కన్నడ బిగ్‌బాస్ సీజన్ -1 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనూ శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో ఆమె అరెస్ట్ కావడం జరిగింది. సదరు బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని బైదరహళ్లిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారిని సోనూ శ్రీనివాస్ గౌడ దత్తత తీసుకున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
వెస్ట్ డివిజన్ డిసిపి ఎస్ గిరీష్ వివరిస్తూ.. 'ప్రభుత్వ నింబంధనలు పాటించకుండా ఒక బాలికను సోనూ దత్తత తీసుకున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక అధికారి ఫిర్యాదు చేశారు. రాయచూర్‌కి చెందిన ఆ బాలిక వయసు 8 ఏళ్లు కాగా ఆ చిన్నారితో సోషల్ మీడియాలో రీల్స్‌తో పాటు.. యూట్యూబ్ కోసం పలు వీడియోలను సోనూ క్రియేట్ చేసింది. దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ చిన్నారిని పోషిస్తానని ఆమె చెప్పింది. విచారణలో దత్తతకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో మేము అరెస్టు చేశాము.' అని ఆయన తెలిపారు.
బిగ్‌బాస్ ఫేమ్ సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించానని చెప్పింది. సుమారు 45 రోజుల క్రితం ఆ చిన్నారిని ఆమె తీసుకొచ్చింది. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ బాలికను తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకొని వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఆ వివరాలను పోలీసుల వద్ద ఆమె పంచుకుంది. అయితే, దత్తత ప్రక్రియలో పారదర్శకతతో పాటు సరైన పత్రాలు ఆమె వద్ద లేవని అధికారులు తెలిపారు.
రాయచూర్‌కు చెందిన ఆ బాలికను దత్తత తీసుకుంటున్నట్లు మార్చి 2న సోనూ ఒక వీడియో ద్వారా ప్రకటించింది. అయితే, హిందూ దత్తత చట్టం ప్రకారం, దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ వివరాలు పారదర్శకతతో కూడి ఉండాలి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారి.. ఇంటి వద్దే ఉంచడం నేరం. ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం నేరం. ఇలాంటి విషయాలే సోనూను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారిని ప్రభుత్వ అనాథ శరణాలయానికి తరలించగా.. పోలీసులు సోనూను విచారిస్తున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హజరు పరచనున్నారు. సోనూ మీద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment