
ఓజా బౌలింగ్‌పై నిషేధం
ముంబై: భారత క్రికెటర్, హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. అనుమానాస్పద బౌలింగ్ శైలి కారణంగా అతన్ని మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయకుండా అడ్డుకుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) విజ్ఞప్తి మేరకు చెన్నైలోని ఐసీసీ గుర్తింపు సెంటర్‌లో ఓజా బౌలింగ్ శైలిని పరీక్షించారు. స్పిన్నర్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఈ పరీక్షలో తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతులు విసిరేటప్పుడు బౌలర్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచరాదు.
ఓజా దీన్ని ఉల్లంఘించడంతో బోర్డు చర్యలు తీసుకుంది. యాక్షన్‌ను సరి చేసుకునేంత వరకు ఓజాతో బౌలింగ్ చేయించొద్దని శుక్రవారం ఓ లేఖ ద్వారా హెచ్‌సీఏకు తెలియజేసింది. దీంతో సర్వీసెస్‌తో ఆదివారం ప్రారంభంకానున్న రంజీ మ్యాచ్ నుంచి స్పిన్నర్‌ను తప్పించారు. దాదాపు ఏడాది కాలంగా ఓజా బౌలింగ్ శైలిపై బోర్డు కన్నేయడంతో టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు తీసిన జాబితాలో ఉన్నా... జాతీయ సెలక్టర్లు అతనిపై పెద్దగా దృష్టిపెట్టలేదు.
మరోవైపు ఓజా బౌలింగ్ యాక్షన్‌ను సమీక్షించాలని హెచ్‌సీఏ కోరలేదని సంయుక్త కార్యదర్శి పురుషోత్తం అగర్వాల్ స్పష్టం చేశారు. బోర్డు నుంచి లేఖ అందిందని ధ్రువీకరించారు. ఓజాను బౌలింగ్ నుంచి తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసిందని హైదరాబాద్ రంజీ జట్టు కోచ్ అబ్దుల్ అజీమ్ అన్నారు.