మావోయిస్టుల కార్యకలాపాలు లేవు
జగిత్యాలక్రైం: జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేవని ఎస్పీ భాస్కర్ తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీర్పూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులకు ఈనెల 6న నకిలీ లెటర్ప్యాడ్లు పోస్టు చేశారని అన్నారు. ఇందులో బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. హెచ్చరిక లేఖలపై నర్సింహులపల్లి సర్పంచ్ ప్రభాకర్ ఫిర్యాదు చేయడంతో వాటిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టామని అన్నారు. ఈక్రమంలో నర్సింహులపల్లికి చెందిన మాజీ మిలిటెంట్ బోగ లక్ష్మీరాజంపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు.
అయితే, తానే ఆ లేఖలు రాసినట్లు అతడు అంగీకరించాడని వివరించారు. లోతైన విచారణలో సిరిసిల్ల పట్టణంలోని వెంకట్రావ్కాలనీకి చెందిన పోలు ప్రకాశ్.. తన కంప్యూటర్ ద్వారా మావోయిస్టుల పేరిట లెటర్ప్యాడ్లు ప్రింట్ చేసి లక్ష్మీరాజానికి ఇచ్చాడన్నారు. ఇదిలా ఉంటే.. లక్ష్మీరాజానికి, తన చిన్నబాపు కుమారుడు బోగ సత్తన్నతో కొంతకాలంగా భూ వివాదం నడుస్తోందని ఎస్పీ చెప్పారు. నర్సింహులపల్లికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు, గ్రామస్తులు కూడా సత్తన్నకే మద్దతు ఇవ్వడంతో మనసులో పెట్టుకున్న లక్ష్మీరాజం.. తన ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు మావోయిస్టుల పేరిట లేఖలు ముద్రించి పోస్టు చేశాడని ఎస్పీ వెల్లడించా రు.
దీంతో లేఖలు పోస్టు చేసిన బోగ లక్ష్మీరాజం, వాటిని ముద్రించిన సిరిసిల్లకు చెందిన పోలు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వారినుంచి కంప్యూటర్, మానిటర్, ప్రింటర్, సీపీయూ, కలర్ ప్రింటర్, లేఖ రాసేందుకు ఉపయోగించిన కాగితాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు. వరుసకు సోదరుడైన వ్యక్తితో ఉన్న వ్యక్తిగత కక్షలతోనే లక్ష్మీరాజం నకిలీ ఉత్తరాలు రాసి పో స్టు చేశాడని పేర్కొన్నారు.
లక్ష్మీరాజం 50 లెటర్ప్యాడ్లు తీసుకుని, 30 లేఖలు రాసి ఆర్మూర్ పోస్ట్‌బాక్స్‌లో వేశాడని అన్నారు. అతడు పీపుల్స్‌వార్‌లో 1981 నుంచి 2000 సంవత్సరం వరకు పనిచేశాడని, 2008లో పోలీసులకు లొంగిపోయాడని చెప్పారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ ఆరీఫ్‌అలీఖాన్, బీర్పూర్ ఎస్సై అజయ్, సారంగాపూర్ ఎస్సై మనోహర్‌రావు, కానిస్టేబుళ్లు రవి, జలేందర్, సుమన్‌ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రకాశ్, రూరల్ ఎస్సై అనిల్ తదితరులు పాల్గొన్నారు.