Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP govt failed to supply seeds1
విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు

గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారునాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్‌లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం. సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్‌లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్‌ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్‌ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది. గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్‌ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు. ఇంకా ఖరారు కాని సబ్సిడీలు ⇒ ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్‌ సేకరిస్తారు. ⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి, సీజన్‌కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు. ⇒ షెడ్యూల్‌ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్‌ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత ⇒ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు. ⇒ ప్రస్తుత ఖరీఫ్‌–2025 సీజన్‌ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్‌ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్‌ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. ⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్‌ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం ⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్‌ సీజన్‌లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.⇒ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్‌ పెట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్‌ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్‌ నుంచి నాన్‌ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.విత్తనోత్పత్తికీ రాంరాం ⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్‌లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్‌లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్‌ సీడ్స్‌ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల డిమాండ్‌ మేరకు సేకరిస్తారు. ⇒ సాధారణంగా ఏపీ సీడ్స్‌ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్‌ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్‌ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు. ⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్‌ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్‌ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం. ⇒ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్‌–2025 సీజన్‌కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్‌ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్ని విధాలుగా మోసం చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్‌ రాలేదంటున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్‌ విత్తనాలివ్వాలిఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్‌ సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ప్రైవేట్‌ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ISRO PSLV-C61 mission to fail midway2
గమ్యం చేరని నిఘానేత్రం

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ–సీ61 ప్రయోగం లక్ష్యాన్ని సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. నిఘా అవసరాలకు ఉద్దేశించిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–09)ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో రాకెట్‌ విఫలమైంది. ప్రయోగంలో తొలి రెండు దశలు విజయవంతమైనా మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇస్రో అమ్ముల పొదిలో కీలక అస్త్రంగా భావించే పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌) విఫలం కావడం అత్యంత అరుదు. ఇస్రో చరిత్రలో శ్రీహరికోట నుంచి జరిగిన ఈ 101 ప్రయోగం అనుకున్న ఫలితం ఇవ్వకపోవడం శాస్త్రవేత్తలను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ వైఫల్యం నేపథ్యంలో మరిన్ని ప్రయోగాలు వాయిదా పడే అవకాశాలున్నాయి. 2018–2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా 74 శాతం రాకెట్‌ ప్రయోగాల వైఫల్యానికి ప్రొపల్షన్, స్టేజ్‌–సపరేషన్‌ అంశాలే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. గతి తప్పిన రాకెట్‌ శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌–షార్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ–సీ61 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 110 సెకండ్ల వ్యవధిలో తొలి దశలో 70 కిలోమీటర్లు ఎత్తుకు, 261.8 సెకండ్లలో రెండో దశలో 232 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. 262.9 సెకండ్లకు మూడో దశలో ఘన ఇంధన మోటార్‌ మండించే సమయంలో రాకెట్‌ గతి తప్పింది. సరిచేసేందుకు మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. రాకెట్‌ సముద్రంలో పడిపోయి ఉంటుందని ఇస్రో రిటైర్డ్‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ ప్రకటించారు. మోటార్‌ కేస్‌లోని చాంబర్‌ ప్రెషర్‌లో లోపం తలెత్తినట్లు వెల్లడించారు.విచారణకు కమిటీ పీఎస్‌ఎల్‌వీ–సీ61 వైఫల్యానికి కారణాలు తెలిస్తేనే భావి ప్రయోగాల విషయంలో మరిన్ని జాగ్రత్తలకు ఆస్కారముంటుంది. అందుకే ఇస్రో నిపుణులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, మిషన్‌ స్పెషలిస్టులతో తొలుత ఫెయిల్యూర్‌ అనాలిసిస్‌ కమిటీ(ఎఫ్‌ఏసీ)ని వేయనున్నారు. ప్రయోగ డేటాను ఇది క్షుణ్నంగా సమీక్షించి వైఫల్యానికి కారణాలను తేలుస్తుంది. కారణం సాంకేతికమా, మానవ తప్పిదమా, ప్రతికూల వాతావరణం వంటి బాహ్య అంశాలా అనేది నిర్ధారిస్తుంది. అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది.కారణం అదేనా? పీఎస్‌ఎల్‌వీ–సీ 61 వైఫల్యానికి కారణంపై ఇస్రో దృష్టి సారించింది. ప్రొపల్షన్‌ సిస్టమ్‌లో ఫ్లెక్స్‌ నాజిల్‌ కంట్రోల్‌ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే రాకెట్‌ కూలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నాజిల్‌ను సరిచేసి ఇంధనాన్ని మండించడంలో ఈ వ్యవస్థదే కీలక పాత్ర. దీన్ని పొరలతో కూడిన ఎలాస్టోమెరిక్‌ మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. ప్రయోగం మూడో దశలో హైడ్రాక్సిల్‌–టెరి్మనేటెడ్‌ పాలీబ్యుటాడీన్‌ (హెచ్‌టీపీబీ) ఇంధనాన్ని ఉపయోగించారు. ఇది 240 కిలోన్యూటన్‌ థ్రస్ట్‌ను ఉత్పన్నం చేయగలదు.ఇస్రో గెలుపుగుర్రం పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహక నౌక ఇస్రోకు అత్యంత నమ్మకమైనది. ఎర్త్‌ అబ్జర్వేషన్, జియో–స్టేషనరీ, నావిగేషన్‌ అనే మూడు రకాల పేలోడ్లను నింగిలోకి పంపేలా పీఎస్‌ఎల్‌వీని ఇస్రో అభివృద్ధి చేసింది. దీని ఎత్తు 44.5 మీటర్లు, వ్యాసం 2.8 మీటర్లు. ఒకేసారి 1,750 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. భూమి నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్‌ సింక్రనస్‌ పోలార్‌ ఆర్బిట్‌కు చేరుకోగలదు. ఈ వాహక నౌక ఇస్రోకు ఎన్నో విజయాలు అందించి గెలుపు గుర్రంగా గుర్తింపు పొందింది. 2008లో చంద్రయాన్‌–1, 2013లో మార్స్‌ ఆర్బిటార్‌ స్పేస్‌క్రాఫ్ట్, 2023లో ఆదిత్య ఎల్‌1 మిషన్‌లను పీఎస్‌ఎల్‌వీ ద్వారానే ప్రయోగించారు. పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో ఇప్పటిదాకా చేపట్టిన 63 ప్రయోగాల్లో ఇది కేవలం మూడో వైఫల్యం. 1993 సెపె్టంబర్‌లో పీఎస్‌ఎల్‌వీ–డీ1 రాకెట్‌ ఐఆర్‌ఎస్‌–1ఈ ఉపగ్రహాన్ని, 2017 ఆగస్టులో పీఎస్‌ఎల్‌వీ–సీ39 రాకెట్‌ ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయాయి.

