Smartphone Camera
-
‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్
స్మార్ట్‌ఫోన్‌లోని డిజిటల్ కెమెరా.. మెమరీ ఫోమ్ పరుపులు.. కారు టైర్లు.. గీతలు పడని లెన్స్.. వాటర్ ఫిల్టర్.. ఇవన్నీ ‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్ తెలుసా? ఎందుకంటే ఇవన్నీ అంతరిక్ష ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లోంచి పుట్టినవి. మనం నిత్యం వాడే వస్తువులుగా మారిపోయాయి. మరి వీటి విశేషాలు ఏమిటో చూద్దామా.. గ్రహాంతర ప్రయోగాలు.. ఫోన్ కెమెరా.. ►శాటిలైట్లలో బిగించేందుకు.. నాసాకు చెంది న జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) ఇంజనీర్ యూజీన్ లల్లీ మొదటిసారిగా 1960 దశకంలో డిజిటల్ కెమెరాలను రూపొందించారు. అవి పెద్ద పరిమాణంలో ఉండి, ఎక్కువ విద్యుత్ అవసరం పడేవి. దీంతో తక్కువ సైజులో ఉండే డిజిటల్ కెమెరాలపై పరిశోధన చేసిన జేపీఎల్ ఇంజనీర్ ఎరిక్ ఫోసమ్.. 1990 దశకం మొదట్లో ‘సీఎంఓఎస్– యాక్టివ్ పిక్సెల్ సెన్సర్ (ఏపీఎస్)’ ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఫోన్ కెమెరాలు, వెబ్‌క్యామ్‌లు వంటి మినియేచర్ కెమెరాల్లో వాడుతున్న టెక్నాలజీ ఇదే. అంతరిక్షంలోకి పంపకున్నా.. ఇళ్లలోకి వాటర్ ఫిల్టర్.. ►నాసా చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. వాళ్లకు మంచి నీళ్లు ఎలాగనే పరిశోధనలూ చేసింది. వాడిన నీటిని తిరిగి శుద్ధిచేసుకుని వినియోగించుకునేలా ‘ఎలక్ట్రోలైటిక్ సిల్వర్ అయాన్ జనరేటర్’ను అభివృద్ధి చేసింది. ఈ వాటర్ ఫిల్టర్‌ను అంతరిక్ష ప్రయోగాల్లో వాడలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇళ్లలోకి వచ్చేసింది. అయితే దీనికన్నా మెరుగైన, ఖరీదైన టెక్నాలజీని ‘అపోలో’ ప్రయోగాల్లో వాడారు. స్పేస్ షటిల్లో సీట్లు.. మెమరీ ఫోమ్ పరుపులు ►స్పేస్ షటిల్స్ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చేప్పుడు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. వాటిలో ఉండే వ్యోమగాము లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలా ఒత్తిడిని తట్టుకోవడంతో పాటు మృదువుగా, సౌకర్యవంతంగా ఉండేందుకు నాసా 1960వ దశకంలో ‘పాలీయూరేథీన్ సిలికాన్ ప్లాస్టిక్ (మెమరీ ఫోమ్)’ మెటీరియల్‌ను అభివృద్ధి చేసింది. స్పేస్ షటిల్ సీట్లలో అమర్చింది. అవే ఇప్పుడు మనం వాడుతున్న మెమరీ ఫోమ్ పరుపులు, దిండ్లు. అనుకోకుండా కనిపెట్టిన.. స్క్రాచ్ రెసిస్టెంట్ లెన్స్.. ►వ్యోమగాములు హెల్మెట్ కోసం గాజును వాడితే ప్రమాదకరం కావడంతో నాసా ఫైబర్ గ్లాస్‌ను వినియోగించింది. కానీ దానిపై సులువుగా గీతలు పడి ఇబ్బంది వస్తుండటంతో పరిష్కారంపై ప్రయోగాలు మొదలుపెట్టింది. అయితే చిత్రంగా టెడ్ వైడెవెన్ అనే శాస్త్రవేత్త వాటర్ ఫిల్టర్ కోసం చేస్తున్న ప్రయోగాల సందర్భంగా.. స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు కళ్లద్దాల నుంచి టీవీలు, మానిటర్లు, ఫోన్ స్క్రీన్ల దాకా ఈ కోటింగ్‌ను వాడుతున్నారు. మార్స్‌పై దిగే ప్యారాచూట్ తాళ్లు.. కారు టైర్లు.. ►1976లో నాసా ప్రయోగించిన ‘వైకింగ్ ల్యాండర్’ అంగారకుడిపై సురక్షితంగా దిగేందుకు ప్యారాచూట్లను వినియోగించారు. అసలే మార్స్‌పై తేలికైన వాతావర ణం, ఎక్కువ బరువున్న ప్రోబ్.. ప్యారా చూట్ తాళ్లు అత్యంత బలంగా ఉండాలి. దీనిపై నాసా విజ్ఞప్తి మేరకు.. ‘గుడ్ ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ’ ఉక్కుకన్నా బలమైన రబ్బర్ మెటీరియల్‌ను రూపొందించింది. తర్వాత దీనిని వాహనాల టైర్ల తయారీలో వాడటం మొదలుపెట్టారు. ఇంకా ఎన్నో.. ►స్పేస్ ఫ్లైట్లలో, విమానాల్లో వాడేందుకు నాసా తోపాటు యునైటెడ్ ఎయిర్ లైన్స్ శాస్త్రవేత్తలు కలిసి వైర్ లెస్ హెడ్‌సెట్‌ను అభివృద్ధి చేశారు. ►నాసా స్పేస్‌లో ఆల్గే (నాచు)ను ఉపయోగించి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలు చేస్తుండగా.. పిల్లలకు పాలకు బదులుగా ఇచ్చే ‘బేబీ ఫార్ములా’ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ►స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త డోగ్ ఎంగెల్బర్ట్.. నాసా చేసిన ఆర్థిక సాయం, సూచనలతోనే కంప్యూటర్ ‘మౌస్’ను తయారు చేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
