మీ స్మార్ట్ ఫోన్ కెమెరానే ఇక సెర్చ్ ఇంజిన్
మీ స్మార్ట్ ఫోన్ కెమెరానే ఇక సెర్చ్ ఇంజిన్
Published Fri, May 19 2017 8:57 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM
టెక్ దిగ్గజం గూగుల్ డెవలపర్ల వార్షిక ఐ/ఓ కాన్ఫరెన్స్... ఈ కాన్ఫరెన్స్ అంటేనే టెక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఎలాంటి కొత్తకొత్త ప్రొడక్ట్ లు గూగుల్ మార్కెట్లోకి తీసుకొస్తుంది అని ఆసక్తి చూపుతుంటారు. మౌంటెన్ వ్యూలో నిన్ననే అంటే మే 17వ తేదీన గూగుల్ తన ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించింది. టెక్ అభిమానుల ఆసక్తి మేరకు గూగుల్ నిజంగానే సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ ఇలాంటి కొన్ని కీలకమైన వాటిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ డెవలపర్ల సమావేశంలో ప్రకటించారు. వీటన్నంటిల్లో టెక్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నది గూగుల్ లెన్స్. దీన్ని టెక్నాలజీలో మరో విప్లవంగా అభివర్ణించిన సుందర్ పిచాయ్, అసలు గూగుల్ లెన్స్ యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
ఇన్ని రోజులు మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు దేనినైనా చూస్తే, దాని గురించి తెలుసుకోవాలంటే, ఆ పేరును టైప్ చేసి సెర్చ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే ఉండదు. మీకు సమాచారం కావాల్సిన వస్తువును ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు. దాన్ని గురించి పూర్తి సమాచారం మన ముందుంటుంది. దీనికల్లా మనం చేయాల్సింది మన స్మార్ట్ ఫోన్లో గూగుల్ లెన్స్ డౌన్ లోడ్ చేసుకోవడమే. ఉదాహరణకు మనకో ఫ్లవర్ కనిపించింది అనుకుంటే. ఆ ఫ్లవర్ ఏంటి? దాని వివరాలు కావాలంటే? ఆ పువ్వును లెన్స్ లో ఫోటో తీస్తే చాలు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.
అలాగే మనకు తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోవచ్చు. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నాలన్నా, ఆర్డర్ చేయాలన్నా జంకుతాం. దీనికోసం జస్ట్ మీముందున్న డిష్ ను ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు దాని గురించి వివిధ రకాల సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఇమేజ్ సెర్చ్ తోనే అన్నింటి వివరాలను యూజర్లు తెలుసుకునేలా గూగుల్ ఈ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. అయితే మనం స్కాన్ చేసే వస్తువు వివరాలు గూగుల్ లో ఉంటేనే, దాన్ని సమాచారం మనం పొందుతామట. గూగుల్ లెన్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ వినూత్న ఫీచర్ త్వరలోనే స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.
Advertisement