Rasi Phalalu: Daily Horoscope On 19-05-2025 In Telugu3
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.సప్తమి రా.1.34 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: శ్రవణం ప.3.54 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.7.51 నుండి 9.26 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు, అమృతఘడియలు: తె.5.14 నుండి 6.51 వరకు (తెల్లవారితే మంగళవారం); రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.31, సూర్యాస్తమయం: 6.21.మేషం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఊహించని ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.వృషభం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో మరింత ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.కన్య: కొన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. ఆలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు పనిభారం.తుల: మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ కొంత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.ధనుస్సు: పనుల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.మకరం: అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.కుంభం: మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత వ్యతిరేక పరిస్థితులు.మీనం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

Sakshi Editorial On Donald Trump4
ఇండియా ఇంత బలహీనమైనదా?

⇒ ప్రభుత్వం ప్రజలకు చెప్పకముందే, కాల్పుల విరమణ తనవల్లే జరిగినట్టుగా చెప్పి ట్రంప్‌ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి దౌత్య అనైతికతను ఈ దేశం ఎదిరించలేదా? ⇒అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల జీవితాలను ట్రంప్‌ ఛిన్నాభిన్నం చేశారు. అయినా భారత ప్రభుత్వం అమెరికాను నిలదీసింది లేదు. ⇒ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదు. అమెరికా మద్దతు లేకపోతే భారత దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది?ఈ మధ్య కాలంలో ప్రపంచం యుద్ధాల భూమిగా మారింది. గత నాలుగేళ్ళుగా ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఏడాదిన్నర నుండి ఇజ్రాయెల్‌ – పాలస్తీనా యుద్ధం భీకర నష్టానికి కారణమైంది. ఏప్రిల్‌ 22న అమా యక భారతీయులను కశ్మీర్‌లో టెర్రరిస్టులు దారుణంగా హత్య చెయ్యడంతో దేశం ఉడికిపోయింది. మే 7న పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపు మీద ఇండియా దాడి చేసింది. అది ఒక మినీ వార్‌కు దారి తీసింది. అందులో రెండు యుద్ధాలు టెర్రరిస్టులు అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడంతో మొదలయ్యాయి. ఒకటి భూభాగ సమస్యగా మొదలైంది.టెర్రరిజంపై యుద్ధాలుగత కొన్ని దశాబ్దాలుగా టెర్రరిస్టులు ప్లాన్‌ చేసి అమాయక ప్రజలను చంపడంతో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అవి దేశాలను సైతం ధ్వంసం చేయడానికి దారి తీస్తున్నాయి. ఇప్పుడు ఇండియా–పాకిస్తాన్‌ మధ్య అటువంటి టెర్రరిస్టు దాడి వల్ల నాలుగు రోజులు కాల్పులు జరిగాయి. చివరికి మే 12న విరమణ జరిగింది. అయితే దీన్ని ఇండియా–పాకిస్తాన్‌ అధికారులు ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అదీ యుద్ధం విరమించకపోతే ఈ రెండు దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండవని చెప్పాననీ, అందువల్ల వారు వెంటనే ఆపడానికి అంగీకరించారనీ అన్నారు. ఇది చాలా తీవ్రమైన ప్రకటన.అంతేకాదు, ఆ రెండు దేశాలు ఒక తటస్థ ప్రదేశంలో కశ్మీర్‌ సమస్యను చర్చించి, పరిష్కరించుకోవడానికి అంగీకరించారని కూడా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదాన్ని ఆపానని కూడా అన్నారు. ట్రంప్‌ ప్రకటనలు పాక్‌ కంటే ఎక్కువగా ఇండియాను ఇరకాటంలో పెట్టాయి. అయితే పాక్‌ కూడా ట్రంప్‌ మధ్యవర్తిత్వానికి పాకులాడి ఎందుకు లొంగిపోయిందని చైనా నిలదీస్తున్నది. చైనా పాకిస్తాన్‌కు చాలా ఆయుధాలను ఇచ్చిందనేది తెలిసిందే. ఈ నాలుగు రోజుల ఇండియా–పాకిస్తాన్‌ ఉద్రిక్తతలు... చైనా, యూరప్, అమెరికా ఆయు ధాల అమ్మకపు మార్కెట్‌ బలాబలాలను మార్చేసింది అనే చర్చ ప్రపంచమంతటా జరుగుతోంది.దౌత్య విలువలను మంటగలిపిన ట్రంప్‌ట్రంప్‌ భారత ప్రభుత్వానికి దగ్గరి మిత్రుడని బీజేపీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతూ వచ్చారు. కానీ ట్రంప్‌ రెండోసారి గెలిచాక భారత్‌ను అవమానపరిచే అనేక ప్రకట నలు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రధాని మోదీ వాషింగ్టన్‌ పర్యటనలో ఉండ గానే మన దేశ పౌరులను అక్రమ వలసదారులు అనే నెపంతో చేతు లకు బేడీలు వేసి, మిలిటరీ విమానంలో చండీగఢ్‌ విమానాశ్రయంలో వదిలారు.