
రాఖీ పండుగ రోజు అమానుషం
కాన్పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూపమైన రాఖీ పండుగ రోజు అమానుషం చోటు చేసుకుంది. జీతం డబ్బులు అడిగిన పాపానికి యజమాని అఘాయిత్యానికి బలయ్యాడో ఓ బాల కార్మికుడు. తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వమన్నందుకు వేడి వేడి నీళ్లతో క్రూరంగా సమాధానం చెప్పాడా యజమాని. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే.. షీలూ సింగ్ చందేల్ నడిపే చాట్ బండిలో సోను(13) బోయ్గా పని చేస్తున్నాడు.
రాఖీ పండుగ అంటే సోనూకి చాలా ఇష్టం. అందులోనూ అనురాగాల అక్కకి చిరు కానుక ఇవ్వడం ఇంకా ఇష్టం. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు వెళ్లేందుకు జీతంతో పాటు, సెలవివ్వమని యజమానిని గత వారంరోజులుగా అడుగుతూనే వున్నాడు. అయినా యజమాని స్పందించలేదు. కనీసం తనకు రావాల్సిన జీతం యిస్తే అక్కకు బహుమతి పంపిస్తానని సోను బుధవారం కొంచెం గట్టిగానే అడిగాడు. అంతే..యజమాని ఆగ్రహంతో రెచ్చిపోయాడు. మరిగే మరిగే నీళ్లు సోనూ పై పోశాడు. దీంతో వీపుపైనా, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాఖీ పండుగకు ఇంటికి వెళ్తానంటే ఒప్పుకోలేదని సోనూ వాపోయాడు. ఇంటికి వెళ్లకపోయినా...కనీసం సోదరికి బహుమతి పంపించేందుకు డబ్బులు అడిగినా కనికరించలేదనీ, బూతులు తిడుతూ, మరిగే నీళ్లు తన మీద కుమ్మరించాడంటూ తెలిపాడు. ఈ సంఘటనపై సోను కుటుంబ సభ్యులు స్థానిక బర్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులవరకూ తమకు విషయం తెలియలేదని కనీసం తన తమ్ముడి వైద్యం గురించి కూడా యజమాని పట్టించుకోలేదని సోనూ సోదరుడు చింటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని బర్రా పోలీసు అధికారి అజయ్ రాజ్ వర్మ తెలిపారు.