Small farmers
-
సేద్యానికి నోట్ల సెగ..
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో చిన్న రైతులు చితికిపోయారని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. నోట్ల రద్దుపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ బ్లాక్ మనీ నియంత్రించేందుకు ఇది అవసరమని ఇన్నాళ్లూ మోదీ సర్కార్ సమర్ధించగా తాజాగా నోట్ల రద్దుతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఈ నిర్ణయం వెలువడిన రెండేళ్ల తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. విత్తనాలు, ఎరువులు కొనేందుకు నగదుపై ఆధారపడే చిన్న రైతులు నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా సమస్యలు ఎదుర్కొన్నారని నివేదిక వెల్లడించింది. రబీ సీజన్‌కు ముందు నగదు కొరతతో లక్షలాది రైతులు విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేయలేకపోయారని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నోట్ల రద్దు అమలైన సమయంలో రైతులు వారి ఖరీఫ్ దిగుబడులను అమ్ముకోలేక, రబీ పంటలను సాగుచేయలేక సమస్యల్లో కూరుకుపోయారని తెలిపింది. రైతుల చేతిలో ఉన్న నగదంతా నోట్ల రద్దుతో చెల్లుబాటు కాకుండా పోయిందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం సైతం విత్తనాలను విక్రయించలేదని, తమ పొలాల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి క్రమంలో పెద్ద రైతులు సైతం నగదు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించింది. నగదు కొరతతో నేషనల్ సీడ్ కార్పొరేషన్‌కు చెందిన 1.38 లక్షల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు విక్రయానికి నోచుకోలేదని తెలిపింది. పాతనోట్లతోనూ గోధుమ విత్తనాలు కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం తర్వాత సడలింపు ఇచ్చినా పరిస్థితి మెరుగుపడలేదని పేర్కొంది. -
పలుకుబడికే ఉపాధి పనులు
నేరడిగొండ : దేవుడు వరమ్మిచినా.. పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది.. అధికారుల నిర్లక్ష్యంతో మహాత్మా గాంధీ ఉపాధిహామీ ఫలాలు రైతులకు అందడం లేదు. ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వం ఈజీఎస్‌లో రైతులకు ఎన్నో రకాల వ్యవసాయ అనుబంధ పనులు చేర్చి నిధులు కేటాయిస్తోంది. కానీ సంబంధిత అధికారులు, ఉపాధి సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఈ పథకం కొందరికే పరిమితమైంది. వ్యవసాయంపైనే ఆధారపడ్డ రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఉపాధిలో వివిధ వ్యవసాయ ఆధారిత పనులు చేర్చుతూ ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో రైతుల అభివృద్ధికి ఆ పథకం ద్వారా ఒకట్రెండు పనులు మాత్రమే చేపట్టింది. కానీ ప్రస్తుతం వాటి సంఖ్యను పెంచి రైతుల అభివృద్ధికి బాసటగా నిలుస్తోంది. రైతులకు చేరువకాని వైనం... రాజకీయంగా ఎంతోకొంత పలుకుబడి, అధికారులతో కాస్తోకూస్తో పరిచయం ఉన్నవారికి మాత్రమే ఉపాధిహామీ పథకం ద్వారా కల్పిస్తున్న ఫలాలు అందుతున్నాయి. చదువురాని సన్న,చిన్నకారు రైతులకు మాత్రం ఏమీ దక్కడంలేదు. ఎలాగో ఒకలా ఈ పథకాల గురించి తెలుసుకొని స్థానిక ఉపాధిహామీ సిబ్బందిని అడిగితే ఆ పని ఈయేడాది కాదు, వచ్చే యేడాది చూద్దాములే అంటూ దాటవేస్తున్నారు. లేకపోతే ఈ పనికి ఇంత ఖర్చు అవుతుందని, ఆ పని అంత అవుతుందని ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి మండలస్థాయి అధికారుల వరకు లెక్కలువేసి మరీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఖర్చులు ఇవ్వలేని సన్న, చిన్నకారు రైతులకు ఉపాధి ఫలాలు అందని