అలాగే ఇండియా–పాక్‌ రెండు దేశాలనూ అవమానపరిచేలా, ఆ యా ప్రభుత్వాలు ప్రజలకు చెప్పకముందే తాను చేయబట్టే యుద్ధం ఆగిపోతోంది అని ట్వీట్‌ చేశారు. ఇది అన్ని విధాలుగా అంతర్జాతీయ దౌత్య విలువలకూ, యుద్ధ నీతికీ వ్యతిరేకం. ఆ యా ప్రభుత్వాలు చెప్పాల్సిన విషయమది. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా దాన్ని ఆపేందుకు అటు ఐక్యరాజ్యసమితి(యూఎన్‌ఓ), లేదా ఇతర దేశాలు రాయబారాలు జరిపి రెండు దేశాలనూ ఒప్పించి యుద్ధం ఆగేట్లు చూడటం దౌత్య నీతిలో భాగమే.అందులో ఇండియా–పాక్‌ న్యూక్లియర్‌ ఆయుధాలు కలిగి ఉన్న దేశాలు కనుక ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధం ఆపాలని చూడటం అవసరం. కానీ మొన్న యూఎన్‌ఓ ఎక్కడా కనిపించలేదు. అది నిజానికి ఉక్రెయిన్‌ – రష్యా, ఇజ్రాయెల్‌ – పాలస్తీనా యుద్ధాలను ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, ఇండియా–పాక్‌ ఉద్రిక్తతల సమయంలో దాని ఉనికి కనిపించలేదు. యూరోపియన్‌ దేశాలు కూడా ఇండియా–పాక్‌ ఉద్రిక్తతలను ఇజ్రాయెల్‌–పాలస్తీనా యుద్ధంలాగా ఘోరంగా అమాయక ప్రజలను టెర్రరిస్టులు చంపడంతో మొదలైనా పెద్దగా పట్టించుకోలేదు. రష్యా కూడా బహిరంగంగా ఇండియాకు మద్దతు పలుకలేదు. చైనా, టర్కీ, ఇరాన్‌... పాకిస్తాన్‌కు అండగా ఉన్నాయనేది స్పష్టంగానే కనిపించింది.వీటన్నింటినీ మించి యూఎస్, ముఖ్యంగా ట్రంప్‌ పాత్ర అన్ని యుద్ధ సమయపు దౌత్య విలువలనూ నాశనం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ కొద్ది రోజుల ముందే ఇండియా వచ్చి మిత్రగానం చేసి ‘ఆ యుద్ధంలో జోక్యం చేసుకోవడం మా పని కా’దన్నాడు. కానీ పాక్‌కు 2.3 బిలియన్‌ డాలర్లు ఐఎంఎఫ్‌ ద్వారా ఇప్పించారు. పైగా ట్రంప్‌ కశ్మీర్‌ను మళ్ళీ చర్చల తెర మీదకి తెచ్చి ఒక తటస్థ స్థలంలో ‘వెయ్యి ఏండ్ల’ సమస్యగా ఉన్న కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తామనడం, కాల్పుల విరమణను వాణిజ్య లావా దేవీలతో ముడిపెట్టి ప్రకటించడం చూస్తే, అతిపెద్ద ప్రజాస్వా మ్యమైన భారతదేశాన్ని తన డొమినియన్‌ స్టేట్‌గా భావిస్తున్నట్టు కనబడుతుంది.ఈ ప్రశ్నలకు జవాబుందా?భారతదేశం నుండి అమెరికా వెళ్ళి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు. వారికి వర్క్‌ పర్మిట్‌లో 3–5 సంవత్సరాల వరకు వీసాలిచ్చి వారినందరినీ ట్రంప్‌ దిక్కులేని వారిగా చేశారు. అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతో! ఒక ప్రభుత్వ కాలంలో నిర్ణయాలు మార్చదల్చుకుంటే రాబోయే విద్యార్థులకు మార్చాలి. కానీ ఆయన గెలిచే నాటికే ఆ దేశంలో ఉన్న విద్యార్థుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. విచిత్రమేమంటే భారత ప్రభుత్వం వీటి మీద అంతర్జాతీయ విధానాలతో, చట్టపరమైన విధానాలతో అమెరికాను నిలదీసింది లేదు.పైగా కాల్పుల విరమణ పేరుతో ట్రంప్‌ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి డిప్లమాటిక్‌ ఇమ్మోరాలిటీని ఈ దేశం ఎదిరించ లేదా? భారతదేశం ఇంత బలహీనమైనదా? జాతీయవాదం, ఆత్మగౌరవం అని చెప్పే, బలమైన ఆర్థిక వ్యవస్థగా యుద్ధశక్తిగా ఎదుగుతున్నామని చెప్పే బీజేపీ/ఆరెస్సెస్‌ ట్రంప్‌కు ఎందుకు భయపడుతున్నాయి? అమెరికా మద్దతు లేకపోతే దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది? భారతదేశంలోని పెద్ద వ్యాపారులందరికీ అమెరికన్‌ ఆర్థిక పెట్టుబడులతో ఉన్న అనుబంధంతో ఈ స్థితి వచ్చిందా? అయినా ఈ సంక్షోభ సమయంలో అమెరికా, ముఖ్యంగా ట్రంప్‌ పాకిస్తాన్‌కే ఎక్కువ మేలు చేసినట్టు కనిపించింది కదా! టెర్రరిజాన్ని పోషించే పాక్‌కు ఇన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి అంటే అర్థమేమిటి?గత పదేళ్ళుగా బీజేపీ/ఆరెస్సెస్‌ గ్లోబల్‌ డిప్లమసీలో మన దేశాన్ని గొప్ప స్థానంలో పెట్టామని చెబుతూ వచ్చాయి కదా! అమెరికాలోని ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు ట్రంప్‌కు ఎంతో సపోర్టు చేస్తూ వచ్చాయి కదా! మరి ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదే! ఆఖరికి పాక్‌ అక్రమ వలసదారులకు కూడా ఆ స్థితి వచ్చిన దాఖలాలే లేవే! ఇప్పుడు బీజేపీ/ఆరెస్సెస్‌370 ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్‌ను సంపూర్ణంగా దేశంలో విలీనం చేశామని చెబుతుంటే ట్రంప్‌ ఆ సమస్యను మళ్ళీ ప్రపంచ సమస్య చేశారు కదా! ఇది కూడా ఆరెస్సెస్‌/బీజేపీ అనుకూల అంశమేనా? ఇది కూడా ఈ దేశ సమగ్రతను కాపాడే చర్చయేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడుప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌

Sakshi special story about Saraswati Pushkaralu in Telangana 20255
పుష్కర సరస్వతికి ప్రణామం

ప్రతి నదికి ఏడాదికి ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతిలో ఆయా రాశులు ప్రవేశించడంతో ఆ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈనెల 15న గురువారం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఉదయం 5.44గంటలకు సరస్వతినదికి పుష్కరాలు ఆరంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...సరస్వతీనది పుష్కరాలు ఉత్తరాదిలో నాలుగుచోట్ల, దక్షిణాది లో తెలంగాణలోని కాళేశ్వరంలో మాత్రమే జరుగుతున్నాయి. నది పుట్టినచోటుగా గుర్తించిన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని)నదులుగా భావించే ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లోని సోమనాథ్, రాజస్థాన్‌లోని పుష్కర్‌ వద్ద సరస్వతీనదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర స్నానం..పుణ్యఫలం..పుష్కర స్నానం... ఎంతో పుణ్య ఫలం. నది స్నానాలు చేస్తే మానవ జీవన గమనంలో తెలిసో, తెలియకో చేసిన పాపాలు తొలగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు..తర్పణలు, పిండప్రదానాలు..సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మ పిండప్రదాన కర్మలు చేసి పితృదేవతలను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం తొమ్మిదోరోజు అన్నశ్రాద్ధం. పన్నెండో రోజు ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు. పుష్కరకాల స్నానం..నీరు నారాయణ స్వరూపం. అందుకే ఆయన స్పర్శతో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. తీర్థ, నదీస్నానాలు ఉత్తమం. దానికన్నా పుష్కరస్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా వుష్కరుడితో నదిలో ప్రవేశిస్తారని విశ్వాసం. పుష్కరకాలంలో స్నానమాచరిస్తే 12 సంవత్సరాల కాలం 12 నదుల్లో స్నానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాల్లో లిఖించబడింది.నదికి వాయినాలు..సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు.12 రోజులు హోమాలు..మే 15 గురువారం శ్రీ దత్తా త్రేయ, శ్రీ కార్తవీర్యార్జున హోమం, 16న శుక్రవారం సంకష్ట హర గణపతి హోమం, 17న శనివారం శ్రీ హయగ్రీవ, శ్రీ స్వయంవర పార్వతి హోమం, 18న ఆదివారం శ్రీ పుత్ర కామేష్టి హోమం జరిగాయి. నేడు మేధా దక్షి ణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం, మంగళవారం కాలభైరవ హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం శ్రీ సూక్త హోమం, శుక్ర వారం పురుష సూక్త హోమం, శనివారం నవగ్రహ, శ్రీ మత్స్య హోమం, ఆదివారం శ్రీ రుద్రహోమం, 26, సోమవారం చండి హోమాలు నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. 12 రోజులు హారతి..12 రోజులపాటు సరస్వతిఘాట్‌ వద్ద కాశీకి చెందిన ఏడుగురు పండితులచే తొమ్మిది నవ రత్నమాలిక హారతులను ఇస్తున్నారు. హారతి వీక్షణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హారతి ఇవ్వడానికి ఏడు గద్దెలు ఏర్పాటు చేసి ఏడు జీవనదులు గంగా, యమున, గోదావరి, నర్మద, సింధు, సరస్వతి, కావేరి పేర్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల పుష్కర స్నానాలు..పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తున్నారు. పుష్కర ప్రారంభం మే 15న మొదటి రోజు శ్రీ గురుమద నానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్‌కు చెందిన మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. మూడవ రోజు మే 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకరభారతీ మహాస్వామి, నేడు నాసిక్‌ త్రయంబకేశ్వర్‌ మహామండలేశ్వర్‌ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివార్లు పుష్కర స్నానం ఆచరిస్తారు.17 అడుగుల ఏకశిల సరస్వతిమాత విగ్రహంసరస్వతి ఘాటులో 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో శిల్పులు ప్రత్యేకంగా రూపు దిద్దారు. ఆ విగ్రహం చుట్టూరా నాలుగు వేదమూర్తులయిన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సరస్వతినది పుష్కరాల సందర్భంగా 15న సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. – షేక్‌ వలీ హైదర్, సాక్షి, కాళేశ్వరం (భూపాలపల్లి జిల్లా)

Gold has emerged as one of the best-performing asset classes in 20256
మీ పెట్టుబడి బంగారం గాను!

