SR Kalyana Mandapam Movie
-
ఓటీటీకి ఎస్ఆర్ కల్యాణమండపం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’. శ్రీధర్ దర్శకత్వంలో ప్రమోద్-రాజ్‌లు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడదులై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ అనంతరం తెరుచుకున్న థియేటర్లకు తొలి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించింది. మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తున్న తరుణంలో ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిందని చెప్పుకొవచ్చు. విడుదలైన వారం రోజుల్లోనే ఈ మూవీ 7 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా భారీ ఢీల్కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలో వచ్చే అవకాశం ఉందట. (చదవండి: ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మూవీ రివ్యూ) ఈ సినిమా.. విడుదలైన దాదాపు మూడు వారాలకే ఓటీటీలో విడుదల కావడం విశేషం. సిల్వర్ స్క్రీన్‌పై కాసుల వర్షం కురింపించిన ఎస్ఆర్ కల్యాణ మండపం మరి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుంది, ఓటీటీలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కిరణ్ అబ్బవరమే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించాడు. ఇందులో సీనియర్ నటుడు సాయికుమార్-తులసిలు కీలక పాత్రలు పోషించారు. -
Kiran Abbavaram: ఆర్కే బీచ్‌లో కూర్చునే కథ రాశాను
సాక్షి, విశాఖపట్నం:ఆర్.కె.బీచ్‌లో కూర్చునే ఎస్.ఆర్.కల్యాణ మండపం కథా రాశానని చిత్రం హీరో, రచయిత కిరణ్ అబ్బవరం వెల్లడించారు. నగరంలో మెలోడి థియేటర్లో ఆదివారం చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఎస్ఆర్ కల్యాణ మండపం రూపొందించామన్నారు. ఈ చిత్రానికి ఆశించిన దానికంటే అద్భుత విజయం అందించిన ప్రేక్షకుల మేలు మరువలేనిదన్నారు. సంపాదిస్తే తండ్రికి ఎంతోవిలువ, గౌరవం ఉంటుందని, లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించామన్నారు. సీనియర్ నటుడు సాయికుమార్ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచిందన్నారు. చిత్రంలో చివరి 20 నిమిషాలు ప్రేక్షకులు చాలా ఎమోషనల్‌కు గురవుతున్నారన్నారు. గాయత్రి దేవి ఫిల్మ్స్ అధినేత సతీష్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, నైజాం, కర్నాటక కలిసి 500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో సహ నిర్మాత, నటుడు భరత్ రొంగలి, మెలోడి థియేటర్ ప్రతినిధులు గౌరి, రమణ పాల్గొన్నారు. చదవండి: ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మూవీ రివ్యూ -
కలెక్షన్లలో దూసుకెళ్తున్న ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’, ఎంతంటే..
SR Kalyana Mandapam Collections: కిరణ్ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్ జంటగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 6న విడుదలై మిక్స్డ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇందులోని పాటలు యూత్‌ని బాగా అట్రాక్ట్ చేశాయి. దీంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ మూవీ అన్ని ఏరియాల్లోనూ భారీ ధరకు అమ్ముడు పోయింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ.4.55 కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.80కోట్లుగా ఫిక్సైంది. అంచనాలకు తగ్గట్టే.. సినిమా విడుదలైన తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.41 కోట్లు, రెండో రోజు రూ. 1.25 కోట్లు, మూడో రోజు రూ. 1.40 కోట్లు, నాలుగో రోజు రూ. 74 లక్షలు వసూలు చేసింది. ఫలితంగా మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్ స్టేటస్‌ను అందుకుని రికార్డు సృష్టించింది. ఇక ఐదో రోజు దాదాపు రూ.60లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఎస్ ఆర్ కల్యాణ మండపం ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి రూ.5.40 కోట్లు షేర్‌తో పాటు 8.74కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. -
‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఎస్ఆర్ కళ్యాణ మండపం నటీనటులు : కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తదితరులు నిర్మాణ సంస్థ : నిర్మాతలు : ప్రమోద్, రాజు దర్శకత్వం: శ్రీధర్ గాదె సంగీతం : చైతన్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డానియల్ విడుదల తేది : ఆగస్ట్ 6,2021 SR Kalyana Mandapam Review In Telugu: ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’డిఫరెంట్ టైటిల్‌తో వచ్చాడు. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయికుమార్ కీలకపాత్ర పోషించాడు. కథ కడప జిల్లాకు చెందిన ధర్మ(సాయి కుమార్) ఒక తాగుబోతు. తండ్రి వారసత్వంగా వచ్చిన శ్రీరాజ్య లక్ష్మీ కల్యాణ మండపాన్ని (ఎస్.ఆర్. కల్యాణమండపం) నిర్వహించడంలో ఫెయిల్ అయి.. తాగుడుకు బానిస అవుతాడు. అతని కొడుకు కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) సిటీలో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. అదే కాలేజీలో చదువుతున్న తన గ్రామానికి పాపారావు (శ్రీకాంత్ అయ్యంగర్)గారి అమ్మాయి సింధు(ప్రయాంక జవాల్కర్)తో ప్రేమలో పడతాడు. తండ్రితో మాట్లాడడానికే ఇష్టపడని కల్యాణ్.. సింధు ప్రేమను పొందేందుకు నానా పాట్లు పడుతుంటాడు. ఒక రోజు ఇంటి నుంచి ఫోన్ రావడంతో కల్యాణ్ తన గ్రామానికి వెళ్తాడు. కొన్ని కారణాల వల్ల పేరు మాసిపోయి, గిరాకీ తగ్గిన ఎస్. ఆర్. కల్యాణమండపం నిర్వహణ బాధ్యతలను భుజానకెత్తుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కల్యాణ్.. కల్యాణ మండపాన్ని నడిపించాలని ఎందుకు పూనుకున్నాడు? ఎంతో చరిత్ర ఉన్న ఎస్.ఆర్. కల్యాణమండపానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రితో కల్యాణ్ మాట్లాడకపోవడానికి కారణమేంటి? తనంటే నచ్చని సింధు ప్రేమని కల్యాణ్ ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. నటీనటులు ఇంజనీరింగ్ స్టూడెంట్ కల్యాణ్ పాత్రలో కిరణ్ అబ్బవరం ఒదిగిపోయాడు. డాన్స్‌తో పాటు ఫైట్స్ కూడా బాగానే చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కూడా కిరణ్ అద్భుతంగా నటించాడు. సింధు పాత్రలో ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రిగా సాయికుమార్ అద్భుతంగా నటించాడు. తాగుబోతు క్యారెక్టర్ పరకాయ ప్రవేశం చేశాడు. మరీ ముఖ్యంగా భార్యతో పడే గొడవలు, అలకలు అత్యంత సహజంగా కనిపిస్తాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాపరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగర్తో పాటు ఇతర నటీ, నటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశ్లేషణ సినిమా కథ అంతా టైటిల్‌కు తగ్గట్టుగానే ఎస్. ఆర్. కల్యాణ మండపం చుట్టే తిరుగుతుంది. తండ్రి వారసత్వంగా వచ్చిన కల్యాణ మండపాన్ని సక్రమంగా నిర్వహించని అసమర్థ కొడకు, ఆయన చేతకాని తనాన్ని గుర్తించి, తాత ఆశయాన్ని భూజనకెత్తుకున్న మనవడి కథ ఇది. దీనికి ప్రేమను జోడించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీధర్ గాదె. సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ తెరపై దాన్ని పండిచడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. తండ్రి కొడుకులు మధ్య ఉండే బలమైన ఎమోషన్స్ ని ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా స్క్రిప్ట్ కూడా ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. ఎంతో గొప్ప పేరు ఉన్న ఎస్.ఆర్. కల్యాణ మండపానికి ఎందుకు బుకింగ్స్ రావడం లేదనేదానికి బలమైన కారణాన్ని చూపించలేకపోయారు. కళ్యాణ మండపం రిజిస్టర్ లో ఒక్కసారి పేరు రాసిన తర్వాత, ఆ పెళ్ళి ఎలాగైనా జరగాల్సిందే అనే సెంటిమెంట్ కూడా పెద్దంత పండలేదు. కథలో కూడా కొత్తదనం ఏమీ ఉండదు. సెంటిమెంట్ సీన్స్ వర్కౌట్ అయితే సినిమా స్థాయి వేరేలా ఉండేది. సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉండడం కాస్త ప్రతికూల అంశమే. