హీరో స్ల్పెండర్లో కొత్త వేరియంట్
♦ ఐస్మార్ట్ 110 ః రూ.53,300
♦ కంపెనీ సొంతంగా డిజైన్ చేసి,
♦ డెవలప్ చేసిన తొలి బైక్
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కంపెనీ తొలిసారిగా సొంతంగా డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన స్ప్లెండర్ కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధర రూ.53,300(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించామని హీరో మోటొకార్ప్ తెలిపింది. జైపూర్‌లో ఉన్న సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో ఈ బైక్ డిజైనింగ్, అభివృద్ధి జరిగిందని హీరో మోటోకార్ప్ చైర్మన్, ఎండీ, సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. పూర్తిగా కొత్త చాసిస్, ఫ్రేమ్, కొత్త బ్రాండ్ ఇంజిన్‌తో ఈ బైక్‌ను రూపొందించామని పేర్కొన్నారు. గతంలో తమ భాగస్వామి హోండాకు చెందిన ఎలాంటి సాంకేతిక అంశాన్ని ఈ బైక్ తయారీలో ఉపయోగించుకోలేదని పేర్కొన్నారు.
బీఎస్ఫోర్ ఇంజిన్..
భారత్ స్టేజ్ ఫోర్ పర్యావరణ నియమనిబంధనలకనుగుణంగా తయారైన కొత్త ఇంజిన్‌తో ఈ కొత్త బైక్‌ను రూపొందించామని ముంజాల్ తెలిపారు. ఈ సెగ్మెంట్ బైక్‌ల్లో ఈ ప్రత్యేకత ఉన్న బైక్ ఇదొక్కటేనని పేర్కొన్నారు. ఈ బైక్ పాత స్ప్లెండర్ కంటే 9 శాతం ఎక్కువ పవర్‌ను, 12 శాతం అధిక టార్క్‌ను ఇస్తుందని వివరించారు. 60 కిమీ. వేగాన్ని 7.45 సెకన్లలోనే అందుకునే ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 87కిమీ. అని తెలిపారు.
ఈ బైక్‌లో 110 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 4 గేర్లు, కొత్త అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఐత్రిఎస్(ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్-ఇంజిన్ న్యూట్రల్‌కు వచ్చి పది సెకన్లు పూర్తికాగానే ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. క్లచ్ లాగితే మళ్లీ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది) టెక్నాలజీతో బైక్‌ను రూపొందించామని ముంజాల్ తెలిపారు. మైలేజీ లీటర్‌కు 75-80 కిమీ. వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.