Space rocket
-
మూడు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్
జెరూసలేం: గాజాలో హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య కొనసాగుతున్న భీకరపోరు కారణంగా మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు ఇరాన్ ప్రకటించింది. సిమోర్ఘ్ రాకెట్‌తో వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. సెమ్నాన్ ప్రావిన్స్‌లోని ఇమామ్ ఖొమైనీ అంతరిక్ష కేంద్రంలో రాత్రివేళ ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో మహ్దా అనేది పరిశోధక ఉపగ్రహం కాగా, కేహాన్–2, హతెఫ్–1 అనేవి జీపీఎస్, కమ్యూనికేషన్‌కు సంబంధించిన నానో శాటిలైట్లని ప్రభుత్వ టీవీ తెలిపింది. గాజాపై యుద్ధంలో సైనికపరంగా జోక్యం చేసుకోనప్పటికీ, ఇటీవల జరిగిన ఇస్లామిక్ స్టేట్ భారీ ఆత్మాహుతి దాడి, ఇరాన్ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు విదేశీ నౌకలపై దాడులు చేయడం వంటివి ఇరాన్ మతపెద్దలపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టినట్లుగా భావిస్తున్నారు. -
పేలిపోయిన స్టార్‌షిప్ రాకెట్
టెక్సాస్: స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. అమెరికాకు చెందిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ శనివారం టెక్సాస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పైభాగం బూస్టర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్ షిప్ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్‌లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పేలిపోయింది. -
NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!
వాషింగ్టన్: అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. ఇందుకోసం 10 నెలల క్రితం ప్రయోగించిన 570 కిలోల ఉపగ్రహం లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమోర్ఫస్ అనే బుల్లి గ్రహశకలాన్ని ముందుగా నిర్దేశించిన మేరకు మంగళవారం తెల్లవారుజామున గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. దాంతో నాసా ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలంతా పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ సందడి చేశారు. అన్ని అంచనాలనూ అధిగమిస్తూ ప్రయోగం దిగ్విజయంగా ముగిసిందని నాసా ప్రకటించింది. అంతరిక్షంలో అతి చిన్న శకలాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఉపగ్రహాలను సంధించగలమని రుజువైందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బచెన్ అన్నారు. కెనైటిక్ ఇంపాక్ట్ టెక్నిక్ సాయంతో జరిగిన ఈ ప్రయోగం భూగోళ పరిరక్షణలో అతి పెద్ద ముందడుగని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. ‘‘నిన్నామొన్నటిదాకా శాస్త్ర సాంకేతిక కల్పనగా తోచిన విషయం ఒక్కసారిగా వాస్తవ రూపు దాల్చింది. నమ్మకశ్యం కానంతటి ఘనత ఇది. భావి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని కాపాడుకోవడానికి ఒక చక్కని దారి దొరికినట్టే’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రభావం తేలేందుకు మరికాస్త సమయం... డిడిమోస్ అనే మరో చిన్న గ్రహశకలం చుట్టూ డైమోర్ఫస్ తిరుగుతోంది. దాని వేగాన్ని తగ్గించడం ద్వారా కక్ష్యలో కొద్దిపాటి మార్పు తీసుకురావడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం. అది నెరవేరిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి శక్తిమంతమైన టెలిస్కోప్‌ల ద్వారా నాసా బృందం డైమోర్పస్ను కొద్ది వారాల పాటు నిరంతరం గమనిస్తుంది. డార్ట్‌క్రాఫ్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్య కనీసం ఒక్క శాతం కుంచించుకుపోతుందని అంచనా వేస్తోంది. ఆ లెక్కన డిడిమోస్ చుట్టూ అది పరిభ్రమించే సమయం 10 నిమిషాల దాకా తగ్గాలి. డిడిమోస్ జోలికి వెళ్లకుండా డైమోర్ఫైస్ను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టడం మామూలు విజయం కాదని థామస్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక డ్రాకో నావిగేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నియో... డార్ట్ వారసుడు డార్ట్ ప్రయోగం సఫలమవడంతో భూమికి అంతరిక్ష ముప్పును పసిగట్టి నివారించే ప్రయోగాల పరంపరలో తదుపరి దశకు నాసా తెర తీస్తోంది. డార్ట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా నియర్ అర్త్ ఆబ్జెక్ట్ (నియో) సర్వేయర్ పేరుతో రెండో దశ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్‌ను రూపొందిస్తోంది. దీన్ని త్వరలో పట్టాలపైకి ఎక్కించనున్నట్టు నాసా ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ ప్రకటించారు. భూమికి సమీపంలో ఉన్న ప్రమాదకర గ్రహశకలాలను కనిపెట్టి వాటితో భవిష్యత్తులో ముప్పు రాకుండా ముందే జాగ్రత్త పడటం దీని లక్ష్యమన్నారు. డైమోర్ఫస్‌ను ఉపగ్రహం ఢీకొట్టేందుకు కేవలం 43 సెకన్ల ముందు తీసిన ఫొటో -
భారత జెండాను టచ్ చేయని రష్యా.. కారణం ఇదే!
