SP Trivikram varma
-
నీలిచిత్రాలు చూపిస్తే కఠిన చర్యలు
శ్రీకాకుళం రూరల్ : బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించినా, వారికి నీలిచిత్రాలు చూపించి లోబరుచుకోవడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో నీలిచిత్రాల సంఘటన, బాధ్యులపై తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. ఆయా స్టేషన్లలో ఉన్న ఆస్తి నేరాలపై వచ్చిన కేసుల పురోగతి వేగవంతం చేయాలన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద జన సంచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గుట్కాలు, ఖైనీల రవాణాపై నిఘా పెట్టాలని, బెల్డ్షాపులపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు సదస్సులు నిర్వహించాలన్నారు. అనంతరం న్యాయసలహాదారులు నాగమల్లేశ్వరరావు, కె.తిరుమలరావులు అత్యాచార కేసులు ఎలా చేధించాలో సలహాలు అందజేశారు. సమావేశంలో డీఎస్పీలు ఎం.కృష్ణమూర్తి నాయుడు, వి.భీమారావు, బి.ప్రసాదరావు, జి.స్వరూపారాణి, సీహెచ్ పెంటారావు, కె.వేణుగోపాలనాయుడు, వి.సుబ్రహ్మణ్యం, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
వీడని మిస్టరీ
పాలకొండ: పాలకొండ టీచర్స్ కాలనీలో కలకలం రేపిన డైట్ విద్యార్థిని పావని అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. జనావాసల మధ్య ఉన్న ఇంట్లో ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటంపై పోలీసులు మంగళవారం దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ తివిక్రమ వర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ అణువణువూ తనిఖీ చేశాయి. అనంతరం పావని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెది హత్య అని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలింది. గొంతును విచక్షణ రహితంగా కోసేసినట్లు వైద్యులు చెబుతున్నారు. నిశితంగా పరిశీలించిన ఎస్పీ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎస్పీ తివిక్రమవర్మ నిశితంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో గంటకు పైగా దర్యాప్తు చేశారు. ప్రతి ఆధారాన్ని ఆయన సేకరించారు. ఇప్పటికే కేసుపై ఒక అంచనాకు వచ్చిన ఆయన డీఎస్పీ స్వరూపారాణికి సూచనలిచ్చారు. ప్రస్తుతం పావని, శిరీషల ఫోన్ కాల్స్ ద్వారా కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్క శిరీషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో శిరీష పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు గుర్తించారు. కేసుపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు బయటకు రాకుండా చూస్తున్నారు. మనస్పర్థలే హత్యకు దారితీశాయా? సీతంపేట మండలం పెద్దూరుకు చెందిన పావని, శిరీష తల్లిదండ్రులు చనిపోవడంతో పాలకొండలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు. స్థానిక తమ్మినాయుడు కళాశాలలో పావని డైట్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలం నుంచి అక్క శిరీషతో పావనికి గొడవలు జరుగుతున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. అక్క శిరీషతో పాటు ఆమె స్నేహితులు ఇంటికి వస్తుండేవారని, దీంతో పావని వారితో ఇంటికి రావొద్దని వారించేదన్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం పావని వేరే చోటకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నరసన్నపేటకు సోమవారం ఉద్యోగ రీత్యా వెళ్లిన శిరీష సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి పావని రక్తపు మడుగులో పడిఉండటం, చుట్టూ కత్తులు ఉండటంతో.. వివాదాల నేపథ్యంలోనే పావనిని కావాలనే హత్య చేశారనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మృతదేహం ఉన్న పరిస్థితి, అక్కడ లభ్యమైన ఆధారాలతో పాటు మెడపై లోతుగా గాయమవడంతో ఆమెది హత్యే అని అభిప్రాయపడుతున్నారు. -
పోలీసుల ప్రమేయం లేదు
శ్రీకాకుళం , కాశీబుగ్గ: భావనపాడు పోర్టు నిర్మాణ విషయంలో పోలీసుల ప్రమేయం ఉండదని, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తేనే పోలీసులు స్పందిస్తారని ఎస్పీ త్రివిక్రమవర్మ అన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉందని, నష్టపరిహారాన్ని మొదలుకొని పూర్తి చర్యలు వారే చేపడతారని తెలిపారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు గురువారం విచ్చేసిన ఆయనతో ‘సాక్షి’ ముఖాముఖి. సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? ఎస్పీ: జిల్లాలో జాతీయ రహదారిపై ప్రతి కూడలి వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశాం. కూడళ్లతో పాటు సబ్ రోడ్లకు సైతం బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు తగ్గించాం. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించగలిగాం. సాక్షి: వాహనదారులపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఎస్పీ: ట్రాక్టర్, ఆటో, బస్సులు, పాఠశాల బస్సులు, బైక్‌లు ఇలా వాహనాలను బట్టి డ్రైవర్లకు అవగాహన సదస్సులు చేపడుతున్నాం. ఫిట్నెస్ లేని బస్సులు, కాలం చెల్లిన స్కూల్ బస్సులను నిలిపివేస్తున్నాం. సాక్షి: ఉద్దాన ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత ఉందా? ఎస్పీ:బారువ, సొంపేట, వజ్రపుకొత్తూరు, కాశీబుగ్గ పరిధిలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కొత్తవారు వస్తున్నారు తప్ప పాతవారు వేరేచోటకు మొగ్గుచూపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం మినహాయిస్తే ఉద్దాన ప్రాంతంలో పనిచేయడానికి ముఖం చాటేస్తున్నారు. సాక్షి: జిల్లాలో క్రైం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది? ఎస్పీ:కాశీబుగ్గ–పలాస ప్రాంతం. అనంతరం టెక్కలి, నందిగాం ఉన్నాయి సాక్షి: కాశీబుగ్గ పరిధిలో క్రైం రేటు తగ్గించేందుకు ఏ చర్యలు చేపడుతున్నారు? ఎస్పీ:కాశీబుగ్గ పరిధిలో స్టాఫ్ తక్కువగా ఉన్నారు. 53 మంది పురుషులు అవసరం ఉండగా 29 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయినప్పటికీ ప్రత్యేక చర్యలు ద్వారా ఇక్కడ శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. సాక్షి: జిల్లాలో హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. నివారణ చర్యలు చేపడుతున్నారా? ఎస్పీ: గత ఏడాది కాలంలో 9 హత్యలు జరిగాయి. ఇందులో కొర్లాం సమీపంలో తన్మయిపండా అనే యువతి హత్య కేసు ఛేదించాం. హత్యలు అదుపునకు మరిన్ని చర్యలు చేపడుతున్నాం. సాక్షి: నాన్‌బెయిల్‌బుల్ కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిసింది. వీటిపై మీ చర్యలేమిటి? ఎస్పీ: జిల్లాలో 2012 ముందు నాన్‌బెయిల్‌బుల్ కేసులు 306 ఉండేవి. హైకోర్టు దృష్టిపెట్టడంతో 170కు చేరుకున్నాయి. వీటిని మరింత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. సాక్షి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వీటిపై ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ:జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్న మాట వాస్తమే. మొత్తం 304 కేసులు నమోదు కాగా, పరిష్కారానికి ప్రాముఖ్యం ఇస్తున్నాం. సాక్షి: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎలా ఉంది? ఎస్పీ:మావోల ప్రభావం బాగా తగ్గింది. అయినా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఉంచాం. సాక్షి: ఎల్‌హెచ్‌ఎంఎస్(లాకుడ్ హౌస్ మానటరింగ్ సిస్టం) యాప్ ఫెయిలైందా... ఎందుకు వాడటంలేదు? ఎస్పీ:ఈ యాప్ ప్రజలలోకి ఇంకా చేరాల్సి ఉంది. ఇంటర్నెట్పై అవగాహన ఉన్నవారు వాడుతున్నారు. ఇంతవరకు 8వేల మంది యాప్‌లో నమోదయ్యారు. అంతా ఉచిత సర్వీసులు అందజేస్తున్నాం. -
నల్లమలలో భారీ డంప్ స్వాధీనం
ఒంగోలు : ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో మావోయిస్టులు పాతిపెట్టిన డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం పాలుట్ల సమీపంలో పాత డంప్‌ను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ తెలిపారు. ఈ డంప్‌లో పెద్ద ఎత్తున తుపాకులు, పలు రకాల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సమయంలో డంప్ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోం.. l
- నేటి బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించాలి -జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధింపు - విలేకరులతో ఎస్పీ త్రివిక్రమ్‌వర్మ ఒంగోలు క్రైం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా శనివారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారితే ఊరుకునేది లేదని ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్‌వర్మ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటీ కోర్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బంద్‌కు సంబంధించి పోలీసుల ఆంక్షలు వివరించారు. ఓఎస్డీ(అడ్మిన్)ఏ.దేవదానం, ఎస్బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజుతో కలిసి ఎస్పీ మాట్లాడుతూ బంద్‌ను ప్రశాంతంగా చేసుకోవాలని సూచించారు. జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. హింసాత్మకాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. బలవంతంగా దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. ఆర్టీసీ బస్సులను కూడా బలవంతంగా ఆపకూడదన్నారు. ప్రభుత్వ ఆస్తులు, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయకూడదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లేవిధంగా చేస్తే చర్యలు కఠినంగా తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ చట్టం ప్రయోగిస్తామని కూడా హెచ్చరించారు. బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని మూడు రెవెన్యూ సబ్ డివిజన్లలో ఆర్డీఓల ద్వారా 144 సెక్షన్ విధించేలా కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మండలాల స్థాయిలో పోలీసులను అప్రమత్తం చేశామని, జిల్లాలోని ఐదు పోలీసు సబ్ డివిజనల్(డీఎస్పీ)స్థాయి అధికారులకు ముందస్తుగా సూచనలు చేశామని వివరించారు. భారీ స్థాయి బైక్ ర్యాలీలు నిర్వహించకూడదని ఎస్పీ సూచించారు.