ద్రాక్షలా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కరువు.. ఉపాధిహామీ పథకం ద్వారా అనేక రకాలుగా రైతులకు ప్రయోజనం కలిగే విధంగా పనులు చేపడుతున్నప్పటికీ అవగాహన కల్పించకపోవడంతో రైతులకు ప్రయోజనం కలగడం లేదు. ఆసక్తి ఉన్న కొందరు రైతులకు అధికారులు సహకారం ఇవ్వకపోయినా సొంత ఖర్చులతో పాంపండ్లు నిర్మించుకుంటున్నారు. అధికారులు ఉపాధిహామీ పథకం ద్వారా రైతుల సంక్షేమం కోసం చేపట్టే పనులపై విస్తతంగా ప్రచారం చేపట్టాలని గ్రామాల్లో సన్న, చిన్నకారు రైతులకు సైతం పనులు, పథకాలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
చిన్నరైతులకు రుణమాఫీ చేయండి: హైకోర్టు
చిన్న, సన్నకారు రైతులకు రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను రద్దుచేయాలని, లేదా రుణాలను వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు అనుమతించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రైతులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నందువల్ల అత్యవసరంగా ఒక రైతు కమిషన్ ఏర్పాటుచేసి, పంటల బీమా పథకాన్ని అమలుచేయాలని తెలిపింది. భారతీయ గోవంశ్ రక్షణ్ సంవర్ధన పరిషత్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్లతో కూడిన డివిజన్ బెంచి ఈ ఆదేశాలు జారీచేసింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా రైతులు వర్షాలపైనే ఆధారపడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. రైతుల కష్టాలను తీర్చేందుకు ఇంతవరకు సరైన వేదిక లేదని, వాళ్ల ప్రయోజనాలను కాపాడాటం ప్రభుత్వ బాధ్యత అని బెంచి తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసే కమిషన్ల ప్రతిపాదనలను ఆమోదించాలని, ఒకవేళ ఆమోదించకపోతే అందుకు తగిన కారణాలు కూడా చెప్పాలని కోర్టు చెప్పింది. కనీసం రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని, కాని పక్షంలో వాటి మీద వడ్డీరేటును తగ్గించి, వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి తెలిపింది. కేసు తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. పట్టణ ప్రాంతాల్లో పశువల షెడ్లను కట్టేందుకు మూడు నెలల్లోగా పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖలు ఒక్కోటి రూ. 5 కోట్ల చొప్పున కేటాయించాలని ఆయా శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. -
రైతుల కడుపు కొట్టద్దు
బెంగళూరు : చిన్న రైతులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తే పోరాటం చేయాల్సి వస్తుందని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ హెచ్చరించారు. శనివారం ఆయన ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిన్న రైతులు పోరంబోకు భూములు, అటవీ ప్రాంతానికి చెందిన భూములను అక్రమించుకుని వ్యయసాయం చేసుకుంటున్నారని అన్నారు. ఈ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాశానని దేవెగౌడ అన్నారు. చిన్న రైతుల భూములు లాక్కొని ప్రభుత్వం ముందు బడా బాబుల భూములు లాక్కుంటే అందరికి మంచి జరుగుతుందన్నారు. బెంగళూరు న గరంలో, పరిసర ప్రాంతాలలో అనేక ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని ఏ.టీ. రామస్వామి, బాలసుబ్రమణ్యం కమిటీలు ఇప్పటికే నివేదిక సమర్పించారని గుర్తు చేశారు. ఈ భూములు ఆక్రమించుకున్నవారిలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులు ఉన్నా సరే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని దేవెగౌడ చెప్పారు. సమావేశంలో జేడీఎస్ పార్టీ నాయకులు వై.వీ.ఎస్ దత్తా, నారాయణరావ్, రతన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.