ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
నేరడిగొండ : దేవుడు వరమ్మిచినా.. పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది.. అధికారుల నిర్లక్ష్యంతో మహాత్మా గాంధీ ఉపాధిహామీ ఫలాలు రైతులకు అందడం లేదు. ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వం ఈజీఎస్‌లో రైతులకు ఎన్నో రకాల వ్యవసాయ అనుబంధ పనులు చేర్చి నిధులు కేటాయిస్తోంది. కానీ సంబంధిత అధికారులు, ఉపాధి సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఈ పథకం కొందరికే పరిమితమైంది. వ్యవసాయంపైనే ఆధారపడ్డ రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఉపాధిలో వివిధ వ్యవసాయ ఆధారిత పనులు చేర్చుతూ ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో రైతుల అభివృద్ధికి ఆ పథకం ద్వారా ఒకట్రెండు పనులు మాత్రమే చేపట్టింది. కానీ ప్రస్తుతం వాటి సంఖ్యను పెంచి రైతుల అభివృద్ధికి బాసటగా నిలుస్తోంది.
రైతులకు చేరువకాని వైనం...
రాజకీయంగా ఎంతోకొంత పలుకుబడి, అధికారులతో కాస్తోకూస్తో పరిచయం ఉన్నవారికి మాత్రమే ఉపాధిహామీ పథకం ద్వారా కల్పిస్తున్న ఫలాలు అందుతున్నాయి. చదువురాని సన్న,చిన్నకారు రైతులకు మాత్రం ఏమీ దక్కడంలేదు. ఎలాగో ఒకలా ఈ పథకాల గురించి తెలుసుకొని స్థానిక ఉపాధిహామీ సిబ్బందిని అడిగితే ఆ పని ఈయేడాది కాదు, వచ్చే యేడాది చూద్దాములే అంటూ దాటవేస్తున్నారు. లేకపోతే ఈ పనికి ఇంత ఖర్చు అవుతుందని, ఆ పని అంత అవుతుందని ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి మండలస్థాయి అధికారుల వరకు లెక్కలువేసి మరీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఖర్చులు ఇవ్వలేని సన్న, చిన్నకారు రైతులకు ఉపాధి ఫలాలు అందని ద్రాక్షలా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన కరువు..
ఉపాధిహామీ పథకం ద్వారా అనేక రకాలుగా రైతులకు ప్రయోజనం కలిగే విధంగా పనులు చేపడుతున్నప్పటికీ అవగాహన కల్పించకపోవడంతో రైతులకు ప్రయోజనం కలగడం లేదు. ఆసక్తి ఉన్న కొందరు రైతులకు అధికారులు సహకారం ఇవ్వకపోయినా సొంత ఖర్చులతో పాంపండ్‌లు నిర్మించుకుంటున్నారు. అధికారులు ఉపాధిహామీ పథకం ద్వారా రైతుల సంక్షేమం కోసం చేపట్టే పనులపై విస్తతంగా ప్రచారం చేపట్టాలని గ్రామాల్లో సన్న, చిన్నకారు రైతులకు సైతం పనులు, పథకాలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment