sonu
-
'బిగ్ బాస్' నటికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. జైలుకు తరలింపు
కన్నడ నటి, బిగ్ బాస్ బ్యూటీ సోను శ్రీనివాస్ గౌడకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ఆమె నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. సోనూ గౌడకు ఏప్రిల్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీజేఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 8 ఏళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోనూ గౌడను బాదరహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. నటి ఏం చెప్పింది..? జువైనల్ జస్టిస్ యాక్ట్, హిందూ దత్తత చట్టాన్ని ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు మీడియాతో స్పందించిన సోను శ్రీనివాస్ గౌడ.. ఈ కేసులో చట్టపరమైన విచారణ జరుగుతోందని తెలిపింది. నేను ఒక అమ్మాయిని తీసుకువచ్చాను ఎందుకంటే ఆమెకు ప్రస్తుతం రక్షణ అవసరం, ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే నేను తెచ్చుకున్నాను. నేనే ఆమెను సురక్షితంగానే చూసుకున్నాను. ఏం జరిగింది..? గత మార్చి 2న సోను గౌడ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో, ఆమె ఒక బాలికను తీసుకుని వచ్చింది. అది కూడా తన తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది. రాయచూర్‌కు చెందిన బాలికను దత్తత తీసుకుంటున్నట్లు అందులో సోనూ పేర్కొంది. కానీ హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తికి, దత్తత తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 ఏళ్ల గ్యాప్ ఉండాలి. ఆపై దత్తత తీసుకున్న వ్యక్తి తన అర్హత గురించి కేంద్ర, రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేసిన అనంతరం వారి సమక్షంలోనే దత్తతను అంగీకరించాలి. అలాగే, సోనూ గౌడ ఆ బాలిక తల్లిదండ్రులకు వివిధ సౌకర్యాలను కల్పించినట్లు పేర్కొంది. దీంతో ఇది అమ్మకాల ప్రక్రియగా కనిపిస్తుంది. అంతేకాకుండా పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. ప్రస్తుతం ఆమెది స్కూల్‌కు వెళ్లి చదువుకోవాల్సిన వయసు.. కానీ ఆ బాలిక విషయంలో ఇది జరగలేదు. పలువురు ఫిర్యాదు చేయడంతో సోనూ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చిన్నారిని తమ కస్టడీలోకి తీసుకుని ప్రభుత్వ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. -
Sonu Srinivas Gowda Photos: పాపను దత్తత తీసుకుంది.. జైలుపాలైంది (ఫోటోలు)
-
8 ఏళ్ల బాలికతో వీడియోలు.. బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్
కన్నడ బిగ్‌బాస్ సీజన్ -1 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనూ శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో ఆమె అరెస్ట్ కావడం జరిగింది. సదరు బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని బైదరహళ్లిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారిని సోనూ శ్రీనివాస్ గౌడ దత్తత తీసుకున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. వెస్ట్ డివిజన్ డిసిపి ఎస్ గిరీష్ వివరిస్తూ.. 'ప్రభుత్వ నింబంధనలు పాటించకుండా ఒక బాలికను సోనూ దత్తత తీసుకున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక అధికారి ఫిర్యాదు చేశారు. రాయచూర్‌కి చెందిన ఆ బాలిక వయసు 8 ఏళ్లు కాగా ఆ చిన్నారితో సోషల్ మీడియాలో రీల్స్‌తో పాటు.. యూట్యూబ్ కోసం పలు వీడియోలను సోనూ క్రియేట్ చేసింది. దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ చిన్నారిని పోషిస్తానని ఆమె చెప్పింది. విచారణలో దత్తతకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో మేము అరెస్టు చేశాము.' అని ఆయన తెలిపారు. బిగ్‌బాస్ ఫేమ్ సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించానని చెప్పింది. సుమారు 45 రోజుల క్రితం ఆ చిన్నారిని ఆమె తీసుకొచ్చింది. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ బాలికను తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకొని వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వివరాలను పోలీసుల వద్ద ఆమె పంచుకుంది. అయితే, దత్తత ప్రక్రియలో పారదర్శకతతో పాటు సరైన పత్రాలు ఆమె వద్ద లేవని అధికారులు తెలిపారు. రాయచూర్‌కు చెందిన ఆ బాలికను దత్తత తీసుకుంటున్నట్లు మార్చి 2న సోనూ ఒక వీడియో ద్వారా ప్రకటించింది. అయితే, హిందూ దత్తత చట్టం ప్రకారం, దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ వివరాలు పారదర్శకతతో కూడి ఉండాలి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారి.. ఇంటి వద్దే ఉంచడం నేరం. ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం నేరం. ఇలాంటి విషయాలే సోనూను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారిని ప్రభుత్వ అనాథ శరణాలయానికి తరలించగా.. పోలీసులు సోనూను విచారిస్తున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హజరు పరచనున్నారు. సోనూ మీద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. -
విషాదం మిగిల్చిన సెల్ఫీ సరదా
ఎదులాపురం (ఆదిలాబాద్): సెల్ఫీ మోజు రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. బోటింగ్ సమయంలో సెల్ఫీకి ప్రయత్నించి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన సోను, సోఫీల్, ఉమేర్, ఇర్ఫాన్, మన్సూర్‌లు మోటార్ సైకిళ్లపై బుధవారం మొహర్రం వేడుకలను చూడటానికి చంద్రపూర్ జిల్లా రాజురాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మహారాష్ట్రలోని పెన్‌గంగ ముకుడ్‌బంద్ ప్రాంతంలో గురువారం బోటింగ్ నిమిత్తం ఆగారు. బోటింగ్ చేస్తున్న తరుణంలో మధ్యలోకి వెళ్లిన వారు సెల్ఫీ దిగేందుకు యత్నించారు. ఈ తరుణంలో ఒకే వైపు భారం పడటంతో బోటు బోల్తా పడింది. గమనించిన స్థానికులు రక్షణ చర్యలు చేపట్టారు. అప్పటికే గల్లంతైన సోను(22), సోఫిల్(23) నీటమునిగి మృతిచెందారు. ఉమేర్, ఇర్ఫాన్‌లు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
సుష్మా చొరవతో ఢిల్లీ చేరుకున్న సోను
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం ఢిల్లీలో తప్పిపోయి బంగ్లాదేశ్ చేరుకున్న బాలున్ని విదేంశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఇండియాకు రప్పించారు. గీతా గురుప్రీత్ అలియాస్ సోనును బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి తీసుకురావడంలో సుష్మా ముఖ్యమైన పాత్ర పోషించారని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ లోని జెస్సోర్ లో ఉన్న సోను తాను 2010 లో ఢిల్లీలో తప్పిపోయానని అక్కడి అధికారులకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ లోని ఇండియన్ హైకమిషన్ లో పనిచేస్తున్న సీనియర్ అధికారిని జెస్సోర్ చేరుకొని బాలున్ని ఢిల్లీకి పంపించాలని ఆదేశించారు. దీంతో బంగ్లాదేశ్ నుంచి గురువారం సోను ఢిల్లీకి చేరుకున్నాడు. ఇటీవల గతంలో సౌదీ అరేబియాలో తన తండ్రిని అరెస్టు చేశారని సహాయం చేయాలని ఓ పదిహేనేళ్ల అమ్మాయి పలుమార్లు ట్విట్టర్ ద్వారా చేసిన అభ్యర్థనకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించి సాయం చేసిన విషయం తెలిసిందే. -
ఇదొక బంగ్లాదేశీ భాయ్‌జాన్ కథ
న్యూఢిల్లీ: ఈ ఈద్ పండుగ ఓ ముస్లిం కుటుంబంలో మరింత సంతోషాన్ని తెస్తోంది. ఏడేళ్ల కిందట తప్పిపోయిన సోనూ అనే తమ కుమారుడు కళ్లముందుకొస్తుండటంతో ఆ ఇంట్లో పండుగవాతావరణం రెట్టింపయింది. ఇది కూడా ఓ రకంగా భజరంగీ భాయ్ జాన్లాంటి ఛాయలున్న కథే. కాకపోతే ఈసారి భాయ్‌జాన్ మాత్రం బంగ్లాదేశీయుడు. బాబు మాత్రం తప్పిపోవడం కాకుండా తప్పించబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని న్యూ సెమాపురి అనే ప్రాంతంలో మహబూబ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి ఓ రెండుగదుల నివాసం ఉంది. మెకానిక్ గా పనిచేస్తున్న అతడి ఇంట్లోకి అద్దెకు వచ్చిన ఓ మహిళ ధీన పరిస్థితి చూసి ఆమెకు అద్దె లేకుండానే ఓ గది ఇచ్చాడు. తొలుత చిన్నాచితక పనిచేసుకుంటూ ఉంటున్న ఆమె 2009 ఆగస్టు నెలలో మహబూబ్ ఆరేళ్ల కుమారుడు సోనూను ఎత్తుకొని పారిపోయింది. ఆమె కోసం ఎంతగాలించినా ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. చాలా కాలంపాటు కేసును విచారించిన పోలీసులు ఇక చేసేది లేక కేసు మూసి వేశారు. తమ పిల్లాడు చనిపోయాడనుకొని బాధపడుతూ మహబూబ్ కుటుంబ సభ్యులు తమను తాము తమాయించుకున్నారు. ఆనందం నింపిన ఒక్క ఫోన్ కాల్.. ఇలా ఉండగా, ఒక రోజు బంగ్లాదేశ్ నుంచి జమాల్ ముసా అనే వ్యక్తి మహబూబాకు ఫోన్ చేశాడు. మీ అబ్బాయి నా వద్దే భద్రంగా ఉన్నాడంటూ ఈ మధ్య ఫోన్ చేశాడు. దీంతో మహబూబ్ కుటుంబంలో ఆనందం వెల్లి విరిసింది. ఇంతకీ జమాల్ ఎవరంటే అతనో మెకానిక్. ఒక రోజు తీవ్రంగా ఓ మహిళ చేతిలో హింసకు గురవుతున్న బాలుడిని చూశాడు. అతడికి జాలేసి దగ్గరకు వెళ్లి కాసేపు మాట్లాడగా.. అసలు విషయం ఆ బాలుడు చెప్పాడు. తాను ఢిల్లీకి చెందిన వాడినని, తనను ఆ మహిళ ఎత్తుకొచ్చిందని చెప్పాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ముసా ఎలాగైనా ఆ బాలుడిని వారి కుటుంబం దరిచేర్చాలనుకున్నాడు. అధికారులను, మీడియాను సంప్రదించి ఒకసారి మహబూబా కుటుంబంతో కలిశాడు. కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. బాలుడి డీఎన్ఏ తన తల్లి డీఎన్ఏతో సరిపోలడంతో ఇక ఆ బాలుడిని తీసుకొచ్చేందుకు రంగం సిద్దమైంది. ఈ రోజు(గురువారం) ఆ బాలుడు తన కుటుంబాన్ని ఏడేళ్ల తర్వాత కలుసుకోనున్నాడు. అలా మహబూబా కుటుంబంలో ముసా సంతోషాన్ని నింపాడు. -
'బెయిల్ ఇవ్వడం కుదరదు.. 30 వరకు కస్టడీలోనే'
కోల్ కతా: ఫుల్లుగా తాగి నిర్లక్ష్యంగా కారు నడిపి యువ మిలటరీ అధికారిని ఢీకొట్టిన కేసులో నిందితులకు బెయిలిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వారిని ఈ నెల(జనవరి) 30 వరకు పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఈ నెల 13న రెడ్ రోడ్డు ఏరియాలో వైమానిక దళ సైనికులు రిహార్సల్స్ చేస్తుండగా సాంబియా సోహ్రాబ్, సోనూ అలియాస్ షానవాజ్ ఖాన్ వేగంగా ఆడి కారులో వెళుతూ అభిమన్యు గౌడ్ అనే సైనికుడిని ఢీకొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో కోల్ కతా పోలీసులు ఢిల్లీ పోలీసుల సహాయంతో వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులు బెయిల్ పిటిషన్ పెట్టుకోగా కోర్టు బెయిలిచ్చేందుకు నిరాకరించింది. వీరిలో సాంబియా ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ సోహ్రాబ్ కుమారుడు. వీరిపై హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను మాయం చేయాలని ప్రయత్నించడం, హానీ కలిగించడంవంటి ఆరోపణల పేరిట కేసులు నమోదు చేశారు. -
ఛోటూకు కారుణ్య మరణం
-
రాఖీ పండుగ రోజు అమానుషం
కాన్పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూపమైన రాఖీ పండుగ రోజు అమానుషం చోటు చేసుకుంది. జీతం డబ్బులు అడిగిన పాపానికి యజమాని అఘాయిత్యానికి బలయ్యాడో ఓ బాల కార్మికుడు. తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వమన్నందుకు వేడి వేడి నీళ్లతో క్రూరంగా సమాధానం చెప్పాడా యజమాని. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే.. షీలూ సింగ్ చందేల్ నడిపే చాట్ బండిలో సోను(13) బోయ్‌గా పని చేస్తున్నాడు. రాఖీ పండుగ అంటే సోనూకి చాలా ఇష్టం. అందులోనూ అనురాగాల అక్కకి చిరు కానుక ఇవ్వడం ఇంకా ఇష్టం. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు వెళ్లేందుకు జీతంతో పాటు, సెలవివ్వమని యజమానిని గత వారంరోజులుగా అడుగుతూనే వున్నాడు. అయినా యజమాని స్పందించలేదు. కనీసం తనకు రావాల్సిన జీతం యిస్తే అక్కకు బహుమతి పంపిస్తానని సోను బుధవారం కొంచెం గట్టిగానే అడిగాడు. అంతే..యజమాని ఆగ్రహంతో రెచ్చిపోయాడు. మరిగే మరిగే నీళ్లు సోనూ పై పోశాడు. దీంతో వీపుపైనా, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాఖీ పండుగకు ఇంటికి వెళ్తానంటే ఒప్పుకోలేదని సోనూ వాపోయాడు. ఇంటికి వెళ్లకపోయినా...కనీసం సోదరికి బహుమతి పంపించేందుకు డబ్బులు అడిగినా కనికరించలేదనీ, బూతులు తిడుతూ, మరిగే నీళ్లు తన మీద కుమ్మరించాడంటూ తెలిపాడు. ఈ సంఘటనపై సోను కుటుంబ సభ్యులు స్థానిక బర్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులవరకూ తమకు విషయం తెలియలేదని కనీసం తన తమ్ముడి వైద్యం గురించి కూడా యజమాని పట్టించుకోలేదని సోనూ సోదరుడు చింటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని బర్రా పోలీసు అధికారి అజయ్ రాజ్ వర్మ తెలిపారు.