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. యుద్ధ ప్రభావం ఉక్రెయిన్‌పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉక్రెయిన్ బాసటగా నిలవడంతో పాటు రష్యాపై ఆంక్షల విధిస్తున్నాయి. అయితే.. భారత్ మాత్రం ఈ విషయంలో తటస్థంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత అనుసరిస్తున్న తీరపై రష్యా కూడా సానుకూలంగా స్పందించింది. తాజాగా రష్యాతో భారత్‌కి ఉన్న స్నేహబంధం ఎలాంటిదో నిరూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరు మారలేదని కొన్ని దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా రష్యా తాను చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగాలకూ పలు దేశాలను సహాయం అందించకూడదనే ఆలోచనలో ఉంది. అంతేకాదు వన్‌వెబ్ రాకెట్‌పై నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను రష్యా తొలగించింది. బైకనోర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించాల్సిన స్పేస్ రాకెట్ ద్వారా వివిధ దేశాల భాగస్వామ్యంతో 36 వన్ వెబ్ శాటిలైట్లను ప్రయోగించనున్నారు. అయితే, ఈ రాకెట్ పై ఉన్న అమెరికా, బ్రిటన్, జపాన్ జెండాలను తొలగించిన రష్యా.. భారత్ జెండాను మాత్రం అలాగే, ఉంచింది. అంతేకాకుండా రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ డిమిత్రి రోగోజిన్ ఈ విషయంపై స్పందిస్తూ.. “కొన్ని దేశాల జెండాలు లేకుండా, మా రాకెట్ మందుకంటే అందంగా ఉందని తెలుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతరిక్షంపైనా ప్రభావం చూపిస్తోందని టెక్నాలజీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Стартовики на Байконуре решили, что без флагов некоторых стран наша ракета будет краше выглядеть. pic.twitter.com/jG1ohimNuX — РОГОЗИН (@Rogozin) March 2, 2022 -
వందేళ్లలో మరో మానవగ్రహం!
భూమి మీకు బోర్ కొట్టేసిందా? అరుణగ్రహంలో కాపురం పెట్టేయాలని అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు నెరవేరే టైమ్ దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే... ఆ గ్రహాన్ని కనీసం పది లక్షల మంది మానవులతో నింపేస్తానని అంటున్నాడు ఎలన్ మస్క్! ఎవరీయన అంటే.. అమెరికాలో టెస్లా అని ఓ కంపెనీ ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తుందీ కంపెనీ. మస్క్ ఈ కంపెనీ యజమాని మాత్రమే కాదు.. హైపర్‌లూప్ పేరుతో అతి చౌకైన మరో రవాణా వ్యవస్థను ప్రపంచానికి అందించేందుకు ప్రయత్నిస్తున్న టెక్ విజర్డ్ కూడా. తన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీతో ఇప్పటికే మళ్లీమళ్లీ వాడుకోగల రాకెట్లను అభివృద్ధి చేసిన మస్క్ మరో అడుగు ముందుకేసి వీటిసాయంతో మనుషుల్ని అంగారకుడిపైకి కూడా పంపుతానని ప్రకటించారు. ఇందుకు సన్నాహకంగా 2018లో ఆ గ్రహంపైకి తన డ్రాగన్-2 స్పేస్ రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాడు. మెక్సికోలో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ వందమందిని మోసుకెళ్లగల వ్యోమనౌకలతో ఇది సాధ్యమేనని ఆయన అన్నారు. దాదాపు 42 ఇంజిన్లతో కూడిన ఈ వ్యోమనౌకలను భవిష్యత్తులో 200 మందిని మోసుకెళ్లేలా తీర్చిదిద్దుతారట ఆయన. బూస్టర్‌తో కూడిన వ్యోమనౌక 18 బోయింగ్ 737 విమానాలు విడుదల చేసేంత శక్తితో అవి పైకి ఎగిరి భూ వాతావరణాన్ని దాటుతాయి. ఆ తరువాత బూస్టర్ విడిపోయి మళ్లీ భూమిని చేరుతుంది. వ్యోమనౌక మరింత దూరం వెళ్లి... అక్కడే కక్ష్యలో తిరుగుతున్న భారీ ట్యాంకు నుంచి ఇంధనాన్ని నింపుకుని అంగార కుడికేసి దూసుకెళుతుంది. ఖాళీ అయిన ఇంధన ట్యాంకు భూమ్మీదకు చేరుకుని ఇంధనం నింపుకుని మళ్లీ కక్ష్యలోకి వెళ్లిపోతుంది. మానవులతో కూడిన తొలి అంగారక యాత్ర 2022 నాటికి మొదలైనా... ఆ తరువాత దశలవారీగా ఆ గ్రహాన్ని మానవ ఆవాస యోగ్యంగా మార్చేందుకు కనీసం వందేళ్లు పడుతుందని మస్క్ వివరిస్తున్నారు. రకరకాల టెక్నాలజీల సాయంతో ఆ గ్రహంపై మానవ నివాస యోగ్యమైన వాతావరణాన్ని సృష్టించాలన్నది ప్లాన్. దీన్నే టెరాఫార్మింగ్ అని పిలుస్తున్నారు. మళ్లీమళ్లీ వాడుకోగల బూస్టర్లు, వ్యోమనౌకలను వాడుతూండటం వల్ల అంగారక యాత్రకు పెద్ద ఖర్చేమీ కాదని, ఒక్కొక్కరూ కోటిన్నర రూపాయలు చెల్లిస్తే చాలని మస్క్ అంచనా!