soundharya
-
25 వసంతాలు పూర్తి చేసుకున్న 'రాజా'.. ఈ సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్
రాజా.. 1999 మార్చి 18న ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే సినిమాకు రీమేక్.. ఇప్పటికి టాలీవుడ్లో ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు పూర్తి కావడం జరిగింది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ క్రమంలోనే రాజా చిత్రం తెలుగులో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. 1999లో విడుదలయిన ఈ సినిమా వెంకటేశ్- సౌందర్య జోడీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. వాస్తవంగా 'రాజా'లో హీరోయిన్ మొదట సౌందర్య కాదట. ఈ సినిమాకు మొదటగా రోజాను హీరోయిన్గా అనుకున్నారట. అందుకు కారణం రాజా మాతృక అయిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే చిత్రంలో మొదట నటించింది రోజానే కావడం. తమిళంలో వచ్చిన ఆ సినిమాతో ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. తమిళంలో లీడ్ రోల్స్‌లో కార్తిక్, రోజా, అజిత్ నటించారు. తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా చాలానే అందాయి. ఈ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్‌లో కూడా నటించాలని నిర్ణయించుకుంది. దానికి తనకు అవకాశం లభించింది కూడా. కానీ ఆ సమయంలో రోజా వద్ద అవసరమైన డేట్స్ లేకపోవడంతో సౌందర్యను సంప్రదించి రాజా సినిమాను పట్టాలెక్కించారు. ఇందులో వెంకీ, సౌందర్య కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరిని ఆన్ స్క్రీన్ క్యూట్ కపుల్‌గా అనేవారు. అంతలా ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయింది. ఆ రోజుల్లో రాజా సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చాయి. విడుదలైన అన్ని చోట్లు 50రోజులు ఆడిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మొదట దొంగగా కనిపించిన వెంకీ ఆ తర్వాత తన సరైన నటనతో ప్రేక్షకులను కదిలించాడు. అంతే స్థాయిలో సౌందర్య తన సెంటిమెంట్‌తో కట్టిపడేసింది. 71 కేంద్రాల్లో రాజా సినిమా 100 రోజులు ఆడింది. 4 సెంటర్లలో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా వెంకటేశ్ కెరియరల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమాకు ఉత్తమ ఉత్తమ నటిగా సౌందర్యకు నంది అవార్డు దక్కింది. రాజా విడుదలయ్యి నేటితో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. -
ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి
ఎస్వీ కృష్ణారెడ్ఢి.. పోస్టర్‌పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదంతో పాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో యమలీల ఓ సంచలనం అయితే మాయలోడు చిత్రం కూడా ఒక సెన్సేషనల్ హిట్.. అలా ఆయన నుంచి ఎన్నో హిట్ చిత్రాలు వెండితెరపై మెరిశాయి. ఒక్కపాటతో 365 రోజులు ఆడిన సినిమా 'మాయలోడు' సినిమాలో 'చినుకు చినుకు సాంగ్' అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ పాటలో బాబూమోహన్- సౌందర్య కలిసి వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. సుమారు 30 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం. ఆ ఒక్క పాట కోసం ఏకంగా 365 రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్ చెప్పారు. ప్రేక్షకులు సినిమాకు రావడం ఆ పాట పూర్తికాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయేవారని ఆయన చెప్పారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ,సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్.. కానీ ఒక కమెడియన్‌తో సాంగ్ తీయడం ఏంటి..? అనే సందేహం చాలామందిలో ఉండేది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్ఢి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మాయలోడు సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాటను బాబూ మోహన్‌తో తెరకెక్కించినట్లు ఆయన ఇలా చెప్పారు. 'మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇబ్బంది పెట్టారు. 'నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..' అంటూ నాపట్ల రాజేంద్రప్రసాద్ వెటకారంగా మాట్లాడారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. సినిమా పూర్తి అవుతుందని అనుకున్న సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ తక్కవ కావడంతో అదనపు డేట్స్ కోసం అడిగేతే కనీసం కూడా సహకరించలేదు. ఎలాగైనా పాట చిత్రీకరణ చేయాలని ఆయన్ను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎలా చేస్తావో చూస్తా అన్నారు ఫైనల్‌గా రాజేంద్ర ప్రసాద్‌తో మిగిలిన డేట్స్ తో డబ్బింగ్ పూర్తి చేయించాను. అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను తన మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ చెప్పాడు. ఒక రోజులో ఎలాగూ డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారు. సినిమా మొత్తం 1200 అడుగుల రీల్ వస్తే, ఎడిటర్‌ను రిక్వెస్ట్ చేసి, మొత్తం ఒకే రీల్‌గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్‌కు తెలియదు. దీంతో మధ్యాహ్నం 1గంటకే డబ్బింగ్ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు. ‘ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు. ఆ తర్వాత పాట షూటింగ్‌కు రమ్మని పిలిస్తే, ‘నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చేసుకో పో’ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతటితో రాజేంద్రప్రసాద్ నిష్క్రమించగా.. ఇక ఆయన్ను బతిమాలాల్సిన అవసరం లేదని భావించానని కృష్ణారెడ్ఢి తెలిపారు. ఆపై వెంటనే బాబూమోహన్‌తో సాంగ్ తీయాలని నిర్ణయించుకుని బాబూమోహన్‌తో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపాడు. బాబుమోహన్, సౌందర్యతో పాట తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత కొందరి మధ్యవర్తులను తన వద్దకు పంపినట్లు చెప్పాడు. సాంగ్ తీసేందుకు రాజేంద్రప్రసాద్ రెడీగా ఉన్నారని వారు చెప్పారు. అయితే ఇక నాకు ఆ అవసరం లేదని, ఇప్పటికే బాబూమోహన్‌కు మాట ఇచ్చేశానని చెప్పడంతో వారు వెళ్లి పోయారు. కావాలాంటే రాజేంద్రప్రసాద్ షూటింగ్ స్పాట్ వద్దకు రావొచ్చని, చూసి వెళ్లొచ్చని చెప్పాను. అని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. చిత్రపరిశ్రమలో తాను దర్శకుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్రసాద్ అని ఎస్వీ కృష్ణారెడ్ఢి చెప్పారు. తన సినీ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉందని కూడా ఇదే సందర్భంలో అన్నారు. కానీ మాయలోడు సినిమా విషయంలో మాత్రం తనను రాజేంద్రప్రసాద్ తీవ్రంగా బాధపెట్టారని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. గతేడాది 'ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' అనే చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్ఢి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. -
సౌందర్య బయోపిక్‌లో నటిస్తానంటున్న స్టార్ హీరోయిన్
నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సౌందర్య. ఈ కన్నడ నటి 1992లో విడుదలైన పా నానా ప్రిదీసు అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 1993లో పొన్మణి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక్కడ రజనీకాంత్, విజయ్‌కాంత్, పార్తీపన్ వంటి స్టార్ హీరోలతో నటించారు. రజనీకాంత్ సరసన నటించిన పడయప్పా, అరుణాచలం చిత్రాలు సూపర్‌హిట్ అయ్యి సౌందర్యను స్టార్ హీరోయిన్ను చేశాయి. అదే విధంగా తెలుగు,మలయాళం భాషల్లోనూ నటించి బహుభాషా నటిగా రాణించారు. తెలుగులో చిరంజీవి,వెంకటేష్,నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించి ఆమె చెరగని ముద్ర వేసింది అలా ప్రముఖ కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ఆమె 2004లో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి హెలీకాప్టర్‌లో వెళ్తూ దుర్మరణం చెందారు. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తున్న నటి రష్మిక మందన్నా కూడా కన్నడ భామే అన్నది తెలిసిందే. ఈమె కూడా మాతృభాషలో కథానాయకిగా పరిచయం అయ్యి ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీలో కథానాయకిగా నటిస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ఓ భేటీలో పేర్కొంటూ తనకు నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఆశగా ఉందన్నారు. తనను చిన్నతనంలో సౌందర్యలా ఉన్నావని తన తండ్రి అనే వారని, ఆ విషయాన్ని తలచుకుంటే గర్వంగా ఉంటుందన్నారు. అవకాశం వస్తే కచ్చితంగా సౌందర్య బయోపిక్‌లో నటిస్తానని పేర్కొన్నారు. -
హీరో ధనుష్ అబద్ధం చెప్పారు
చెన్నై: హీరో ధనుష్ అబద్ధం చెప్పారని అన్నారు బాలీవుడ్ భామ కాజోల్. హిందీలో క్రేజీ కథానాయికిగా వెలుగొందుతున్న సమయంలోనే ఈ బ్యూటీ మిన్సార కణవు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం విజయాన్ని సాధించినా మళ్లీ తమిళ చిత్రాల్లో నటించలేదు. కాగా చాలా కాలం తరువాత ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న వీఐపీ–2 చిత్రంతో మరోసారి కోలీవుడ్‌లో మెరవడానికి రెడీ అవుతున్నారు. ఇందులో కాజోల్ ప్రతినాయకిగా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అది నిజం కాదని ఆదివారం జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ధనుష్ స్పష్టం చేశారు. ఇందులో కాజల్‌ది తన పాత్రతో సమాంతరంగా సాగే ప్రధాన పాత్ర