ఒకవైపు ఈక్విటీలు, క్రిప్టోలు అస్థిరతలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో డిమాండ్‌ నీరసించింది. ఇదే కాలంలో బంగారం సైలెంట్‌గా ర్యాలీ చేయడం చూశాం. ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అన్ని కాలాల్లోనూ అత్యుత్తమైన పెట్టుబడి సాధనం ఏదంటే..? అది బంగారమే. ఈ అర్థంలోనే దీన్ని ‘గోట్‌ అసెట్‌’గా చెబుతారు. గడిచిన రెండేళ్లలోనే కాదు.. గత రెండు దశాబ్దాల్లోనూ ఈక్విటీలకు మించి రాబడులను అందించిన పసిడిని ప్రతీ ఇన్వెస్టర్‌ తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడం మంచి నిర్ణయంగా నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులకు రిస్క్‌ తగ్గించుకుని, వైవిధ్యం కోసం, రాబడుల స్థిరత్వం కోసం తప్పకుండా పుత్తడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనంటున్నారు.భారతీయుల్లో ఎక్కువ మంది బంగారాన్ని ఆభరణంగా, విలువైన సాధనంగానే చూస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో పెట్టుబడుల పరంగానూ బంగారానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అస్థిరతల్లో సురక్షిత సాధనంగా పసిడికి గుర్తింపు ఇప్పుడు వచ్చింది కాదు. చారిత్రకంగా ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే సెంట్రల్‌ బ్యాంక్‌లు (ఆర్‌బీఐ, ఇతరత్రా) రిజర్వ్‌ అసెట్‌గా బంగారానికి ఈ మధ్యకాలంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎడాపెడా కొనుగోలు చేస్తున్నాయి. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత పెరిగిపోవడం.. అంతర్జాతీయ వాణిజ్యం పరంగా రక్షణాత్మక ధోరణులు పెరిగిపోతున్న తరుణంలో పసిడి మరింత బలాన్ని సంతరించుకుంది. కనుక ప్రతి ఒక్కరి పెట్టుబడులకు పుత్తడి వన్నెతెస్తుందనేది నిపుణుల మాట. రాబడుల చరిత్ర.. గత 25 ఏళ్ల కాలంలో పసిడి ఎస్‌అండ్‌పీ 500తోపాటు నిఫ్టీ–50ని మించి రాబడులను ఇచ్చినట్టు ఈక్విటాస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చెబుతోంది. 2000 సంవత్సరం నుంచి చూస్తే బంగారం డాలర్‌ మారకంలో 10 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో ఎస్‌అండ్‌పీ 500 రాబడులు నాలుగున్నర రెట్లుగా ఉన్నాయి. రూపాయి మారకంలో చూసినా బంగారం గత 25 ఏళ్లలో 20 రెట్లు పెరగ్గా.. సెన్సెక్స్‌ ఇదే కాలంలో 16 రెట్లు ప్రతిఫలాన్నిచ్చింది. ఇక గత 15 ఏళ్లలో చూస్తే బంగారం ఏటా 12 శాతం రాబడులను సగటున ఇచ్చింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ రాబడి ఏటా 10–11 శాతం మధ్య ఉందన్నది ఈక్విటాస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విశ్లేషణ. ‘‘2000 నుంచి నిఫ్టీ కంటే బంగారమే అధిక రాబడిని ఇచ్చింది. గోల్డ్‌ సీఎఫ్‌డీలు (ఫ్యూచర్‌ కాంట్రాక్టులు) 2,000 శాతం పెరగ్గా.. నిఫ్టీ–50 సూచీ రాబడి 1470 శాతంగా ఉంది’’ అని జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో చేసిన పోస్ట్‌లో వివరించారు. పెట్టుబడిలో పుత్తడికి వాటా పెట్టుబడుల్లో వైవిధ్యం దృష్ట్యా కొంత మొత్తాన్ని పసిడిలోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్నది మెజారిటీ నిపుణుల సూచన. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో 10 నుంచి 15 శాతం వరకు బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ చిరాగ్‌ మెహతా సూచించారు. పసిడే కాదు, వెండి కూడా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేస్తుందని స్టాక్స్‌కార్ట్‌ (డిస్కౌంట్‌ బ్రోకర్‌) సీఈవో ప్రణయ్‌ అగర్వాల్‌ అభిప్రాయం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 5–8 శాతం వరకు పసిడి, వెండికి కేటాయించుకోవచ్చని సూచించారు. ‘‘బంగారం ఒక ప్రత్యామ్నాయ సాధనం. కొత్త రిజర్వ్‌ కరెన్సీ అని, డాలర్లను భర్తీ చేస్తుందని ఎక్కడో చదివాను. అదే జరిగితే రూ.90,000 ధరకు అర్థమే లేదు’’ అని మార్కెట్‌ నిపుణుడు సునీల్‌ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. రిజర్వ్‌ కరెన్సీగా మారితే అప్పుడు బంగారం ఇంకా పెరగొచ్చన్నది ఆయన ఉద్దేశం. ఆర్‌బీఐ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 2024 సెప్టెంబర్‌ చివరికి 9.32 శాతంగా ఉంటే, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కేంద్ర బ్యాంక్‌లు ఇదే మాదిరి బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి.అన్ని కాలాల్లోనూ అత్యుత్తమం ఎందుకు? సురక్షిత సాధనం: ఆర్థిక సంక్షోభాలు, అనిశి్చతులు, యుద్ధాల వంటి పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్‌ ఏర్పడుతుంది. ఆ సమయంలో ఇందులోకి అధిక పెట్టుబడులు రావడంతో పసిడి మరింత విలువను సంతరించుకుంటుంది. అలాంటి సంక్షోభాల్లో ఈక్విటీలు, రియల్‌ ఎస్టేట్‌ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులు అమ్మకాల ఒత్తిడికి గురవుతుంటాయి. తాజా డిమాండ్‌ వెనక్కి వెళుతుంది. స్టోర్‌ ఆఫ్‌ వ్యాల్యూ: పసిడిని బీరువాలో ఉంచినా.. బ్యాంక్‌ లాకర్లో ఉంచినా కొంత కాలానికి దాని విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. అందుకే దీనికి స్టోర్‌ ఆఫ్‌ వ్యాల్యూ గుర్తింపు. అదే మిగిలిన పెట్టుబడులకు ద్రవ్యోల్బణం సెగ ఉంటుంది. పరిమిత సరఫరా: బంగారం ఉత్పత్తి ఏటేటా పెరిగేది కాదు. బంగారం మైనింగ్‌ అత్యంత సంక్లిష్టమైనది. దీని సరఫరా స్థిరంగానే ఉంటుంది. కానీ, డిమాండ్‌ మాత్రం ఏటేటా పెరుగుతోంది. ఈ డిమాండ్‌ పసిడి ధరలకు మద్దతుగా నిలుస్తుంది. వైవిధ్యం: పెట్టుబడులు అన్నీ ఒకే చోట ఉంటే.. ఆ విభాగంలో సమస్యాత్మక పరిస్థితులు ఏర్పడితే.. విలువకు నష్టం కలుగుతుంది. అందుకే పెట్టుబడులకు వైవిధ్యం కూడా అవసరమే. ఈ విషయంలో పుత్తడి ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం. చిటికెలో రుణం: బంగారం కాయిన్లపై (బ్యాంకుల్లో కొనుగోలు చేసిన వాటికే ఇవ్వాలన్నది ఆర్‌బీఐ తాజా ప్రతిపాదన), ఆభరణాలపై 9–10 శాతం మేర వార్షిక వడ్డీపై బ్యాంకుల నుంచి సులభంగా రుణం లభిస్తుంది. పెట్టుబడి సాధనాలు.. బంగారంలో పెట్టుబడి భౌతికం కంటే డిజిటల్‌గానే సౌకర్యంగా ఉంటుంది. డిజిటల్‌ సాధనాల్లో గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. ఎంఎంటీసీ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు డిజిటల్‌ గోల్డ్‌ను రూపాయి నుంచి కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఇవి స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీ ట్రేడ్‌ అవుతుంటాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలే వీటిని నిర్వహిస్తుంటాయి. షేర్ల మాదిరే ఏ పనిదినంలో అయినా కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. డీమ్యాట్‌ ఖాతా అవసరం. ఇందులో పెట్టుబడి విలువపై ఫండ్‌ సంస్థకు ఎక్స్‌పెన్స్‌ రేషియో, కొనుగోలుపై బ్రోకర్లకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక గోల్డ్‌ ఈటీఎఫ్‌ ధర గ్రాము బంగారం మార్కెట్‌ ధరను ప్రతిఫలిస్తుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లను ఇప్పుడు చాలా సంస్థలు 0.01 గ్రాముల కింద ఆఫర్‌ చేస్తున్నాయి. కనుక రూ.90 నుంచి వీటిలో ఫ్రాక్షన్‌ యూనిట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లను నిర్వహించే సంస్థలు వాటి ఇష్యూ పరిమాణంకు అనుగుణంగా భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి భద్రపరుచుకోవడం తప్పనిసరి.గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఇవి ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. డీమ్యాట్‌ ఖాతాలేకపోయినా గోల్డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం సానుకూలత. బ్రోకర్ల సాయం లేకుండా ఫండ్స్‌ సంస్థ నుంచే కొనుగోలు చేస్తున్నందున బ్రోకరేజీ చార్జీలు పడవు. కాకపోతే ఇందులోనూ ఎక్స్‌పెన్స్‌ రేషియో చెల్లించాలి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సెబీ నియంత్రణల పరిధిలోకి వస్తాయి. కనుక పెట్టుబడులు సురక్షితం. ఉదాహరణకు ఎస్‌బీఐ గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్‌లో గత పదేళ్లలో రాబడి వార్షికంగా 12.66 శాతంగా ఉంది. నిప్పన్‌ ఇండియా గోల్డ్‌ ఈటీఎఫ్, ఎస్‌బీఐ గోల్డ్‌ ఈటీఎఫ్‌లు గత పదేళ్లలో 8.5–9.5 శాతం మధ్య రాబడిని ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో అయితే సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ద్వారా రూ.500 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పన్ను బాధ్యత → బంగారం కాయిన్లు, బిస్కెట్లు, ఆభరణాలు తదితర భౌతిక రూపంలోని బంగారాన్ని కొనుగోలు చేసి రెండేళ్ల తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం అవుతుంది. దీనిపై 12.5% పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం అవుతుంది. ఈ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి తమ మొత్తం ఆదాయానికి వర్తించే రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. పాత ఆభరణాన్ని కొత్త ఆభరణంతో మార్చుకుంటే అప్పుడు పాత బంగారాన్ని విక్రయించినట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక పాత ఆభరణంపై వచ్చిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. → డిజిటల్‌ గోల్డ్‌కూ భౌతిక బంగారానికి మాదిరే పన్ను రేట్లు వర్తిస్తాయని ట్యాక్స్‌మ్యాన్‌ డాట్‌ కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌ వాధ్వా తెలిపారు → గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు సైతం భౌతిక బంగారం నిబంధనలే వర్తిస్తాయి. → గోల్డ్‌ ఈటీఎఫ్‌లను ఏడాదిలోపు విక్రయిస్తే వచ్చిన స్వల్పకాల మూలధన లాభం వార్షిక ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. సమీప కాలంలో ధరలు ఎలా ఉండొచ్చు..? బంగారాన్ని స్వల్పకాల దృష్టితో కొనుగోలు చేయడం సూచనీయం కాదు. తమ అవసరాలు, పెట్టుబడుల కోణంలోనే దీర్ఘకాలానికి నిర్దేశిత పరిమితులకు లోబడి కొనుగోలు చేసుకోవాలి. కానీ, అమెరికా–చైనా మధ్య వాణిజ్య సయోధ్య, ఉక్రెయిన్‌–రష్యా మధ్య చర్చలకు సానుకూల త నేపథ్యంలో ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఔన్స్‌కు అంతర్జాతీయంగా 3,510 డాలర్ల వరకు వెళ్లిన బంగారం ధర 3,180 డాలర్లకు తగ్గింది.ఇప్పటికీ దీర్ఘకాలానికి బంగారం పట్ల నిపుణులు బుల్లిష్‌ ధోరణినే వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 30–40 రోజుల్లో ఔన్స్‌ బంగారం ధర 3,150 డాలర్ల స్థాయికి రావొచ్చన్నది మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ కమోడిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నవనీత్‌ దమాని అంచనా. దేశీయంగా 10 గ్రాములకు (24 క్యారెట్లు) రూ. 90,00–91,000 వరకు దిగిరావొచ్చన్నారు. 2,900–3,000 డాలర్ల స్థాయికి సైతం బంగారం అంతర్జాతీయ మార్కెట్లో తగ్గొచ్చని, కొంత కాలం స్థిరీకరణ చెందొచ్చన్న విశ్లేషణులు వినిపిస్తన్నాయి.భౌతిక బంగారం కొందరికి డిజిటల్‌ బంగారంలో పెట్టుబడి నచ్చకపోవచ్చు. భౌతికంగా చూసుకోవడమే ఇష్టం. అలాంటి వారు ఆభరణాలకు బదులు బ్యాంక్‌లు విక్రయించే కాయిన్లను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం అయితే జాగ్రత్త పరుచుకోవడం కొంత రిస్‌్కతో కూడినది. కనుక మొదటి ప్రాధాన్యం డిజిటల్‌ బంగారానికే ఇవ్వాలి. కాయిన్లు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తే విలువపై 3 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. అదే ఆభరణాలు అయితే జీఎస్‌టీకి అదనంగా తయారీ చార్జీల రూపంలో మరో 5–15 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. తిరిగి అవే ఆభరణాలను మార్చుకోవాలనుకుంటే, వాటిని గతంలో కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన తయారీ చార్జీలు, జీఎస్‌టీ మేర నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు పాత ఆభరణాలను కొత్త వాటితో మారి్పడి చేసుకున్నప్పటికీ.. కొత్త ఆభరణం బరువు ప్రకారమే విలువపై జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చుకున్న పాత బంగారం మేర జీఎస్‌టీకి మినహాయింపు లేదు. డిజిటల్‌ గోల్డ్‌ ఫోన్‌పే, పేటీఎం తదితర సంస్థలు డిజిటల్‌ గోల్డ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. రూపాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, మిగిలిన డిజిటల్‌ బంగారం సాధనాలు మాదిరిగా ఇవి సెబీ నియంత్రణలో పనిచేయవు. పైగా వీటి కొనుగోలు, విక్రయంపై చార్జీల విషయంలో పారదర్శకత లేదు. బంగారాన్ని ఇప్పుడు ఆభరణం కంటే ఎక్కువగా చూస్తున్నారు. సురక్షితమైన లిక్విడ్‌ అసెట్‌గా, అత్యవసరాల్లో హెడ్జింగ్‌గా పరిగణిస్తున్నారు. – పృద్వీ రాజ్‌ కొథారి, రిద్ధిసిద్ధి బులియన్స్‌ ఎండీభారతీయ గృహిణి అత్యంత తెలివైన ఫండ్‌ మేనేజర్‌ అనడానికి కాలక్రమంలో బంగారంపై రాబడే నిదర్శనం.– ఉదయ్‌ కోటక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఫౌండర్‌ – సాక్షి, బిజినెస్‌డెస్క్‌