గణేశ్ నిమజ్జనం: ఈ ఫొటో చూసి వావ్ అనాల్సిందే!
అకేషన్ ఏదైనా ఫొటో ఉండాల్సిందే. ఫోన్ చేతిలో ఉంటే ‘బొమ్మ’పడాల్సిందే. స్మార్ట్ఫోన్లు విరివిరిగా అందుబాటులోకి వచ్చాక ఫొటోలు తీయడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యాన్ని ఫోన్ కెమెరాలో బంధించేందుకు ఆరాటపడుతున్నారు జనం. ఇలాంటి దృశ్యమే హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ఆవిష్కృతమైంది. భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని భాగ్యనగర వాసులు పులకితులయ్యారు. అంతేకాదు శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిని తమ ఫోన్ కెమెరాలతో ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. ఆ సందర్భంగా తీసిన ఈ ఫోటోను హాయ్ హైదరాబాద్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. Photo Courtesy: Hi Hyderabad Twitter Page గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా చార్మినార్ సమీపంలో తీసిన మరో ఫొటో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. శివుడి బాహువుపై ఆశీసుడైన గణనాథుడి ప్రతిమ వెనుక భాగంలో చార్మినార్ కనిపించే విధంగా తీసిన ఈ ఫోటో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Photo Courtesy: Hi Hyderabad Twitter Page -
ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్
సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ 'గెలాక్సీ వైడ్5' ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ సౌత్ కొరియాలో అందుబాటులో ఉండగా త్వరలో మిగిలిన దేశాల్లో విడుదల కానున్నట్లు శాంసంగ్ ప్రతినిధులు వెల్లడించారు. ఫోన్ స్పెసిఫికేషన్స్.. 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ ప్లే,ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్,ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. వీటితో పాటు వాటర్ డ్రాప్ తరహా డిస్ ప్లే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువ నుంది. శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ధర ప్రస్తుతానికి శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో విడుదలైన ఈ ఫోన్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.28,200గా ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. చదవండి: ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరికలు ! అందులో నిజమెంత? -
కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ల సందడి
ముంబై, సాక్షి: కమ్యూనికేషన్ కోసం ప్రారంభమైన స్మార్ట్ ఫోన్లు తదుపరి కాలంలో ఎన్నెన్నో కొంత ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయి. సరికొత్త ఫీచర్స్‌తో యూజర్ల జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. ఇటీవల కాలంలో ప్రధానంగా కెమెరాల విషయంలో అత్యంత ఆధునికతను సంతరించుకోవడం ద్వారా డిజిటల్ కెమెరాల విక్రయాలకే గండి కొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రూ. 15,000లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లు సైతం ఆధునిక కెమెరాలు, ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. మెగా పిక్సెల్స్ గతంలో రెండు కెమెరాలతో వచ్చిన స్మార్ట్ ఫోన్లు లగ్జరీ విభాగంలో వెలువడేవి. ప్రస్తుతం ప్రస్తుతం 3-4 కెమెరాలు కలిగిన ఫోన్లు సాధారణమైపోయాయి. గత కొన్నేళ్లలో కెమెరాకు ప్రాధాన్యత భారీగా పెరిగింది. దీంతో ఫోన్లకు వెనుకవైపు కనీసం 3 కెమెరాలుంటేనే ప్రస్తుతం నియోగదారులను ఆకట్టుకోగలుగుతున్నాయి. కొద్ది రోజులుగా నైట్ మోడ్స్ వంటివి సాధారణ అంశాలైపోయినట్లు టెక్ నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో క్వాడ్‌కామ్ మాడ్యూల్స్ సైతం అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. లెన్స్‌ల సంఖ్య, మెగాపిక్సెల్స్ సామర్థ్యం, కెమెరా సాంకేతికత వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. (ఇకపై రియల్మీ 5జీ స్మార్ట్ ఫోన్లు) 8కే వీడియోలు గతేడాది(2020)లో 4కే వీడియో చిత్రీకరణకు ఆకర్షణ పెరిగింది. దీంతో ఈ ఏడాది(2021) స్మార్ట్ ఫోన్ కంపెనీలు 8కే వీడియోలపై దృష్టిసారించినట్లు టెక్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. గతేడాది చివర్లోనే ఇందుకు బీజం పడినప్పటికీ ఇవి ఏడాది, రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా 8కే వీడియోలను సపోర్ట్ చేయగల స్ర్కీన్లను సైతం అమర్చవలసి ఉన్నట్లు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లేదా టీవీ సెట్లలో వీటిని ప్లే చేసేందుకు వీలైన తెరలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని వివరించారు. వెరసి 2022కల్లా 8కే వీడియో చిత్రీకరణ చేయగల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ) గింబల్ సపోర్ట్ కొన్నేళ్లుగా డిజిటల్ కెమెరాల స్థానంలో స్మార్ట్ ఫోన్ కెమెరాల వినియోగం అధికమైంది. అన్నివేళలా ఫోన్లు అందుబాటులో ఉండటంతోపాటు.. చిత్రీకరణ అత్యంత సులభంకావడంతో వినియోగదారులు కెమెరా ఫీచర్స్పై దృష్టి సారించడం ఎక్కువైంది. దీంతో ఇటీవలి కాలంవరకూ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను స్మార్ట్ ఫోన్ కంపెనీలు సాధారణ ఫీచర్‌గా జత చేస్తూ వచ్చాయి. అయితే సెల్ఫీ ట్రెండ్ ప్రవేశించాక కెమెరాలు, వీటి ఫీచర్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో కంటెంట్లకు డిమాండ్ పెరగడంతో వీడియో సాంకేతికతకూ ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫొటోలు లేదా వీడియోల స్టెబిలైజేషన్పై దృష్టితో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్తగా గింబల్ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. వివో కంపెనీ ఎక్స్50 ప్రోలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సెన్సర్లకూ ప్రాధాన్యం నిజానికి స్మార్ట్ ఫోన్లలో అత్యధిక మెగా పిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, సెన్సర్లకే ప్రాధాన్యం ఉన్నట్లు టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు 4కే వీడియోలను చిత్రీకరించాలంటే కనీసం 8 మెగాపిక్సెల్ కెమెరాలు తప్పనిసరని వెల్లడించారు. వెరసి వీడియోల నాణ్యతకు వీలుగా భారీ సెన్సర్లను వినియోగించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇక 8కే వీడియోలను చిత్రీకరించాలంటే 33 మెగాపిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని చెబుతున్నారు. కొంతకాలంగా యాపిల్, గూగుల్ తదితర దిగ్గజాలు 12 ఎంపీ కెమెరాలకే కట్టుబడుతూ వస్తున్నాయి. వీటికి జతగా ఇటీవల మరో 12 ఎంపీ కెమెరాలకు సైతం తెరతీశాయి. ఈ కంపెనీలతోపాటు నాణ్యమైన సెన్సర్లను వినియోగించడం ద్వారా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం కెమెరా ఫీచర్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. డిస్ప్లేలో కెమెరా సెల్ఫీ ట్రెండ్‌కు వీలుగా పలు కంపెనీలు డిస్ప్లేలో అంతర్భాగంగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ముందు భాగంలో పాపప్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగానే నాచ్ స్టైల్ సెల్ఫీకెమెరాలు, పంచ్ హోల్ కెమెరాల ట్రెండ్‌కు తెరలేచింది. గతేడాది ఇన్‌డిస్‌ప్లే కెమెరాలకూ ఒప్పో, షియోమీ శ్రీకారం చుట్టాయి. ఇవి కొనసాగేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మూడు విభిన్న కెమెరాల ద్వారా చిత్రీకరించే ఫొటోలు లేదా వీడియోలకు చిప్ సెట్ సైతం సపోర్ట్ చేయవలసి ఉంటుందని, ఈ బాటలోనే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్వోసీకి కొత్త ఏడాదిలో స్మార్ట్ ఫోన్ కెమెరాలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
సెల్ఫీ దిగడం మానేయండి! పేలకు చెక్ పెట్టండి!
