బడిలో బయోమెట్రిక్!
♦ వేలిముద్రలతో ఉపాధ్యాయుల హాజరు నమోదు
♦ తొలిసారిగా 25శాతం పాఠశాలల్లో ఈ విధానం అమలు
♦ చర్యలకు ఉపక్రమించిన జిల్లా విద్యాశాఖ
♦ 570 పాఠశాలలను ఎంపిక చేయాలని ఎంఈఓలకు ఆదేశం
♦ నిధుల సర్దుబాటు చేయాలని కలెక్టర్‌కు డీఈఓ లేఖ
ఉపాధ్యాయుల హాజరుపై విమర్శలకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తెస్తోంది. టీచర్ల హాజరుశాతం తక్కువగా ఉండడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందనే ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లాకు వచ్చిన సుప్రీంకోర్టు బృందం సైతం ఈ రకమైన ఫిర్యాదులను లిఖితపూర్వకంగా స్వీకరించింది. ఈ క్రమంలో వీటిని అరికట్టి టీచర్ల హాజరుశాతం మెరుగుపర్చేందుకు సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా ఎస్ఎస్ఏ పీడీ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. తొలుత జిల్లాలోని 25శాతం పాఠశాలల్లో ఈ ప్రయోగాన్ని అమలు చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 2,287 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,591 ప్రాథమిక, 249 ప్రాథమికోన్నత, 447 ఉన్నత పాఠశాలలున్నాయి. ఎస్పీడీ ఆదేశాల మేరకు 2016-17 విద్యా సంవత్సరంలో 25శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. 37 మండలాల్లో 570 పాఠశాలల్లో ఈ ప్రయోగాన్ని అందుబాటులోకి తేవాలి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఒక్కో మండలానికి గరిష్టంగా 15పాఠశాలలను ఉంపిక చేయాల్సిందిగా డీఈఓ రమేష్ మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆయా పాఠశాలల ఎంపిక అనంతరం మిషన్లు కొనుగోలు చేసేందుకు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. వీటికి నిధులను సర్దుబాటు చేసేందుకు ఆయన కలెక్టర్‌కు లేఖ రాశారు.
ఆధార్‌తో అనుసంధానం..
బయోమెట్రిక్ మిషన్లలో హాజరుకు సంబంధించి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వేలిముద్రలు ఇవ్వాల్సిన పనిలేదు. సదరు ఉపాధ్యాయుల ఆధార్ వివరాలను ఎంట్రీచేసి సేవ్ చేస్తే వారి వేలిముద్రలు అందులో నిక్షిప్తం అవుతాయి. ప్రస్తుతానికి ఈ మిషన్లు కొనుగోలు చేసి ఆయా పాఠశాలల్లో అందుబాటులో ఉంచుతారు. వాస్తవానికి ఈ మిషన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేస్తే ఉపాధ్యాయుల హాజరు తీరు క్షణాల్లో సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తమవుతుంది. కానీ చాలావరకు పీఎస్, యూపీఎస్‌లలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దీంతో హాజరు తీరును పరిశీలించేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని యోచిస్తోంది.