మాజీ మంత్రికి బెయిల్; జడ్జి సస్పెన్షన్
న్యూఢిల్లీ: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు జడ్జిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
ప్రజాపతికి ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ప్రజాపతికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేసింది. అలాగే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది.
ప్రజాపతి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు మరో ఆరుగురు తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మహిళ గత ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆయన పోలీసులకు దొరక్కుండా పరారయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మార్చి 15న ప్రజాపతిని పోలీసులు అరెస్ట్ చేశారు.