S.P. Balasubramanyam
-
ఎస్పీబీ పేరిట ప్రత్యేకమైన పార్కు
ఈ ఏడాది సెప్టెంబర్ 25న గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కనుమరుగయ్యారు కానీ పాటల రూపంలో అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. ఆయనకు నివాళిగా తమిళనాడులోని కోయంబత్తూరులో ‘సిరు తుళి’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఎస్.పి.బి. వనం’ పేరిట ఓ ప్రత్యేకమైన పార్కును ఏర్పాటు చేసింది. అక్టోబర్‌లో ఈ వనం రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. గత వారం ఆవిష్కరించారు. చనిపోయే నాటికి బాలు వయసు 74. ఈ వనంలో మొత్తం 74 మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు బాలు పాడిన ఓ పాటను పేరుగా పెట్టడం విశేషం. మొక్కలన్నింటినీ ‘ట్రెబల్ క్లెఫ్’ (సంగీత స్వర చిహ్నం) ఆకారంలో నాటారు. అలాగే సంగీత వాద్యాలు తయారు చేసే చెట్లకు సంబంధించిన మొక్కలివి. కోయంబత్తూరు శివార్లలో పచ్చప్పాళయంలో 1.8 ఎకరాల ఈ వనంలో లైబ్రరీ, పిల్లలు ఆడుకోవడానికి పార్క్, ఇంకా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామని ‘సిరు తుళి’ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, ఈ వనం ఆవిష్కరణ వేడుకలో బాలు కుమారుడు ఎస్.పి. చరణ్, సోదరి ఎస్.పి. శైలజ వర్చ్యువల్‌గా పాల్గొన్నారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : ఇద్దరు: మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై ॥ మంచు తెర లే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా... ఓ... ॥ చరణం : 1 ఆమె: నాలో కులుకులు కులుకులు రేపే లోలో తెలియని తలపులు రేపే పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది అతడు: నీలో మమతల మధువుని చూసి నాలో తరగని తహతహ దూకి నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది ఆ: ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా అ: ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా ఆ: మరి తయ్యారయ్యి ఉన్న వయ్యారంగా సయ్యంటు ఒళ్లోకి వాలంగా అ: దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ చిన్నారి వన్నెల్ని ఏలంగా ఆ: ప్రతిక్షణం పరవశం కలగగా ఓ...॥ చరణం : 2 అ: ఆడే మెరుపుల మెలికల జాణ పాడే జిలిబిలి పలుకుల మైనా రాణి తొలకరి చినుకులలోన తుళ్లే థిల్లానా ఆ: రేగే తనువుల తపనలపైన వాలే చినుకుల చమటల వాన మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన అ: బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా ఆ: అందాల మందార హారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా అ: ఇక వెయ్యేళ్లైన నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా ఆ: నువ్వు వెళ్లాలన్న ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్లు కట్టేయనా అ: కాలమే కదలక నిలువగా... ఓ... ॥ చిత్రం : శుభాకాంక్షలు (1997), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి, గానం : బాలు, చిత్ర, బృందం -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: పంటచేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేతపచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే ॥॥ చరణం : 1 ఆమె: శివ గంగ తిరనాళ్లలో నెలవంక స్నానాలు చెయ్యాలా చిలకమ్మ పిడికిళ్లతో గొరవంక గుడిగంట కొట్టాలా అ: నువ్వు కంటి సైగ చెయ్యాలా నే కొండ పిండి కొట్టాలా మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా (2) ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా ॥॥ చరణం : 2 ఆ: గోదారి పరవళ్లలో మా పైరు బంగారు పండాలా ఈ కుప్ప నూర్పిళ్లతో మా ఇళ్లు వాకిళ్లు నిండాలా అ: నీ మాట బాట కావాలా నా పాట ఊరు దాటాలా మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా (2) ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా ॥॥ చిత్రం : పదహారేళ్ళ వయసు (1978) రచన : వేటూరి సంగీతం : చక్రవర్తి గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి -
ఆన్లైన్లో రజనీకాంత్ 'కోచడయాన్' పాట హల్చల్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కోచడయాన్' చిత్రంలోని తొలిపాట ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన 'ఎంగె పొగుదో వానమ్' పాటను సోమవారం విడుదల చేశారు. ఈ పాటను వైరముత్తు రచించగా, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ స్వరాలు అందించారు. రజనీపై ఎనర్జిటిక్‌గా రూపొందించిన ఈ గీతానికి రెహ్మాన్ మెలోడీ టచ్ ఇచ్చి అద్భుతంగా రూపొందించారు. రజనీకాంత్ చిత్రానికి రెహ్మాన్ సంగీతమందించడమిది ఆరోసారి. ఈ చిత్రంలో రజనీ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, రష్యా, జపాన్, చైనా భాషలలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని 3డిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా నిర్మిస్తున్నారు.