సాక్షి, న్యూఢిల్లీ: పేలు.. వీటితో బాధపడినవారు కనీసం ఇంటికొక్కరైనా ఉంటారు. ఆడపిల్లలకైతే ఈ బాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇప్పటికీ మీరు పేల సమస్యతో బాధపడుతుంటే ఓసారి మీ అలవాట్లను చెక్ చేసుకోండి..! బహుశా మీకు సెల్ఫీ దిగే అలవాటు ఎక్కువగా ఉందేమో చూసుకోండి. ఎందుకంటే తలలో పేలు పెరగడానికి సెల్ఫీ దిగడానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ‘సెల్ఫీలంటే ఈ మధ్య పుట్టుకొచ్చిన పిచ్చి. కానీ పేలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా?’ అనే అడగాలనుకుంటున్నారు కదూ? నిజమే.. అయితే తలలో పేలు పెరగడానికి ఎన్నో కారణాలున్నా.. సెల్ఫీ కూడా ఓ కారణమని చెబుతున్నారు. సెల్ఫీలు దిగే అలవాటు ఉన్నవారు స్నేహితులతో కలసి తలలు ఆనించుకుంటూ దిగుతారు. ఇటువంటప్పుడు ఒకరి తలలోని పేలు మరొకరి తలలోకి సులభంగా చేరిపోతాయట. అంతేకాదు.. చెవిదగ్గర పెట్టుకునే స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా పేలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పుడు లాజిక్ సరిపోయిందా! -
మీ స్మార్ట్ ఫోన్ కెమెరానే ఇక సెర్చ్ ఇంజిన్
-
మీ స్మార్ట్ ఫోన్ కెమెరానే ఇక సెర్చ్ ఇంజిన్
టెక్ దిగ్గజం గూగుల్ డెవలపర్ల వార్షిక ఐ/ఓ కాన్ఫరెన్స్... ఈ కాన్ఫరెన్స్ అంటేనే టెక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఎలాంటి కొత్తకొత్త ప్రొడక్ట్ లు గూగుల్ మార్కెట్లోకి తీసుకొస్తుంది అని ఆసక్తి చూపుతుంటారు. మౌంటెన్ వ్యూలో నిన్ననే అంటే మే 17వ తేదీన గూగుల్ తన ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించింది. టెక్ అభిమానుల ఆసక్తి మేరకు గూగుల్ నిజంగానే సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ ఇలాంటి కొన్ని కీలకమైన వాటిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ డెవలపర్ల సమావేశంలో ప్రకటించారు. వీటన్నంటిల్లో టెక్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నది గూగుల్ లెన్స్. దీన్ని టెక్నాలజీలో మరో విప్లవంగా అభివర్ణించిన సుందర్ పిచాయ్, అసలు గూగుల్ లెన్స్ యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఇన్ని రోజులు మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు దేనినైనా చూస్తే, దాని గురించి తెలుసుకోవాలంటే, ఆ పేరును టైప్ చేసి సెర్చ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే ఉండదు. మీకు సమాచారం కావాల్సిన వస్తువును ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు. దాన్ని గురించి పూర్తి సమాచారం మన ముందుంటుంది. దీనికల్లా మనం చేయాల్సింది మన స్మార్ట్ ఫోన్లో గూగుల్ లెన్స్ డౌన్ లోడ్ చేసుకోవడమే. ఉదాహరణకు మనకో ఫ్లవర్ కనిపించింది అనుకుంటే. ఆ ఫ్లవర్ ఏంటి? దాని వివరాలు కావాలంటే? ఆ పువ్వును లెన్స్ లో ఫోటో తీస్తే చాలు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలాగే మనకు తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోవచ్చు. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నాలన్నా, ఆర్డర్ చేయాలన్నా జంకుతాం. దీనికోసం జస్ట్ మీముందున్న డిష్ ను ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు దాని గురించి వివిధ రకాల సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఇమేజ్ సెర్చ్ తోనే అన్నింటి వివరాలను యూజర్లు తెలుసుకునేలా గూగుల్ ఈ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. అయితే మనం స్కాన్ చేసే వస్తువు వివరాలు గూగుల్ లో ఉంటేనే, దాన్ని సమాచారం మనం పొందుతామట. గూగుల్ లెన్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ వినూత్న ఫీచర్ త్వరలోనే స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.