ఆరోపణలపై ఆగ్రహం
= హిరేమఠ్‌పై ‘హక్కుల’ తీర్మానం
= రమేశ్‌పై ఆరోపణలకు ప్రతిఫలం
= దర్వాప్తు నివేదిక త్వరగా ఇవ్వాలని కమిటీకి సూచిస్తానన్న స్పీకర్
= అసెంబ్లీలో రమేశ్ భావోద్వేగ ప్రసంగం
= విమర్శించడానికి హిరేమఠ్ ఎవరంటూ ధ్వజం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : హుబ్లీకి చెందిన సమాజ పరివర్తన సముదాయం అధ్యక్షుడు, సామాజికవేత్త ఎస్ఆర్. హిరేమఠ్, మాజీ స్పీకర్, కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్‌పై చేసిన ఆరోపణల పట్ల శాసన సభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బెల్గాంలో జరుగుతున్న శాసన సభ శీతాకాల సమావేశాల్లో సోమవారం రమేశ్ కుమార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. తనను కళంకిత ఎమ్మెల్యే అని ఆయన ఆరోపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై సత్యసత్యాలను కనుగొని నివేదిక సమర్పించడానికి సభా హక్కుల కమిటీకి నివేదించాలని తీర్మానించారు.
త్వరగా దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా కమిటీకి సూచిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం రమేశ్ కుమార్ తనపై హిరేమఠ్ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. తనను రాజకీయంగా అంతమొందించాలనే కుట్రతో ఇలాంటి ఆరోపణలు చేయడం తనకు బాధను కలిగించిందని వాపోయారు. స్పీకర్ తమ రక్షణకు రావాలని, ఈ అంశాన్ని సభా హక్కుల సంఘానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర జోక్యం చేసుకుని ఈ అంశాన్ని సభా హక్కుల సంఘానికి నివేదించడమే ఉత్తమమని పేర్కొనడంతో స్పీకర్ కూడా సమ్మతించారు.
అంతకు ముందు రమేశ్ కుమార్ భావోద్వేగంతో ప్రసంగించారు. ఎమ్మెల్యే కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. తనను కళంకితుడు అనడానికి హిరేమఠ్ గవర్నర్ లేదా ముఖ్యమంత్రి లేదా రాష్ట్రపతి కారని దెప్పి పొడిచారు. ఎన్నికల కమిషన్ కూడా కాదన్నారు. ఒక వేళ తాను కళంకితుడినై ఉంటే ప్రజలు ఈ సభకు ఎందుకు పంపుతారని ప్రశ్నించారు. రాష్ర్టంలోని ఏ కోర్టులోనూ తనపై కేసులు లేవని తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే, తనపై ఆరోపణలు చేయడానికి ఆయనెవరని ప్రశ్నించారు. తనను సమాజం నుంచి బహిష్కరించాలని కూడా అన్నారని వాపోయారు.