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ బోరింగ్‌గా ఉన్నప్పటికీ.. క్లైమాక్స్‌లో తండ్రి, కొడుకు మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ కొంతమేర వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చైతన్ భరద్వాజ్ సంగీతం. కట్టిపడేసే పాటలతో పాటు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమా స్థాయిని పెంచేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. ఎడిటింగ్‌పై బాగా దృష్టిపెట్టాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా చోట్ల ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సింది. విశ్వాస్ డానియెల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రం నేటివిటీకి తగ్గట్టుగా చాలా సహజంగా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కిరణ్ అబ్బవరం, సాయికుమార్, ప్రియాంక జవాల్కర్ నటన చైతన్ భరద్వాజ్ సంగీతం మైనెస్ పాయింట్స్ రొటీన్ కథ సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ వర్కౌట్ కానీ తండ్రి, కొడుకుల ఎమోషనల్ సీన్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖంపట్టడంతో సినిమా సందడి మళ్లీ మొదలైంది. థియేటర్లు ఓపెన్ కావడంతో సీనీ ప్రియులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే గత వారం దాదాపు ఆరు సినిమాలూ విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేశాయి. తిమ్మరుసు, ఇష్క్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం. ఎస్.ఆర్.కళ్యాణమండపం ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్నాడు. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఆగస్ట్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముగ్గురు మొనగాళ్లు శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ముగ్గురు వ్యక్తులకు సంబంధించనే ఈ సినిమా కథ. వీరిలో ఒకరికి కనిపించదు. మరొకరికి వినిపించదు. ఇంకొకరు మూగ. ఈ ముగ్గురు దివ్యాంగుల జీవితంలో ఊహించని విధంగా క్రైమ్ చోటు చేసుకుంటుంది. అదేమిటీ? దాని నుండి వీరు ఎలా బయటపడ్డారు? అసలు నగరంలో జరిగే హత్యలకు వీళ్ళకు ఏమిటీ సంబంధం? అనేదే ఈ చిత్ర కథ. ఈ సినిమాలో రాజా రవీంద్ర, దివంగత నటుడు టీఎన్ఆర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెరిసే మెరిసే 'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'. కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు కాక ఇంకెప్పుడు హస్వంత్ వంగ, నమ్రత దరేకర్, కల్యాణ్ గౌడ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి, తులసి, రాజా రవీంద్ర, పూజా రామచంద్రన్, ఐడ్రీమ్ అంజలి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమా కూడా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సాహిత్య సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. క్షీరసాగర మథనం మానస్ నాగులపల్లి, సంజయ్ రావు, అక్షంత్ సోనేశ్వర్, గౌతమ్ ఎస్ శెట్టి, ఛరిష్మా, మహేశ్ కొమ్ముల తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం క్షీరసాగర మథనం. అనిల్ పంగులూరి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఆగస్ట్ 04, 2021 మనోజ్ బాజ్‌పాయ్ ‘డయల్ 100’(జీ5) మాన్స్టర్స్ ఎట్ వర్క్ (డిస్నీ+ హాట్‌స్టార్) టర్నర్ అండ్ హూచ్ (డిస్నీ+ హాట్‌స్టార్) ఐ మే డెస్ట్రాయ్ యు(సీజన్-1) హెచ్‌బీవో షార్ట్‌సర్క్యూట్ సీజన్-1 (డిస్నీ+ హాట్‌స్టార్) ఆగస్టు 6, 2021 బ్రేకింగ్ బాబీ బోన్స్(సీజన్-1) (నేషన్ జియోగ్రాఫిక్) స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(డిస్నీ+ హాట్‌స్టార్) ది మిస్టీరియస్ బెనిడిక్ట్ సొసైటీ((డిస్నీ+ హాట్‌స్టార్) స్టార్ వార్స్: గార్డెన్ రామ్సే: అన్ ఛార్టెడ్(డిస్నీ+ హాట్‌స్టార్) -
నా సెకండ్ ఇన్నింగ్స్‌కి గుర్తింపు తెచ్చే సినిమా ఇది : సాయికుమార్
‘‘నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాల్లో ‘పోలీస్ స్టోరీ, ప్రస్థానం’ ఉన్నాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటి వరకు పోషించిన పాత్రలు నా ఫస్ట్ ఇన్నింగ్స్‌కి వైభవాన్ని తీసుకొచ్చాయి. నా సెకండ్ ఇన్నింగ్స్‌కి అద్భుతమైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా ‘ఎస్ఆర్ కళ్యాణ మండంపం’ ఉంటుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. కిరణ్ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్ జంటగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 6న విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘కుటంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. సాయికుమార్ వంటి గొప్ప నటుడితో నేను పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా సినిమాని రిలీజ్ చేస్తున్న శంకర్ పిక్చర్స్ వారికి ధన్యవాదాలు’’ అన్నారు.