ప్రియాంకది హత్యా.. ఆత్మహత్యా? | inter student death mystery still mystery | Sakshi
Sakshi News home page

వీడని మిస్టరీ

Published Fri, Oct 20 2017 8:37 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

inter student death mystery still mystery - Sakshi

శివశాంతి (ఫైల్‌)

వనపర్తి విద్యావిభాగం: జిల్లా కేంద్రం లోని జాగృతి జూనియర్‌ కళాశాలలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఇంటర్‌మీడియట్‌ విద్యార్థిని శివశాంతి(17) మృతి మిస్టరీ ఇంకా వీడడం లేదు. విద్యార్థిని చనిపోయి  ఐదురోజులు గడస్తున్నా నిజాలు వెలుగుచూడడం లేదు. కళాశాల యాజమాన్యం, హాస్టల్‌ వార్డెన్లు అసలు ఏం జరిగిందో చెప్పడానికే ముందుకురావడం లేదు.

ఎస్పీకి ఫిర్యాదు..
ఇదిలా ఉండగా, తమ కూతురు మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో తల్లిదండ్రులు కోట్ల చిన్న బుచ్చన్న, సువర్ణ ఎస్పీ రోహిణీ ప్రియదర్శినికి ఫిర్యాదుచేశారు. కళాశాల యాజమాన్యం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న మాటల్లో నిజం లేదని వారు ఎస్పీకి వివరించారు. కళాశాల తరగతి గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు చెబుతున్నా అక్కడ అలాంటి వాతావరణం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫ్యాన్‌పై ఉన్న దుమ్ము, దూళి అలాగే ఉందని, ఉరివేసుకున్నట్లు భావిస్తున్న చున్నీ కూడా ఫ్యాన్‌కు లేదని చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి మృతిచెందిన మృతదేహాన్ని శుక్రవారం ఉదయం ఆరు గంటలకు వనపర్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లడం, ఆ సమయంలో మృతదేహం పరిస్థితి ఆస్పత్రి సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అయినట్లు వివరించారు. కాగా, తమ కూతురిది కచ్చితంగా హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీఇచ్చినట్లు మృతురాలు శివశాంతి తల్లిదండ్రులు తెలిపారు.   

ఎస్పీ ఆదేశాలతో విచారణ వేగవంతం
శివశాంతి మృతికేసులో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వనపర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 13న కేసు నమోదైంది. (క్రైం నంబర్‌ 255/2017లో 174 సీఆర్‌పీసీ సెక్షన్‌ ప్రకారం) అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఎస్పీ విచారణ వేగవంతం చేశారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయాన్ని తేల్చేందుకు అన్నికోణాల్లో డీఎస్పీ జోగుల చెన్నయ్య, సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్‌ గదిలో మృతురాలి వస్తువులు, పుస్తకాలు, నోట్‌పుస్తకాలను పరిశీలించడంతో పాటు  పాటు ఆమె స్నేహితురాళ్లను విచారిస్తున్నారు. శివశాంతి మృతిచెందిన విషయాన్ని మొదట ఎవరు చూశారు.. ఏ సమయంలో చూశారు.. అసలు ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దృష్టిసారించారు.

పోస్టుమార్టం నివేదిక కోసం..
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కావడంతో శివశాంతి మృతదేహానికి ఈనెల 13న స్థానిక ఏరియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం ప్రక్రియను పోలీసులు వీడియో ద్వారా చిత్రీకరించారు. తుది రిపోర్టు కోసం హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఈ రిపోర్టు రావడానికి కచ్చితంగా 40రోజులు పట్టే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ పోస్టుమార్టం రిపోర్టులో అనుమానం ఉంటే రీపోస్ట్‌మార్టం చేసేందుకు  కూడా సిద్ధమేనని మృతురాలి కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్పీ హామీతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని శివశాంతి తల్లిదండ్రులు చెబుతున్నారు.

ప్రియాంకది హత్యా.. ఆత్మహత్యా?
హన్వాడ (మహబూబ్‌నగర్‌): ప్రియాంక మృతి పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు ఇది హత్యా.. లేక ఆత్మహత్యా.. అనేది మిస్టరీగా మారింది. తన మృతికి విద్యార్థులే కారణం అంటూ రాసిన సూసైడ్‌ నోట్‌లో ఎవరి పేరూ పేర్కొనకుండా ఉండడం, ఆ సూసైడ్‌నోట్‌ తన చేతిరాతేనా.. అందులోనూ చివరగా అమ్మాయి పేరుకు బదులుగా సిగ్నేచర్‌ చేయడం వంటివి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.  హన్వాడ నుంచి 4 కి.మీ. వారి ఇంటి నుంచి 2 కి.మీటర్లు దూరం ఉన్న కుంటలో బాలిక ఆత్మహత్య చేసుకోవడాన్ని గ్రామస్తులు, కుటుంబీకులు నమ్మలేకపోతున్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న ప్రియాంక ఒంటిపై వీపు భాగంలో.. తలపై చిన్నచిన్న గాయాలైనట్లు కుటుంబీకులు పేర్కొంటున్నారు. పాఠశాల నుంచి వాంతుల పేరిట బయటకు వచ్చిన ప్రియాంక గతంలో కూడా పలుమార్లు పాఠశాల నుంచి బయటికి వచ్చి నేరుగా ఇంటికి వెళ్లిన సంఘటనలున్నట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంటుంది. నెలలో కనీసం 8–10 దినాల పాఠశాలకు రాకున్నా చదువులో మాత్రం చాలా చురుకని వివరిస్తున్నారు. నెల ఫీజల విషయంలో అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదని ప్రిన్సిపాల్‌ రాజు చెబుతున్నాడు.

పరిశీలించిన డీఎస్పీ భాస్కర్‌..
ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ భాస్కర్‌ పాఠశాల పరిసరాలు, మృతదేహాన్ని వెలికితీసిన మోత్కుకుంట పరిసరాలను కూడా పరిశీలించారు. అయితే కుంటలోకి సామాన్యంగా ఎవరూ వెళ్లలేని విధంగా ఉందని, బాలిక అక్కడికి ఎలా చేరకుంది.. లేక ఎవరైనా చంపి కుంటలో వేసి వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ భాస్కర్‌ చెబుతున్నారు. ఈ కేసు విషయాన్ని జిల్లా ఎస్పీ అనూరాధ ఫోన్‌లో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని.. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపామన్నారు. చేతిరాతపై నిపుణులకు పంపిస్తామన్నారు.

కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ధర్నా
ప్రియాంక మృతి పట్ల పెద్దర్పల్లి గ్రామస్తులు బుధవారం మండలకేంద్రంలోని ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. పాఠశాల నుంచి విద్యార్థినిని ఒంటరిగా బయటికి పంపించి.. మళ్లీ పట్టించుకోకుండా చావుకు కారకులయ్యారంటూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ అక్కడికి చేరుకుని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే పాఠశాలకు చేరుకుని ప్రినిపాల్‌ రాజుగౌడ్, కరస్పాండెంట్‌ శ్రీనివాస్‌గౌడ్, క్లాస్‌టీచర్‌ ఆంజనేయులుగౌడ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలో సర్పంచ్‌ కృష్ణయ్య, వివిధ పార్టీల నాయకులు వెంకన్న, వెంకట్‌  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement