‘ప్రత్యేక’ నినాదమే మనకు దిక్కు!
ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు... రాష్ట్ర విభజన పాపం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పార్టీపరంగా రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కన్పించడం లేదు. ఆఖరుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏడాదిలోనే రెండు సార్లు అనంతపురం జిల్లా పర్యటనకు తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పార్టీకి గ్రామ స్థాయి నాయకులు కూడా కరువయ్యారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఎలాగూ నష్టపోయాం...ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆ నినాదంతోనే ముందుకెళ్తే బాగుంటుందని భావిస్తున్నారు. హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై ఇప్పటికే కోటి సంతకాలు, ఎస్ఎంఎస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం పార్లమెంటు జరుగుతున్నందున రాష్ట్రం నుంచి కనీసం రెండు వందల మంది నాయకులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. అంతో ఇంతో పార్టీ ప్రజల్లో ఉండాలంటే ఈ నినాదమే దిక్కు అని నేతలు భావిస్తున్నారు.