IPL 2025: Punjab kings Qualify for IPL Playoffs After 11 Long Years7
IPL 2025: పంజాబ్‌ 11 ఏళ్ల తర్వాత... 

జైపూర్‌: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌ టోర్నిలో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ‘ప్లే ఆఫ్స్‌’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు నెగ్గడంతో... పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్‌’ బెర్త్‌ ఖరారైంది. చివరిసారి పంజాబ్‌ కింగ్స్‌ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరింది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్‌ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (30 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్‌ జురేల్‌ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్‌), వైభవ్‌ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3 వికెట్లు తీశాడు. ధనాధన్‌ ఆరంభం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్‌ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్‌ను వైభవ్‌ బౌండరీ, రెండు సిక్స్‌లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్‌ 50 స్కోరు చేసేసింది. వైభవ్‌ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్‌లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్‌ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్‌ (20), పరాగ్‌ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్‌ జురేల్‌ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్‌ బౌలర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌ కీలక వికెట్లను తీసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్‌‡్ష (సి) హెట్‌మైర్‌ (బి) తుషార్‌ 9; ప్రభ్‌సిమ్రన్‌ (సి) సామ్సన్‌ (బి) తుషార్‌ 21; ఒవెన్‌ (సి) సామ్సన్‌ (బి) క్వెనా మఫాక 0; నేహల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) ఆకాశ్‌ 70; శ్రేయస్‌ (సి) జైస్వాల్‌ (బి) పరాగ్‌ 30; శశాంక్‌ (నాటౌట్‌) 59; అజ్మతుల్లా (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. బౌలింగ్‌: ఫజల్‌హక్‌ 3–0–39–0, తుషార్‌ దేశ్‌పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్‌ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్‌ మధ్వాల్‌ 4–0–48–1. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఒవెన్‌ (బి) హర్‌ప్రీత్‌ 50; వైభవ్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) హర్‌ప్రీత్‌ 40; సామ్సన్‌ (సి) యాన్సెన్‌ (బి) అజ్మతుల్లా 20; పరాగ్‌ (బి) హర్‌ప్రీత్‌ 13; జురేల్‌ (సి) ఒవెన్‌ (బి) యాన్సెన్‌ 53; హెట్‌మైర్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్‌) 7; హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) యాన్సెన్‌ 0; క్వెన మఫాక (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–60–0, యాన్సెన్‌ 3–0–41–2, బార్ట్‌లెట్‌ 1–0–12–0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4–0–22–3, చహల్‌ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2.

Stock markets will be mainly driven by quarterly earnings by corporates for this week8
ప్రపంచ పరిణామాలే దిక్సూచి

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ వారంలో మన స్టాక్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందాలపై తాజా సమాచారం, ప్రపంచ మార్కెట్లపై అది చూపే ప్రభావాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ’భారత్‌–పాకిస్తాన్‌ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్‌లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారత్‌–అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంది. ఇది మార్కెట్‌ సెంటిమెంట్‌పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చు’ అని మాస్టర్‌ ట్రస్ట్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ పునీత్‌ సింఘానియా అభిప్రాయపడ్డారు. దేశీ పరిణామాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెలువడే కీలక ఆర్థిక గణాంకాలు కూడా మన మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. అమెరికా వస్తువులపై టారిఫ్‌లను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్‌ సుముఖంగా ఉందని యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పేర్కొనడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుందని కూడా ఆయన తాజాగా చెప్పారు.కీలక ఫలితాలు... ఈ వారంలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్, హిందాల్కో, ఓఎన్‌జీసీ, సన్‌ ఫార్మా, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ తదితర కీలక కంపెనీలు క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. స్వల్పకాలానికి మన మార్కెట్‌ ట్రెండ్‌ను ఇవి నిర్దేశించే అవకాశం ఉంది. ‘ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన ప్రధాన ఈవెంట్‌లు ఏవీ లేనందున ఇన్వెస్టర్ల దృష్టి మళ్లీ దేశీ కంపెనీల ఫలితాలపై ఉంటుంది. అలాగే కీలక ఆర్థిక గణాంకాలను కూడా నిశితంగా ట్రాక్‌ చేస్తారు. ప్రపంచ ట్రేడ్‌ డీల్స్‌పై అప్‌డేట్‌లు, ప్రపంచ మార్కెట్లు వాటికి ఎలా స్పందిస్తాయనేది కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారు’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌) అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీకి దన్నుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణి కూడా మార్కెట్‌ గమనంపై ప్రభావం చూపుతుంది’ అని మిశ్రా వ్యాఖ్యానించారు. ‘అమెరికా–చైనా మధ్య ట్రేడ్‌ డీల్, ఇండో–పాక్‌ ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ప్రపంచ వాణిజ్య రంగంలో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పుంజుకోవడానికి ఇది దోహదం చేస్తుంది’ అని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. గతవారం ఇలా.. విదేశీ ఇన్వెస్టర్ల జోరు నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ తాజా ర్యాలీ గత వారంలో కూడా కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2,876 పాయింట్లు (3.61 శాతం) దూసుకెళ్లి 82,331 వద్ద స్థిరపడింది. ఇకఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,012 పాయింట్లు (4.21 శాతం) జంప్‌ చేసి 25,020 వద్ద ముగిసింది.విదేశీ ఇన్వెస్టర్ల క్యూ... ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలఉ శాంతిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడుల బాట పడుతున్నారు. దేశీయంగా కూడా ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడుతుండటం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తాజా ర్యాలీ కొనసాగుతోంది. మే నెలలో ఇప్పటిదాకా (16 నాటికి) దేశీ ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ.18,620 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో భారీగా అమ్మకాలకు దిగిన ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో తొలిసారి మళ్లీ నికర పెట్టుబడులు (రూ.4,223 కోట్లు) పెట్టడం తెలిసిందే. జనవరిలో ఏకంగా రూ.78,027 కోట్లు, మార్చిలో రూ.34,574 కోట్లు, మార్చిలో రూ.3,973 కోట్ల చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఏప్రిల్‌ మధ్య నుంచి మళ్లీ పెట్టుబడుల రూట్‌లోకి వచ్చిన ఎఫ్‌పీఐల దన్నుతో మార్కెట్లు కూడా యూ టర్న్‌ తీసుకుని దూసుకెళ్తున్నాయి. మొత్తంమీద మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పుంజుకోవడానికి ఇది దారితీస్తోంది.

Kurnool Womens Serious Warning to Chandrababu Over TDP Aadabidda Nidhi Scheme9
ఆడబిడ్డలకు ద్రోహం

కర్నూలు (టౌన్‌)/ కాకినాడ రూరల్‌: ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని సమాధి చేశారని మహిళలు మండిపడ్డారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌ నుంచి వైఎస్సార్‌ సర్కిల్‌ వరకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్‌.. డౌన్‌.. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలను నమ్మించి మోసం చేశారని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసం సూపర్‌ సిక్స్‌ హమీలు ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక కూటమి పార్టీల పెద్దలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారన్నారు. ఆ మేరకు కూటమి మేనిఫెస్టోలోనూ పెట్టారన్నారు. తీరా ఇప్పుడు సీఎం చంద్రబాబు తన కర్నూలు పర్యటనలో.. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు.2029 నాటికి కూడా పేదరికం తగ్గకపోతే అప్పుడు పీ–4 పథకానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని అనుసంధానం చేస్తానని చెప్పడం మరోసారి మహిళలను దగా చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి భారతి, కర్నూలు నగర మహిళ నాయకులు మంగమ్మ, 43వ వార్డు కార్పొరేటర్‌ మునెమ్మ, కర్నూలు నియోజకవర్గ ఆంగన్‌వాడీ మహిళ నాయకురాలు రాధికమ్మ తదితరులు పాల్గొన్నారు.సూపర్‌ మోసం కూటమి ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు మహిళలకు శాపంగా మారాయని, ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్‌ మోసాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాకినాడ 49వ డివిజన్‌లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని సూపర్‌ సిక్స్‌ హామీల కింద పెట్టి.. ఇప్పుడు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని.. ఆ పథకం అక్కర్లేదని సీఎం చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు మహిళల్లో కనిపించిన పేదరికం.. అధికా­రం చేపట్టగానే మాయమైందా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన వేల కోట్ల రూపాయలతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Former terrorists links join Trump Religious Freedom Advisory board10
ట్రంప్‌ సలహా సంఘంలో మాజీ ఉగ్రవాదులు

వాషింగ్టన్‌: కరడుగట్టిన అల్‌కాయిదా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన మాజీ ఉగ్రవాదులకు ఏకంగా అమెరికా అధ్యక్షుని సలహా సంఘంలో చోటు దక్కింది! వారిలో ఒకరు ఉగ్రవాదం, సంబంధిత కేసుల్లో దోషిగా జైలుశిక్ష అనుభవించి విడుదలైన ఇస్మాయిల్‌ రాయర్‌ కాగా మరొకరు హమాస్, ముస్లిం బ్రదర్‌హుడ్‌లతో సంబంధాలున్న మాజీ ఉగ్రవాది షేక్‌ హమ్జా యూసుఫ్‌. వారిని రిలీజియస్‌ లిబర్టీ కమిషన్‌ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ లే లీడర్స్‌లో సభ్యులుగా ట్రంప్‌ సర్కారు ఎంపిక చేసింది. వారిద్దరూ అమెరికాలో ఇస్లామిక్‌ బోధనల్లో ప్రముఖులుగా మంచిపేరు తెచ్చుకున్నారని చెప్పుకొచి్చంది. కరడుగట్టిన ఉగ్ర చరిత్ర ఉన్న మాజీలను సలహా సంఘంలోకి కూర్చోబెడతారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌ రెండో హయాంలో అమెరికాలో నెలకొన్న అవ్యవస్థకు ఇది మరో నిదర్శనమంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ సలహా సంఘం మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అధ్యక్షుడికి సలహాలిస్తుంది.ఎవరీ ఇస్మాయిల్‌? ఇతను అమెరికా జాతీయుడు. అసలు పేరు ర్యాండల్‌ టోడ్‌ రాయర్‌. 1992లో ఇస్లాం స్వీకరించి ఇస్మాయిల్‌గా పేరు మార్చుకున్నాడు. లష్కరే తోయిబా, ఈజిప్‌్టలోని ముస్లిం బ్రదర్‌హుడ్, ‘వర్జీనియా జిహాద్‌ నెట్‌వర్క్‌’, పాలస్తీనాలోని హమాస్‌ ఉగ్ర సంస్థతో సత్సంబంధాలున్నాయి. ప్రత్యేక ఉగ్రశిక్షణ కోసం 2000లో పాక్‌ వెళ్లాడు. అమెరికాపై యుద్ధం కోసం పలువురికి ఉగ్ర తర్ఫీదు ఇచ్చేలా ప్రణాళికలు వేశాడు. జమ్మూ కశీ్మర్‌లో సైనిక స్థావరాలపై రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రనేడ్‌ దాడికి సహచర ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చాడు. అల్‌ఆయిదా, లష్కరేలకు సాయపడ్డ నేరానికి 2003లో ఇస్మాయిల్‌పై కేసు నమోదైంది. దోషిగా తేలడంతో 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డా స్రత్పవర్తన కారణంగా 2017లో విడుదలయ్యాడు. అమెరికాలోని రిలీజియస్‌ ఫ్రీడం ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్టర్‌గా ఉన్నాడు.ఎవరీ షేక్‌హమ్జా యూసుఫ్‌? అమెరికాలో తొలి ముస్లిం లిబరల్‌ ఆర్ట్స్‌ కాలేజీ అయిన జేతునా కాలేజ్‌ సహవ్యవస్థాపకుడు. ఈ కాలేజీలో షరియా చట్టాలను బోధిస్తారు. యూసుఫ్‌కు ముస్లిం బ్రదర్‌హుడ్, హమాస్‌లతో లింకులున్నట్టు తేలింది. వాటితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిన్తున్నట్టు చెబుతారు. ఇతని బోధనలకు పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులైనట్టు స్పష్టమైంది. అమెరికా జాత్యహంకార దేశమంటూ వ్యాఖ్యలు చేశాడు. 1990ల నాటి శకంలో న్యూయార్క్‌ బాంబు దాడుల కేసు నిందితుడు షేక్‌ ఒమర్‌ అబ్దుల్‌ రహా్మన్‌పై దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించాడు. అమెరికా పోలీస్‌ ఉన్నతాధికారిని హత్య చేసిన జమీల్‌ అల్‌ అమీన్‌ అనే వ్యక్తికి మద్దతుగా యూసుఫ్‌ ప్రసంగించాడు. తర్వాత రెండు రోజులకే అమెరికాపై 9/11 దాడి జరిగింది. దాంతో అతన్ని ఎఫ్‌బీఐ విచారించింది. ముస్లిం దేశాల్లో అత్యంత ప్రముఖ ఇస్లామిక్‌ విద్యావేత్తగా పేరొందాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement