ఖరీదైన ఇళ్లకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: ఖరీదైన ఇళ్ల విభాగం కళకళలాడుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం ఈ విభాగంపై పెద్దగా పడలేదు. రూ.5 కోట్లకు పైగా ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (ధనవంతులు/హెచ్ఎన్ఐలు) 75 శాతం మంది చెప్పారు. వచ్చే రెండేళ్లలో పెద్ద పట్టణాలు, హాలిడే ప్రదేశాల్లో వీరు ఇళ్లను కొనాలనుకుంటున్నారు. లగ్జరీ హౌసింగ్ అవుట్‌లుక్ 2022 పేరుతో లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ఇండియా సోథెబీ ఇంటర్నేషనల్ రియల్టీ ఒక నివేదిక విడుదల చేసింది.
200 హెచ్ఎన్ఐల అభిప్రాయాల ఆధారంగా దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో (హైదరాబాద్ సహా) రియల్ ఎస్టేట్ ధోరణలపై ఈ సంస్థ నివేదిక రూపొందించింది. సంపన్నుల్లో రియల్ఎస్టేట్ పట్ల ధోరణి మారిందనడానికి ఈ ఫలితాలే నిదర్శమని పేర్కొంది. వచ్చే రెండేళ్లలో కొనుగోళ్లకు సముఖంగా ఉన్నామని చెప్పిన 75 శాతం మంది ప్రాధాన్యతలు గమనిస్తే.. 89 శాతం మంది ఖరీదైన ఇళ్ల పట్ల (సిటీ అపార్ట్మెంట్లు, బంగళాలు, హాలిడే హోమ్స్) ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది ఖరీదైన వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
బుల్లిష్ ధోరణి..: ముఖ్యంగా గడిచిన 18 నెలల్లో ఇల్లు కొనుగోలు చేసినట్టు 26% మంది చెప్పారు. వారి జీవనశైలిని మెరుగుపరుచుకోవడం, మంచి పెట్టుబడులను సొంతం చేసుకునే ఆలోచనతోనే వారు కొన్నారు. గత రెండు మూడేళ్లలో హెచ్ఎన్ఐలు, అల్ట్రా హెచ్ఎన్ఐలు ఖరీదైన ఇళ్లను సొంత వినియోగానికే కొనుగోలు చేశారు. మంచి పెట్టుబడి అవకాశం కోసం కొనుగోలు చేయడం అంటే అది బుల్లిష్ ధోరణికి సంకేతమని సోథెబీ ఇంటర్నేషనల్ రియాలిటీ సీఈవో అమిత్ గోయల్ అన్నారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ సంప్రదాయ ధరల పెరుగుదల క్రమంలో ఉన్నట్టు చెప్పారు.
హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం
29 శాతం మంది హెచ్ఎన్ఐలు హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ హాలిడే హోమ్‌కు రూ.5–10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని 71 శాతం మంది భావిస్తున్నారు. 29 శాతం మంది రూ.10 కోట్ల పైన ధర ఉన్నా ఫర్వాలేదని చెప్పారు. లగ్జరీ అపార్ట్మెంట్ లేదా విల్లా అయితే రూ.10–25 కోట్ల వరకు పెట్టుబడికి సుముఖంగా ఉన్నట్టు 69 శాతం మంది చెప్పారు. 21 శాతం మంది రూ.5–10 కోట్ల బడ్జెట్లో, మిగిలిన 10 శాతం మంది రూ.25 కోట్లకు పైగా బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు.