ఇంకెప్పుడిస్తారో?
– స్ప్రేయర్లు లేవు, టార్పాలిన్లు ఇవ్వలేదు
– రూ.1.25 కోట్లు బడ్జెట్ ఖర్చు చేయని వైనం
– రబీ వచ్చినా అందకపోవడంతో ఇబ్బందులు
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ ప్రారంభమైనా రైతులకు స్ప్రేయర్లు లేవు.. టార్పాలిన్లు ఇవ్వలేదు. యాంత్రీకరణ పథకం కింద రూ.20 కోట్ల బడ్జెట్తో మినీట్రాక్టర్లు, ఇతరత్రా యంత్రోపకరణాలు ఇస్తున్నామని అధికారులు గొప్పగా చెబుతున్నా అత్యవసరమైన వివిధ రకాల స్ప్రేయర్లు, చిన్నపాటి టార్పాలిన్లు పంపిణీ చేయకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. రైతుకు పెద్ద పీట వేస్తామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం అమలులో మాత్రం విఫలమవుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు కూడా పాలకుల దారిలో నడుస్తూ సకాలంలో పథకాలు సక్రమంగా అమలు చేయలేక చతికిల పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 8 నుంచి 9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వర్షాధారంగా ఖరీఫ్ పంటలు వేస్తారు. మెట్ట వ్యవసాయానికి చిరునామాగా ఉన్న ‘అనంత’ రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఏటా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
స్ప్రేయర్లు అత్యవసరం :
ట్రాక్టర్లు ఇతరత్రా పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నా లేకున్నా జిల్లాలో పంట కాలంలో రైతు ఇంట స్ప్రేయర్లు, పంట తొలగింపు, నూర్పిడి సమయంలో టార్పాలిన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. 6.09 లక్షల హెక్టార్లలో వేరుశనగ, మరో 1.50 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేశారు. వేరుశనగ, ప్రత్తి, ఆముదం, కంది, పెసర లాంటి పంటలకు తరచూ పురుగు మందులు పిచికారీ చేస్తే కానీ పెట్టుబడులు దక్కించుకోలేని పరిస్థితి.
తెగుళ్లు అధికం :
‘అనంత’లో వాతావరణానికి చీడపీడలు, తెగుళ్ల వ్యాప్తి కూడా ఎక్కువే. ఈ క్రమంలో రైతు ఇంట ఏదీ లేకున్నా ఫరవాలేదు కానీ స్ప్రేయర్లు మాత్రం ఉంటాయి. అయితే వ్యవసాయశాఖ అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా స్ప్రేయరు, టార్పాలిన్ మంజూరు చేయలేదు. రెండు పథకాల కింద అక్షరాలా రూ.1.25 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినా అందులో పైసా కూడా వెచ్చించలేదు. 7.65 లక్షల హెక్టార్లలో వేసిన ఖరీఫ్ ఇప్పటికే ముగిసింది. ఇపుడు రబీలో అడుగుపెట్టారు. ఇప్పటికీ కూడా వాటిని రైతులకు పంపిణీ చేస్తామనే ఆలోచన చేయకపోవడం గమనార్హం.
అధికారులు ఏమంటున్నారంటే.. :
స్ప్రేయర్లకు సంబంధించి ఇంకా ధరలు, రాయితీలు తమకు అందలేదంటూ చేతులెత్తేస్తున్నారు. టార్పాలిన్లకు సంబంధించి గతేడాది బిల్లులు పెండింగ్లో ఉన్నందున ఆలస్యమవుతోందని చెబుతున్నారు. వాటి కోసం వేలాది మంది రైతులు కళ్లకు కాయలు కట్టేలా ఎదురుచూస్తూ విసిగిపోతున్నారు. పుణ్యకాలం దాటిన తర్వాత ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు వాపోతున్నారు.