Spinner Pragyan Ojha
-
ఆస్ట్రేలియా ‘ఎ’ 185/4
చెన్నై: హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (3/52) భారత ‘ఎ’ జట్టులో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికార టెస్టులో స్పిన్ మ్యాజిక్‌తో మూడు వికెట్లు తీసి కంగారులను కట్టడి చేశాడు. దీంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. హ్యాండ్స్కాంబ్ (137 బంతుల్లో 75 బ్యాటింగ్; 6 ఫోర్లు), స్టోనిస్ (87 బంతుల్లో 42 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కంగారులు ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉన్నారు. బాంక్రాఫ్ట్ (2), మాడిన్సన్ (0) విఫలమయ్యారు. ఓ మోస్తరుగా ఆడిన ఉస్మాన్ ఖాజా (25), హెడ్ (31)లు రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఓ దశలో 57/1 స్కోరుతో ఉన్న ఆసీస్... ఓజా దెబ్బకు 23 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకుని 75/4గా మారింది. అయితే హ్యాండ్స్కాంబ్, స్టోనిస్‌లు ఐదో వికెట్‌కు అజేయంగా 110 పరుగులు జోడించడంతో కోలుకుంది. అంతకుముందు 221/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 114.3 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. శంకర్ (51 నాటౌట్), అమిత్ మిశ్రా (27) మినహా లోయర్ ఆర్డర్లో మిగతా వారు నిరాశపర్చారు. -
ఓజా బౌలింగ్‌పై నిషేధం
ముంబై: భారత క్రికెటర్, హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. అనుమానాస్పద బౌలింగ్ శైలి కారణంగా అతన్ని మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయకుండా అడ్డుకుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) విజ్ఞప్తి మేరకు చెన్నైలోని ఐసీసీ గుర్తింపు సెంటర్లో ఓజా బౌలింగ్ శైలిని పరీక్షించారు. స్పిన్నర్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఈ పరీక్షలో తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతులు విసిరేటప్పుడు బౌలర్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచరాదు. ఓజా దీన్ని ఉల్లంఘించడంతో బోర్డు చర్యలు తీసుకుంది. యాక్షన్‌ను సరి చేసుకునేంత వరకు ఓజాతో బౌలింగ్ చేయించొద్దని శుక్రవారం ఓ లేఖ ద్వారా హెచ్‌సీఏకు తెలియజేసింది. దీంతో సర్వీసెస్‌తో ఆదివారం ప్రారంభంకానున్న రంజీ మ్యాచ్ నుంచి స్పిన్నర్‌ను తప్పించారు. దాదాపు ఏడాది కాలంగా ఓజా బౌలింగ్ శైలిపై బోర్డు కన్నేయడంతో టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు తీసిన జాబితాలో ఉన్నా... జాతీయ సెలక్టర్లు అతనిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. మరోవైపు ఓజా బౌలింగ్ యాక్షన్‌ను సమీక్షించాలని హెచ్‌సీఏ కోరలేదని సంయుక్త కార్యదర్శి పురుషోత్తం అగర్వాల్ స్పష్టం చేశారు. బోర్డు నుంచి లేఖ అందిందని ధ్రువీకరించారు. ఓజాను బౌలింగ్ నుంచి తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసిందని హైదరాబాద్ రంజీ జట్టు కోచ్ అబ్దుల్ అజీమ్ అన్నారు.