటైన్స్ డే’ రోజున న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీద కలుద్దామని శామ్కు ఉత్తరం రాస్తుంది. ఆఫీస్ పని మీద అని ప్రేమికుడు వాల్టర్‌కు అబద్ధం చెప్పి, శామ్‌ను కలవడానికని సియాటిల్‌కు ఫ్లైట్ ఎక్కుతుంది.
ఇటువైపు తన స్నేహితురాలు విక్టోరియాను ఫ్లయిట్ ఎక్కించడానికి వచ్చిన శామ్ అప్పుడే అక్కడ ఫ్లైట్ దిగిన యానీ అందాన్ని చూసి మైమరిచిపోతాడు. అయితే అక్కడ శామ్ ఒక అమ్మాయితో ఉండడాన్ని దూరం నుంచి గమనించిన యానీ, ఆమె అతని ప్రియురాలేమో అని పొరపాటుపడుతుంది. దాంతో మళ్లీ వాల్టర్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో వేలంటైన్స్ డే రానే వస్తుంది. శామ్ వెళ్లడానికి ఒప్పుకోకపోవడంతో కొడుకు జోనా ఆ రోజు ఆమెను కలవడానికి న్యూయార్క్ వెళ్లిపోతాడు.
యానీ కూడా తన బోయ్‌ఫ్రెండ్ వాల్టర్‌తో కలిసి న్యూయార్క్‌కు వెళుతుంది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీదకు చేరుకున్న జోనా ఉదయం నుంచి యానీ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాడు. కానీ అతని ఆశ నిరాశగానే మారుతుంది. మరో పక్క...వాల్టర్‌తో కలిసి ఉన్నా సరే యానీ మనసులో ఏదో తెలియని దిగులు. యానీకి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కళ్ల ముందు మెదిలే సరికి ఇక అసలు విషయం వాల్టర్‌కు చెబుతుంది. వాల్టర్ ఆమెను అర్థం చేసుకోవడంతో యానీ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు వెళుతుంది. ఇంతలో శామ్ తన కొడుకు జోనాను కలుస్తాడు. జోనా కూడా ఆమె ఇక రాదని అర్థమై తండ్రితో కలిసి కిందకు వెళ్తాడు. ఆమె పైకి వెళితే, వీళ్లిద్దరూ కిందకు వెళతారు. పైన ఎవరూ లేకపోయే సరికి, యానీ కూడా ఇక నిరాశగా వెళ్లే టైంకి జోనా బిల్డింగ్ మీద మర్చిపోయిన తన బ్యాగ్ కోసం తండ్రితో కలిసి మళ్లీ వెనక్కు వస్తాడు. అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో చూసిన అమ్మాయేనా యానీ అని శామ్ ఆశ్చర్యపోతాడు. జోనా తన తండ్రిని ఆమెకు పరిచయం చేస్తాడు. ఇద్దరూ అలా ఒకరినొకరు చూసుకుంటూ లిఫ్ట్‌లోకి వెళ్లగానే, శ్యామ్‌తో ‘‘నైస్ టూ మీట్ యూ శామ్’’ అని యానీ చెప్పగానే.... కథ ముగుస్తుంది.
- బి.శశాంక్
వసూళ్లు 1500 కోట్లు!
‘స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్’ చిత్రాన్ని 2.1 కోట్ల డాలర్ల (ఇప్పటి మన లెక్కలో రూ. 138 కోట్ల 60 లక్షలు) బడ్జెట్‌తో తీస్తే, 22.78 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 1500 కోట్లు) వసూలు చేసి, సంచలన విజయం సాధించింది. ‘స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్’ చిత్రంలో హీరోయిన్ పాత్రకు మొదట ప్రముఖ నటి జూలియా రాబర్ట్స్‌ను ఎంచుకున్నారు. కానీ, ఆమె ఈ పాత్ర చేయడానికి తిరస్కరించారు. దాంతో, మెగ్ రియాన్‌ను ఈ పాత్ర వరించింది. సియాటిల్‌లో టామ్ హ్యాంక్స్ ఇల్లుగా చూపించిన బోట్ హౌస్ ఈ మధ్యే 20 లక్షల డాలర్ల (దాదాపు రూ. 13.2 కోట్లు)కు అమ్ముడైంది.