SP Rohini
-
వనపర్తిలో కార్డెన్ సెర్చ్
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని గాంధీనగర్, ఇంద్రకాలనీల్లో పోలీసులు గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ సురేందర్‌రెడ్డి నేతృత్వంలో ఒక సీఐ, 9 మంది ఎస్ఐలు, 123 మంది సిబ్బంది 15 బృందాలుగా ఏర్పడి ఇంటింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 59 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన 14 మందిని అనుమానితులుగా గుర్తించి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రెండు బెల్టు షాపులను తనిఖీ చేసి 34 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రతే ముఖ్యం.. జిల్లాకేంద్రంలో నేరాలు, దొంగతనాలను అరికట్టేందుకు ప్రజల భద్రత పర్యవేక్షణలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు వారి సరైన ధ్రువపత్రాలు తీసుకోవాలని ఏఎస్పీ సూచించారు. ఒకవేళ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పట్టణంలో ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడడం వంటి సంఘటనలు జరిగితే వెంటనే షీ టీం బృందాలకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి యజమానులు సరైన ధ్రువపత్రాలు చూయిం చి వాహనాలను తీసుకెళ్లాలని సూచించా రు. పట్టణంలోని అన్ని వార్డుల్లో విడతల వారీగా కార్డెన్ సెర్చ్ తనిఖీలు చేపడుతామన్నారు. దొంగతనాలు, నేరాలను అదుపు చేసేందుకు పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్ఐ నాగశేఖరరెడ్డి, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. అయిజలోనూ తనిఖీలు.. అయిజ (అలంపూర్): అయిజ నగర పంచాయతీలోని వల్లూరుపేట వీధిలో గురువారం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ, డీఎస్పీతో కలిసి 83 మంది పోలీసులు, ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు 8 టీంలుగా ఏర్పడి ఆపరేషన్ చేపట్టారు. వీధిలోని 240 ఇళ్ల వద్దనున్న వివిధ వాహనాలను, ఆయా ఇళ్లలో ఉన్నవారి ఆధార్ కార్డులను తనిఖీ చేసారు. సరైన ధ్రువపత్రాలు లేని 5 ప్యాసింజర్ ఆటోలు, ఒక కారు, 45 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ అయిజలో త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు ఉంటే దొరికిపోతారన్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఫలితంగా ఎంతోమం అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ గురించి చాలామందికి అవగాహన లేదని, త్వరలో అయిజలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేస్తామన్నారు. సీజ్ చేసిన వాహనాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానంగా సంచరిస్తున్నా, అద్దె ఇళ్లలో నివాసముంటున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ భాస్కర్, డీఎస్పీ సురేందర్‌రావు, గద్వాల, అలంపూర్ సీఐలు వెంకటేశ్వర్లు, రజిత, అయిజ ఎస్ఐ బాలవెంకటరమణతోపాటు జిల్లాలోని ఆయా మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. -
ప్రియాంకది హత్యా.. ఆత్మహత్యా?
వనపర్తి విద్యావిభాగం: జిల్లా కేంద్రం లోని జాగృతి జూనియర్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని శివశాంతి(17) మృతి మిస్టరీ ఇంకా వీడడం లేదు. విద్యార్థిని చనిపోయి ఐదురోజులు గడస్తున్నా నిజాలు వెలుగుచూడడం లేదు. కళాశాల యాజమాన్యం, హాస్టల్ వార్డెన్లు అసలు ఏం జరిగిందో చెప్పడానికే ముందుకురావడం లేదు. ఎస్పీకి ఫిర్యాదు.. ఇదిలా ఉండగా, తమ కూతురు మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో తల్లిదండ్రులు కోట్ల చిన్న బుచ్చన్న, సువర్ణ ఎస్పీ రోహిణీ ప్రియదర్శినికి ఫిర్యాదుచేశారు. కళాశాల యాజమాన్యం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న మాటల్లో నిజం లేదని వారు ఎస్పీకి వివరించారు. కళాశాల తరగతి గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు చెబుతున్నా అక్కడ అలాంటి వాతావరణం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫ్యాన్‌పై ఉన్న దుమ్ము, దూళి అలాగే ఉందని, ఉరివేసుకున్నట్లు భావిస్తున్న చున్నీ కూడా ఫ్యాన్‌కు లేదని చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి మృతిచెందిన మృతదేహాన్ని శుక్రవారం ఉదయం ఆరు గంటలకు వనపర్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లడం, ఆ సమయంలో మృతదేహం పరిస్థితి ఆస్పత్రి సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అయినట్లు వివరించారు. కాగా, తమ కూతురిది కచ్చితంగా హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీఇచ్చినట్లు మృతురాలు శివశాంతి తల్లిదండ్రులు తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో విచారణ వేగవంతం శివశాంతి మృతికేసులో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వనపర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 13న కేసు నమోదైంది. (క్రైం నంబర్ 255/2017లో 174 సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం) అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఎస్పీ విచారణ వేగవంతం చేశారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయాన్ని తేల్చేందుకు అన్నికోణాల్లో డీఎస్పీ జోగుల చెన్నయ్య, సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్ గదిలో మృతురాలి వస్తువులు, పుస్తకాలు, నోట్‌పుస్తకాలను పరిశీలించడంతో పాటు పాటు ఆమె స్నేహితురాళ్లను విచారిస్తున్నారు. శివశాంతి మృతిచెందిన విషయాన్ని మొదట ఎవరు చూశారు.. ఏ సమయంలో చూశారు.. అసలు ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దృష్టిసారించారు. పోస్టుమార్టం నివేదిక కోసం.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కావడంతో శివశాంతి మృతదేహానికి ఈనెల 13న స్థానిక ఏరియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం ప్రక్రియను పోలీసులు వీడియో ద్వారా చిత్రీకరించారు. తుది రిపోర్టు కోసం హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ రిపోర్టు రావడానికి కచ్చితంగా 40రోజులు పట్టే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ పోస్టుమార్టం రిపోర్టులో అనుమానం ఉంటే రీపోస్ట్‌మార్టం చేసేందుకు కూడా సిద్ధమేనని మృతురాలి కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్పీ హామీతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని శివశాంతి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రియాంకది హత్యా.. ఆత్మహత్యా? హన్వాడ (మహబూబ్‌నగర్): ప్రియాంక మృతి పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు ఇది హత్యా.. లేక ఆత్మహత్యా.. అనేది మిస్టరీగా మారింది. తన మృతికి విద్యార్థులే కారణం అంటూ రాసిన సూసైడ్ నోట్లో ఎవరి పేరూ పేర్కొనకుండా ఉండడం, ఆ సూసైడ్‌నోట్ తన చేతిరాతేనా.. అందులోనూ చివరగా అమ్మాయి పేరుకు బదులుగా సిగ్నేచర్ చేయడం వంటివి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. హన్వాడ నుంచి 4 కి.మీ. వారి ఇంటి నుంచి 2 కి.మీటర్లు దూరం ఉన్న కుంటలో బాలిక ఆత్మహత్య చేసుకోవడాన్ని గ్రామస్తులు, కుటుంబీకులు నమ్మలేకపోతున్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న ప్రియాంక ఒంటిపై వీపు భాగంలో.. తలపై చిన్నచిన్న గాయాలైనట్లు కుటుంబీకులు పేర్కొంటున్నారు. పాఠశాల నుంచి వాంతుల పేరిట బయటకు వచ్చిన ప్రియాంక గతంలో కూడా పలుమార్లు పాఠశాల నుంచి బయటికి వచ్చి నేరుగా ఇంటికి వెళ్లిన సంఘటనలున్నట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంటుంది. నెలలో కనీసం 8–10 దినాల పాఠశాలకు రాకున్నా చదువులో మాత్రం చాలా చురుకని వివరిస్తున్నారు. నెల ఫీజల విషయంలో అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదని ప్రిన్సిపాల్ రాజు చెబుతున్నాడు. పరిశీలించిన డీఎస్పీ భాస్కర్.. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ భాస్కర్ పాఠశాల పరిసరాలు, మృతదేహాన్ని వెలికితీసిన మోత్కుకుంట పరిసరాలను కూడా పరిశీలించారు. అయితే కుంటలోకి సామాన్యంగా ఎవరూ వెళ్లలేని విధంగా ఉందని, బాలిక అక్కడికి ఎలా చేరకుంది.. లేక ఎవరైనా చంపి కుంటలో వేసి వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ భాస్కర్ చెబుతున్నారు. ఈ కేసు విషయాన్ని జిల్లా ఎస్పీ అనూరాధ ఫోన్లో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని.. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపామన్నారు. చేతిరాతపై నిపుణులకు పంపిస్తామన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ధర్నా ప్రియాంక మృతి పట్ల పెద్దర్పల్లి గ్రామస్తులు బుధవారం మండలకేంద్రంలోని ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. పాఠశాల నుంచి విద్యార్థినిని ఒంటరిగా బయటికి పంపించి.. మళ్లీ పట్టించుకోకుండా చావుకు కారకులయ్యారంటూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ అక్కడికి చేరుకుని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే పాఠశాలకు చేరుకుని ప్రినిపాల్ రాజుగౌడ్, కరస్పాండెంట్ శ్రీనివాస్‌గౌడ్, క్లాస్‌టీచర్ ఆంజనేయులుగౌడ్లను అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలో సర్పంచ్ కృష్ణయ్య, వివిధ పార్టీల నాయకులు వెంకన్న, వెంకట్ పాల్గొన్నారు. -
మహిళా రక్షణ కోసమే షీ టీంలు
వనపర్తి క్రైం : సమాజంలో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు షీ టీంలను ఏర్పాటు చేశామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. అడుగడుగునా వివక్షకు గురవుతున్న మహిళలు తమలాంటి మనుషులేనన్న భావన సమాజంలో రావాలన్నారు. అప్పుడే వివక్ష తగ్గుతుందని తెలిపారు. వివిధ రంగాల్లో పని చేసేందుకు, చదువుకునేందుకు బయటకు వచ్చే బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో షీ టీంలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికీ జిల్లాలో 302మందికి షీ టీంల ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. వివక్ష చూపించే వారికి మా షీ టీం సభ్యులు కౌన్సెలింగ్ ఇస్తారన్నారు. తీవ్రతను బట్టి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ.. మహిళలు, పురుషులతో సమానమని చాటిచెప్పేందుకు పోలీస్‌శాఖ ద్వారా జనమైత్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో సమానత్వంపై అవగాహన కార్యక్రమాలు ఎస్పీ నిర్వహిస్తున్నారు. మహిళలకు చదువెంతో ముఖ్య: నేటి సమాజంలో పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో మహిళలు రాణించాలని ఎస్పీ అన్నారు. ఇది జరగాలంటే ప్రతి మహిళ తప్పకుండా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు చైతన్యం కేవలం చదువుతోనే వస్తుందన్నారు. ఇందిరాక్రాంతి పథం, మెప్మా శాఖలు ఏర్పాటు చేసిన మహిళా సంఘాల్లో చేరికతో ఆర్థిక సాయం అందుతుంది. తద్వారా స్వయం ఉపాధిలోనూ రాణించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా ఎదిగిన వారున్నారు. వారిలో పలువురు ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అవార్డులు అందుకున్న సంఘటనలూ ఉన్నాయని ఎస్పీ తెలిపారు.