సభ వాయిదా అనైతిక చర్య
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల
గుంటూరు వెస్ట్ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రై వేట్ బిల్లుపై సభలో చర్చ జరగకుండా బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ శనివారం గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు సీపీఐ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ బిల్లు విజయం సాధిస్తుందని భావించి సభ జరగకుండా వాయిదా వేయడం అనైతిక చర్యగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, బీజేపీకి చెందిన రాష్ట్ర నాయకులు అందరూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రత్యేక హోదా సాధించడం ద్వారానే రాష్ట్రాభివద్ధి సాధ్యమన్నారు. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఏపీకి ప్యాకేజీలు వద్దని హోదా కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సురేష్, నూతలపాటి చిన్న, అమీర్వలి, కుమార్నాయక్ తదితరులు పాల్గొన్నారు.