అని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాజోల్ మాట్లాడుతూ తాను ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి సాహసించడం లేదన్నారు. అప్పుడెప్పుడో మిన్సారకణవు చిత్రంలో నటించానని, దీంతో వీఐపీ–2 చిత్రంలో నటించడానికి తాను నెర్వస్‌గా ఫీలయ్యానన్నారు. భాష తెలియకపోవడమే అందుకు కారణం అని అన్నారు. ఈ చిత్రం కోసం ధనుష్, సౌందర్యరజనీకాంత్‌లు తన ఇంటికి వచ్చి తమిళంలో మాట్లాడటం గురించి చాలా నేర్పించారన్నారు. తమిళ భాష ఫోబియా నుంచి వారే తనను తప్పించారని అన్నారు. అయినా తమిళంలో సంభాషణలు చెప్పడానికి బుర్ర బద్దలు కొట్టుకున్నానని అన్నారు. కొంచెం తమిళం, ఎక్కువ ఆంగ్ల భాషల్లో డైలాగులు చెప్పేశానని అన్నారు. అయితే తాను తమిళంలో డైలాగులు బాగా చెప్పానని ధనుష్, సౌందర్య రజనీకాంత్‌లు అబద్ధం చెప్పారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా వీఐపీ–2 చిత్రంలో నటించడం మంచి అనుభవం అని, ధనుష్ ఎక్స్ట్రార్డినరీ యాక్టర్ అని ప్రశంసించారు. సౌందర్య రజనీకాంత్ స్క్రిప్ట్ విషయంలో చాలా క్లియర్‌గా ఉండేవారని కాజోల్ పేర్కొన్నారు. ఇందులో ఆమె కార్పొరేట్ సంస్థ అధికారిణి వసుంధర పాత్రలో నటించారు. కాగా ఈ చిత్ర హిందీ వెర్షన్ కోసం ధనుష్, కాజోల్‌పై ప్రమోషన్ గీతాన్ని ప్రత్యేకంగా చిత్రీకరించడం విశేషం. ఈ పాట అదనపు ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. -
రజనీకాంత్ 'విక్రమసింహ' ట్రైలర్
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - సౌందర్య
-
నటి సౌందర్య ఆస్తుల కేసులో కుదిరిన రాజీ
బెంగళూరు, న్యూస్‌లైన్: బహుభాషా నటి, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన అందాల తార సౌందర్య అర్ధాంతరంగా విమాన ప్రమాదంలో తనువు చాలించిన విషయం తెల్సిందే. సౌందర్య మరణాంతరం ఆమె ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు రాజీకి వచ్చి ఎటువంటి వివాదం లేకుండా ఆస్తుల పంపకానికి పరస్పర అంగీకారానికి వచ్చారు. కోర్టులో ఉన్న వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి కరీంనగర్‌కు చార్టర్డ్ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ మరికొంత మందితో బయలుదేరుతుండగా ఒక్కసారిగా విమానం కుప్పకూలి మంటలు అంటుకోవడంతో సౌందర్య, ఆమె సోదరుడితో పాటు అందరూ మృత్యువాత పడ్డారు. సౌందర్యకు తల్లి మంజుల, భర్త జీఎస్. రఘు, సోదరుడు అమరనాథ్, అతని భార్య బి. నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌంద ర్య 2003 ఫిబ్రవరి 15న వీలు రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చెయ్యాలని అమరనాథ్ భార్య నిర్మల 2009లో ఇక్క డి మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంత కాలం వీరు కోర్టు చుట్టు తిరిగారు. చివరికి రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆస్తుల పంపకాలు ఇలా సౌందర్య ఆస్తులకు మంజుల, రఘు, నిర్మల, సాత్విక్ వారసులు. తాము రాజీకి వ చ్చామని, ఎలాంటి సమస్య లేదని వారు కోర్టుకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వివాదపు అర్జీని కూడా ఉపసంహరించుకున్నారు. సౌందర్య పేరుతో ఉన్న రూ. 25 లక్షల బ్యాంకు డిపాజిట్, హనుమంత నగరలోని ఐదు ఇళ్లు మేనల్లుడు సాత్విక్‌కు చెందుతాయి. అదే విధంగా నిర్మలకు రూ. 1.25 కోట్ల నగదు చెందుతుంది. సౌందర్య సోదరుడు అమరనాథ్ పేరుతో వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి విక్రయించి వచ్చిన నగదులో మంజుల, నిర్మల, సాత్విక్ పంచుకోవ డానికి అంగీకరించారు. జాయింట్ ప్రాపర్టీ విషయంలో నిర్మల జోక్యం చేసుకోకుండ సౌందర్య తల్లి మంజులకు అప్పగించాలి. మల్లేశ్వరం, హెచ్ఆర్బీఆర్ రెండవ సెక్టార్‌లోని ఇంటి స్థలాలు, హైదరాబాద్‌లోని కార్యాలయం, హెచ్ఆర్బీఆర్ లేఔట్‌లోని ఇంటి స్థలాలు సౌందర్య భర్త రఘుకు అప్పగించాల్సి ఉంది. ఈ విషయంపై అందరు అంగీకరించడంతో కేసుకు పుల్‌స్టాప్ పడింది. అయితే సౌందర్య నిజంగా వీలునామా రాసిందా లేదా అనే విషయం మాత్రం మిస్టరీగా మారింది. సినీ ‘సౌందర్యం 1992లో కన్నడ సినీరంగం నుంచి గంధర్వ సినిమాతో వెండి తెరకు పరిచయమైన సౌందర్య తెలుగు, కన్నడ, తమిళ్, మళయాళం, హిందీ సినిమాలలో నటించి పలు అవార్డులు సొంతం చేసుకుంది. వంద సినిమాలకు పైగా ఆమె హీరోయిన్గా న టించింది. 2003 ఏప్రిల్ 27న వరుసకు బావ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీరు రఘును వివాహం చేసుకుంది. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న ఇక్కడి జక్కూరు ఏయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్లో అక్కడి పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరానాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు.