ఆర్టీసీ నిలువు దోపిడీ
‘‘అవసరాన్ని అవకాశంగా మార్చుకోవడంలో ఆర్టీసీకి తెలిసినంతగా ఎవరికీ తెలియనట్లుంది... పరీక్ష రాసే అభ్యర్థులది అవసరం... ఆర్టీసీ వారిది అవకాశం..ఇంకేముంది ఆర్డినరీ (పల్లెవెలుగు) బస్సుల్లోనూ ఎక్స్‌ప్రెస్ చార్జీ ముక్కుపిండి వసూలు చేశారు. ఆ బస్సుల్లో ఎక్కిన పాపానికి సాధారణ ప్రయాణికుల జేబులకూ చిల్లు తప్పలేదు. మంచితరుణం మించిన దొరకదన్నట్లుగా స్క్రాబ్‌తో మూలనపడేయాల్సిన బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి అందినంత పిండుకున్నారు’’
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఆదివారం రోజువారీ బస్సులేకాకుండా అదనంగా బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటిస్తే...అందరూ అబ్బో ప్రయాణికులమీద ఎంతప్రేమో అనుకున్నారు. కానీ తీరా బస్సెక్కాక తెలిసింది ప్రత్యేక బస్సుల పరమార్థం. గ్రామరెవెన్యూ సిబ్బంది పరీక్షకు జిల్లావ్యాప్తంగా దాదాపు 77వేల మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో అనేకమందికి వారి ప్రాంతంలో కాకుండా ఆ మూలన ఉన్నవారికి ఈ మూలన, ఇక్కడి వారికి అక్కడ అన్నట్లుగా పరీక్షా కేంద్రాలను కేటాయించడం ఆర్టీసీకి కలిసొచ్చింది. పల్లెవెలుగు బస్సులకే ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేశారు. రోడ్డెక్కే అర్హతలేని, స్క్రాబ్‌గా వర్క్‌షాప్‌కు వెళ్లాల్సిన బస్సులకూ పనిచెప్పారు.
ఎక్స్‌ప్రెస్‌లుగా నిర్ణీత కిలోమీటర్లు ప్రయాణించిన బస్సులకు రంగులుమార్చి ఆర్డీనరిగా తిప్పుతున్నారు. వాటిని కూడ అదనపు బస్సులుగా నడిపి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేశారు. అనేక డొక్కు బస్సులు, రణ, గొణధ్వనులతో బస్సెక్కిన వారి సహనాన్ని పరీక్షిస్తూ ‘భారం’గా కదిలాయి. పరీక్ష రాసే అభ్యర్థులతో పాటు వారి సహాయకులుగా వెంట వచ్చిన వారికి, ఇతర ప్రయాణికులకూ ఈ అదనపు వడ్డింపు తప్పలేదు. వేగంలోగానీ, సౌకర్యంలో గానీ, స్టేజీవద్ద నిలపడంలో గానీ తేడా లేకపోయినా ఎక్స్ప్రెస్చార్జీలను వసూలు చేశారు.
జిల్లాకొచ్చిన సిటీబస్సులు..
రాజధానిలో తిరిగే సిటీబస్సులు ఆదివారం జిల్లాలో తిరిగాయి. కోచింగ్‌ల కోసం వెళ్లిన వారు, హైదరాబాద్‌లో ఉన్నవారి కోసం భువనగిరికి 6, సూర్యాపేటకు 4, నల్లగొండకు 3 సిటీబస్సులు నడిపారు.
124 అదనపు ట్రిప్పులు
ఆర్టీసీ వారు జిల్లాలో రోజూ నడిపే ట్రిప్పులకు అదనంగా ఆదివారం వీఆర్వో, వీఆర్ఏ అభ్యర్థుల కోసం 124 ట్రిప్పులు నడిపారు. దేవరకొండ డిపోలో 13, నల్లగొండ-25, నార్కట్‌పల్లి-9, యాదగిరిగుట్ట-18, కోదాడ-15, మిర్యాలగూడ-24, సూర్యాపేట-20 ట్రిప్పులను అదనంగా నడిపారు. ఇంతకుముందు డెరైక్టు బస్సులు లేని యాదగిరిగుట్ట-సూర్యాపేట, యాదగిరిగుట్ట-కోదాడ ల మధ్యకూడా బస్సులను నడిపారు. నల్లగొండ రీజియన్‌లో రోజూవారీ సగటు ఆదాయం రూ.68లక్షలుంటుంది. కానీ సంక్రాంతి పండగ తర్వాత రూ.62 నుంచి రూ.63 లక్షలకు మించడం లేదు. కానీ ఆదివారం నాడు రూ.75లక్షల దాకా ఆదాయం రావచ్చునని భాస్తున్నారు.
ప్రైవేటు వాహనాలకూ గిరాకీ...
సమాయనుకూలంగా బస్సులకోసం వేచిచూడటం ఇష్టంలేనివారు, ఎలాగూ బస్సుల్లో ఎక్కడ చార్జీలు వసూలు చేస్తున్నారనే కారణంతోనూ పలువురు అభ్యర్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. పది, పదిహేను మంది కలిసి సుమో, ట్రాక్స్, తుపాన్ లాంటి వాహనాలను అద్దెకు తీసుకోని నేరుగా పరీక్షా కేంద్రాల వరకు చేరుకున్నారు. దాంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది.
కిటకిట లాడిన బస్స్టేషన్లు, హోటళ్లు...
ఆర్టీసీ బస్స్టేషన్లు, హోటళ్లు కిటకిటలాడాయి. ప్రధా న పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యతలెత్తింది. భోజనం, టీ, టిఫిన్ హోటళ్లు, బేకరీలు జనంతో నిండిపోయాయి.
నాన్‌స్టాప్ ఫేర్ వసూలు చేశాం : బి.రవీందర్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్
అదనపు బస్సులు నడిపినపుడు ప్రయాణికులు ఒకవైపే వెళ్తారు. తిరుగు ప్రయాణంలో పెద్దగా ఉండరు. అందుకని చార్జీని ఒకటిన్నర రెట్లు వసూలు చేస్తాం. కానీ అభ్యర్థుల కోసం సాధారణ చార్జీలే వసూలు చేయమన్నాం. నాన్‌స్టాప్‌గా వెళ్తున్నపుడు ఎక్స్‌ప్రెస్ చార్జీ వసూలు చేసి ఉంటారు.
సూర్యాపేట నుంచి నల్లగొండకు వెళ్లే బస్సుల్లో ఇచ్చిన టికెట్ ఇది. ఏపి28జడ్ 2469 నంబర్‌గల ఈ ఆర్డీనరీ (పల్లెవెలుగు) బస్సుకు ఎక్స్‌ప్రెస్ చార్జీతో పాటు, టోల్గేట్ చార్జీ, ఎక్స్‌ప్రెస్, సెస్సుకూడా (మొత్తం రూ.49) వసూలు చేశారు. సాధారణంగా ఆర్డినరీ బస్సుకు రూ.33తో పాటు టోల్‌చార్జ్ రూ.4, సెస్సు రూపాయి మొత్తం రూ.38 వసూలు చేస్తారు. కానీ బోర్డు మార్చి ఎక్స్‌ప్రెస్ చార్జ్ వసూలు చేశారు. ఈ బస్సు ఎక్స్‌ప్రెస్‌గా నిర్ణీత కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం పల్లెవెలుగుగా మార్చడం కొసమెరుపు.